స్టూడెంట్‌పై దాడి వైరల్‌.. సమర్థించుకున్న టీచ‌ర్‌ | I Am Handicapped, UP Teacher Justifies Slap Muslim Classmate Incident After Outrage - Sakshi
Sakshi News home page

Muzaffarnagar School Video Controversy: స్టూడెంట్‌పై దాడి వైరల్‌.. సమర్థించుకున్న టీచ‌ర్‌ .. ఏం చెప్పిందంటే!

Published Sat, Aug 26 2023 4:35 PM | Last Updated on Sat, Aug 26 2023 6:19 PM

I Am Handicapped, UP Teacher Justifies Slap Incident After Outrage - Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ టీచర్‌ ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఖాబాపూర్‌ గ్రామంలోని ప్రైవేటు పాఠశాలలోని క్లాస్‌రూమ్‌లో ఆగస్టు 24న జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మ్యాథ్స్‌ టేబుల్‌ నేర్చుకోలేదని ఏడేళ్ల ముస్లిం బాలుడిని తోటీ విద్యార్ధులతో టీచర్‌ అమానుషంగా దాడి చేయించింది.

కాగా ఈ వీడియోను బాలుడి బంధువు నదీవ్‌ అనే వ్యక్తి వీడియో తీశారు. ఇందులో టీచర్‌.. విద్యార్థి ముఖం మీద దాడి చేయవద్దని, వెన్నులో కొట్టాలని స్టూడెంట్స్‌కు చెప్పడం వినిపిస్తోంది. ఈ వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మత విద్వేషాలను రెచ్చగెట్టే విధంగా టీచర్‌ వ్యవహరించడం రాజకీయ దుమారాన్ని రేపింది. రాహుల్‌ గాంధీ, అఖిలేష్‌ యాదవ్‌ సహా పలువురు నేతలు ఈ చర్యను ఖండిస్తూ.. టీచర్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. దేవాలయంగా భావించే పవిత్రమైన పాఠశాలలో విద్యార్థుల్లో విద్వేషాలను నింపుతున్నారని.. అధికార బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 

తాజాగా ఈ వైరల్‌ వీడియోపై టీచర్‌ త్రిప్తా త్యాగి స్పందించారు. ముస్లిం విద్యార్థిపై దాడి చేసిన చర్యను ఆమె సమర్థించుకున్నారు. బాధితుడు 5వ గుణితం నేర్చుకోవాలని చెప్పానని.. సెలవులు వచ్చినా నేర్చుకోలేదని అన్నారు. అందుకే ఇతర విద్యార్థులతో కొట్టించానన్నారు. ఈ ఘటనలో మతపరమైన కోణాన్ని ఆమె కొట్టిపారేశారు. బాలుడు తన హోంవర్క్ చేయనందున అతన్ని కొట్టమని కొంతమంది విద్యార్థులను కోరినట్లు చెప్పారు. అతనితో కఠినంగా ఉండమని పిల్లల తల్లిదండ్రుల నుంచే ఒత్తిడి వచ్చిందన్నారు. తాను దివ్యాంగురాలు అవ్వడం వల్ల కొంతమంది విద్యార్థులతో కొట్టించానని చెప్పుకొచ్చారు.

అయితే వీడియోను ఎడిట్‌ చేసి మతపరమైన కోణం వచ్చేలా బయడకు విడుదల చేశారని ఆమె ఆరోపించారు. విద్యార్ధి బంధువు క్లాస్‌లో కూర్చొని ఆ వీడియోను అతను రికార్డ్ చేశాడని తరువాత దాని ఎడట్‌ చేశాడని ఆన్నారు. విద్యార్ధిని ఉద్ధేశపూర్వకంగా కొట్టించలేదని.. తన తప్పును అంగీకరిస్తున్నానని చెప్పారు. కానీ అనవసరంగా దీనిని పెద్ద సమస్యగా మార్చవద్దని కోరారు.

‘ఇది చిన్న సమస్య అని రాజకీయ నాయకులకు చెప్పాలనుకుంటున్నాను. రాహుల్‌ గాంధీతో సహా ఇతర నేతలు దీనిపై ట్వీట్‌ చేశారు. ఇది అంత పెద్ద విషయం కాదు. ఇలాంటి చిన్న విషయాలను వైరల్‌ చేస్తే టీచర్లు ఎలా పనిచేస్తారు.’ అని ఆమె ప్రవర్తనను వెనకేసొచ్చారు. కాగా ఈ ఘటనపై కేసు నమోదైనట్లు ముజాఫర్‌నగర్‌ కలెక్టర్‌ అరవింద్‌ మల్లప్ప తెలిపారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ద్వారా చిన్నారికి, అతని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు. 

మరోవైపు టీచర్‌ కొట్టిపించడంపై బాధిత విద్యార్థి మాట్లాడుతూ.. ‘నేను గణిత పట్టికలు నేర్చుకోలేదు. నేను తప్పు చేశానని టీచర్‌ కొట్టమని చెప్పింది. తోటి విద్యార్థులతో కొట్టించింది. నాపై గట్టిగా దాడిచేయాలని ఆదేశించింది. వారు నన్ను గంటపాటు కొట్టారు’ అని వాపోయాడు. తన కొడుకు వయసు 7 ఏళ్లు అని, గంట, రెండు గంటలపాటు అతడిని చిత్రహింసలకు గురిచేశాడని బాలుడి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలపై ఆరోపణలు చేయనని.. అయితే ఇకపై తన బిడ్డను ఆ పాఠశాలకు పంపకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. 

ఇదిలా ఉండగా ముజఫర్‌ నగర్‌ వైరల్‌ వీడియోలో చెంప దెబ్బ కొట్టిన విద్యార్ధులతో బాధితుడిని కౌగించుకునేలా చేశారు రైతు సంఘాల నాయకుడు నరేష్‌ తికాయత్‌. అందరూ ద్వేషాన్ని వదిలేసి సోదరభావాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement