బాలుడిపై తోటి విద్యార్థులతో దాడి చేయించిన టీచర్.. | UP Teacher Asks Students To Slap Muslim Boy In Class, Video Viral Creates Controversy - Sakshi
Sakshi News home page

Muzaffarnagar School Video Controversy: బాధ్యత గల టీచర్ అయ్యుండి పిల్లల మనసుల్లో..  

Published Sat, Aug 26 2023 11:15 AM

UP Teacher Asks Students To Slap Muslim Boy In Class Viral Video  - Sakshi

లక్నో: యూపీలోని ఓ ప్రైవేటు పాఠశాలలోని టీచర్ ఒక ముస్లిం విద్యార్థిని తోటి విద్యార్థులతో కొట్టించిన సంఘటన పెను సంచలనంగా మారింది. విద్యార్థిని కొట్టించడం సంగతి అటుంచితే ఆమె మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది. ఈ వీడియో బయటకు పొక్కడంతో రాజకీయ వర్గాల్లో కూడా అగ్గి రాజుకుంది. 

ఉత్తర్‌ప్రదేశ్‌ ముజఫ్ఫర్‌నగర్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో పాఠాలు చెప్పాల్సిన టీచరమ్మ అమానుషంగా వ్యవహరించి పసి మనసుల్లో మత విద్వేషాలను నాటే ప్రయత్నం చేసిందని తెలిపారు యూపీ పోలీసులు. వీడియో ఆధారంగా యూపీ పోలీసులు టీచర్‌పైన చర్యలు తీసుకోవాలని విద్యా శాఖను ఆదేశించారు. 

పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం.. టీచర్ కొట్టించిన బాలుడు ముస్లిం. టీచర్ కచ్చితంగా మతపరమైన దూషణలు చేసినట్టు వీడియోలో స్పష్టమైందని అయితే ఆమె నైజం ఏమిటన్నది విచారణ చేస్తున్నామని తెలిపారు. ఆ ముస్లిం విద్యార్థి గణిత పట్టికలను నేర్చుకోలేదని మతపరమైన దూషణ చేస్తూ తోటి విద్యార్థులను ఆ బాలుడిపై దాడి చేయమని ఉసిగొల్పారన్నారు. బాలల హక్కుల సంఘం కూడా టీచర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. 

బాలుడి తండ్రి పాఠశాల యాజమాన్యం రాజీకి వచ్చిందని తాము కట్టిన ఫీజును కూడా తిరిగి చెల్లించిందని ఇకపై తమ బిడ్డను ఆ పాఠశాలకు పంపేది లేదని తేల్చి చెప్పేశారు. ఈ విషయంపై స్పందించే ఉద్దేశ్యం తనకు లేదని దీన్ని ఇక్కడితో వదిలేయాలని కోరారు. 

కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ గాంధీ ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందిస్తూ.. పవిత్రమైన పాఠశాలలో పిల్లల మనసుల్లో విద్వేషాలను నాటడం కంటే దేశద్రోహం మరొకటుండదు. ఇది దేశాన్ని బుగ్గిపాలు చేయడానికి బీజేపీ ప్రభుత్వం పోసిన ఆజ్యమే. చిన్న పిల్లలు దేశ భవిష్యత్తు. వారిని ద్వేషించకుండా ప్రేమతత్వాన్ని నేర్పాలని అన్నారు. 

మరో ఎంపీ జయంత్ సింగ్ స్పందిస్తూ.. హింసను రెచ్చగొడుతూ మైనారిటీలకు వ్యతిరేకంగా మతవిద్వేషాలు ఎంత లోతుగా పాతుకుపోయాయనడానికి ఈ సంఘటన ఒక నిదర్శనమన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని విద్యార్థి భవిష్యత్తు పాడవకుండా చూడాలని.. పోలీసులు కేసును సుమోటోగా స్వీకరించాలని డిమాండ్ చేశారు.   

ఇది కూడా చదవండి: బెంగళూరులో మోదీ.. 'జై విజ్ఞాన్, జై అనుసంధాన్' నినాదాలు

Advertisement
Advertisement