లబ్ధిదారునికి చెక్కు అందజేస్తున్న మంత్రులు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి అన్నివర్గాలను పేదరికం నుంచి బయటపడేసేందుకు వివిధ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. అన్ని కులాలు, మతాలను గౌరవిస్తూ.. వారికి సమానంగా సంక్షేమాన్ని అందించడమే బీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
శనివారం ఎల్బీ స్టేడియంలో మైనారిటీలకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించే పథకాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగిస్తూ ముస్లిం, క్రైస్తవ మైనారిటీల అభ్యున్నతి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో మైనారిటీల సంక్షేమం కోసం సుమారు రూ.15 వేల కోట్లను ఖర్చు చేశామని తెలిపారు.
మైనారిటీ నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధికి వంద శాతం సబ్సిడీ కింద ఒక్కో లబ్ధి దారుడికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్నామని, ఈ పథకం కింద రాష్ట్రం మొత్తం మీద 27 వేల మందికి ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. తొలివిడతగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు పది వేల మందికి రూ.లక్ష చొప్పున అందిస్తున్నామని తెలిపారు.
మైనారిటీలకు కార్పొరేట్ స్థాయి విద్య..
మైనారిటీ వర్గాల విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి వసతులతో పాటు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సుమారు 204 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి అందరికీ విద్య అందించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ప్రస్తుతం లక్షకు పైగా విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తున్నామని చెప్పారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు అబ్దుల్ అహ్మద్ బిన్ బలాలా, జాఫర్ హుస్సేన్, కాలేరు వెంకటేశ్, తెలంగాణ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహ్మద్ ఇంతియాజ్ ఇషాక్, క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రాజేశ్వర్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment