కడప కార్పొరేషన్: ఈనాడు అధినేత రామోజీరావు ముస్లిం, మైనార్టీలపై ఒలకబోస్తున్న ప్రేమాభిమానాలు తమకు అక్కర్లేదని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బి అంజద్ బాషా అన్నారు. కడపలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి సమీపంలోని పెద్దకూరపాడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో ఘర్షణ జరిగితే శాంతిభద్రతలను పరిరక్షించే క్రమంలో పోలీసులు తీసుకున్న చర్యల్లో ఒక ముస్లిం యువకుడు గాయపడ్డాడని ఈనాడులో ప్రచురించడం హాస్యాస్పదమన్నారు.
రెండు వర్గాలు ఘర్షణకు దిగినప్పుడు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు చర్యలు తీసుకోవడం వారి వృత్తి ధర్మమన్నారు. ఆ సమూహంలో ఏ కులం, ఏ మతం వారున్నారో వారికెలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఈ మాత్రం కనీస జ్ఞానం కూడా లేకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా రాయడం బాధాకరమన్నారు.
2014 నుంచి 2019 వరకూ టీడీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలను అణగదొక్కి, ఒక్క ముస్లింకు కూడా కేబినెట్‌లో చోటు కల్పించకపోతే ఈనాడు ఎందుకు రాయలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుకు వినతిపత్రాన్ని ఇవ్వాలనుకున్న తనను హౌస్ అరెస్టుచేశారని, అది కూడా రామోజీకి కనిపించలేదన్నారు. నిజంగా ముస్లిం యువతపై దాడులు జరిగితే తమ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని అంజద్ బాషా స్పష్టంచేశారు. మైనార్టీలపై చంద్రబాబు, రామోజీలది కపట ప్రేమ అన్నారు.
టీడీపీ దేశద్రోహం కేసు పెట్టినా రాయలేదు
టీడీపీ హయాంలో.. నారా హమారా సభలో ముస్లిం యువకులు ప్లకార్డులు ప్రదర్శిస్తే వారిపై దేశద్రోహం కేసులు పెట్టినప్పుడు ఇది అన్యాయమని అప్పట్లో రామోజీ తన ఈనాడులో రాయలేదని.. అప్పుడు రామోజీరావు ఎక్కడ దాక్కున్నారని ఆయన ప్రశ్నించారు. అలాగే, బాబు పాలనలో ముస్లిం మైనార్టీలపై ఎన్నో దౌర్జన్యాలు, జరిగినా రాయలేదన్నారు. ఇప్పుడు చిన్న సంఘటన జరిగితే అందులో ముస్లిం యువకుడు గాయపడ్డాడని భూతద్దంలో చూపడం అన్యాయమన్నారు.
చదవండి: మార్గదర్శి అక్రమ వ్యవహారాల కేసులో సీఐడీ కీలక నిర్ణయం
అసలు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఒక మైనార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి, నలుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, 12 కార్పొరేషన్ చైర్మన్లు, ఒక డిప్యూటీ చైర్మన్ పదవులిచ్చి మంచి చేస్తున్నా రాయలేదన్నారు. ఇవన్నీ రామోజీరావుకు ఎందుకు కనిపించవని అంజద్ బాషా ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్ ఉండగా ఏ ముస్లిం, మైనార్టీకి అన్యాయం జరగదని ధీమా వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment