సాక్షి, వైఎస్సార్ జిల్లా: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లో ప్రజలకిచ్చిన హామీలు తుంగలో తొక్కారంటూ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే చంద్రబాబు సర్కార్‌లో కనిపిస్తోందని.. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ధ్వజమెత్తారు.
‘‘నిధులు లేవంటూ వైఎస్ జగన్‌పై నిందలు వేస్తూ కాలయాపన చేస్తున్నారు. తమ వైఫల్యాలను కప్పి పుచుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. రాజ్యాంగబద్ధంగా 2023లో జీవో 47 కింద వక్ఫ్ బోర్డు నియామకం చేశాం. దాన్ని నిన్న ఆ జీవోను ఉపసంహరించుకోవడం దుర్మార్గం. పూర్తి నిబంధనల మేరకు వక్ఫ్ బోర్డు నియామకం జరిపాం. ఎమ్మెల్యేలు, ముత్తవలీలు, స్థానికసంస్థలు.. ఇలా అన్ని కేటగిరీలో నియామకాలు జరిగాయి. బోర్డు సభ్యులు చైర్మన్ ఎన్నిక చేసుకుంటే ఆనాడు టీడీపీ వారు కోర్టులో కేసు వేసి నిలుపుదల చేశారు. చైర్మన్ ఎన్నిక కాకుండా ఆనాడు నాలుగు పిటిషన్లు వేశారు. ఈ అంశం ఇంకా కోర్టులోనే ఉంది.. మరి కమిటీని ఎలా రద్దు చేస్తారు..?’’ అంటూ ప్రశ్నించారు.
‘‘కేవలం టీడీపీ వారిని నియమించుకుని వక్ఫ్ ఆస్తులకు దురాక్రమణ చేయాలనే ఆ జీవో రద్దు చేశారు. బోర్డు చాలా కాలంగా పని చేయడం లేదంటూ రద్దు చేశామని చెప్తున్నారు. కోర్టులో కేసులు వేసి పని చేయకుండా చేసింది మీ టీడీపీ వారు కాదా..?. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కోర్టులో రిట్‌లను ఉపసంహరించుకోవాలి.. కానీ బోర్డు రద్దు చేయడం ఏమిటి..?
..2014-19 మధ్యలో చంద్రబాబు అసలు వక్ఫ్ బోర్డు వేయనే లేదు. 2018లో చంద్రబాబు కమిటీ వేస్తే దాని కాలం 2023 వరకూ ఉంది. మేము అధికారంలోకి వచ్చాకా చంద్రబాబులా ఆ బోర్డును మేము రద్దు చేయలేదు.. ఆ రోజు జలీల్ ఖాన్, అమీర్ బాబు వంటి వారు రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఆ బోర్డు కాలపరిమితి ముగిసిన తర్వాత మాత్రమే మేం కొత్త బోర్డు వేశాం. కానీ మీరు మేము వేసిన బోర్డు కాలపరిమితి ముగియకముందే రద్దు చేయడం దుర్మార్గం. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని తెచ్చింది.. దాన్ని ముస్లింలంతా అంతా వ్యతిరేకిస్తున్నారు
వైఎస్ జగన్ ఆదేశాలతో పార్లమెంటులో వైఎస్సార్‌సీపీ వ్యతిరేకించింది. వక్ఫ్ ఆస్తులకు అన్యాక్రాంతం చేసేందుకే ఈ చట్టం తెస్తున్నారు. దీనివల్ల ముస్లింల హక్కులు దెబ్బతింటున్నాయి.. అందుకే వైఎస్సార్సీపీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఉంది. జమాతే ముస్లిం నేతలు కూడా జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జీవో 47 రద్దుపై మేము కచ్చితంగా చట్టప్రకారం పోరాడతాం. మైనారిటీలకు ఎక్కడ అన్యాయం జరిగినా వైఎస్సార్‌సీపీ తరపున పోరాడతాం’’ అని అంజాద్ బాషా స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment