సౌదీ అరేబియాలో లక్షలాది మంది ముస్లిం యాత్రికులు ఆదివారం నాడు సైతానును రాళ్లతో కొట్టి చంపే ఆచారాన్ని ప్రారంభించారు. ఈ ఆచారం హజ్‌యాత్ర చివరి రోజులలో నిర్వహిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు సంబంధించిన ఈద్ అల్-అధా వేడుకల ప్రారంభాన్ని సూచిస్తుంది.
సైతాను(దుష్టశక్తి)ను రాళ్లతో కొట్టడం అనేది ఇస్లాంలోని ఐదు ప్రముఖ ఆచారాలలో ఒకటి. ఇది హజ్‌యాత్రలో చివరి ఆచారం. పవిత్ర నగరం మక్కా వెలుపల ఉన్న అరాఫత్ పర్వతం వద్ద లక్షలమంది ముస్లిం యాత్రికులు గుమిగూడి ఈ ఆచారాన్ని నెరవేరుస్తారు. ఐదు రోజుల పాటు ఈ హజ్ ఆచారం కొనసాగుతుంది.
యాత్రికులు శనివారం సాయంత్రం ముజ్దలిఫా అనే ప్రదేశంలో గులకరాళ్లను సేకరించారు. వీటితో సైతానుకు ప్రతీకంగా నిలిచిన స్తంభాలను కొడతారు . ఈ స్తంభాలు మక్కాలో మీనా అనే పవిత్ర స్థలంలో ఉన్నాయి.
హజ్‌కు వచ్చే యాత్రికులు మూడు రోజుల పాటు మీనాలో ఉంటారు. అక్కడ నుండి వారు భారీ స్తంభాలు కలిగిన బహుళ అంతస్తుల సముదాయానికి వెళ్తారు. యాత్రికులు ఇక్కడి మూడు స్తంభాలను ఏడు గులకరాళ్లతో కొడతారు. దీనిని వారు చెడును తరిమికొట్టడానికి చిహ్నంగా పరిగణిస్తారు. అనంతరం మీనా నుండి మక్కా చేరుకునే ముస్లింలు అక్కడ తవాఫ్ (ప్రదక్షిణ) చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment