వక్ఫ్ చట్టానికి కీలక సవరణలు చేయనున్న కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: ముస్లిం మతపరమైన, ధార్మిక ప్రయోజనాల కోసం దానంగా వచ్చిన ఆస్తులను పర్యవేక్షించే వక్ఫ్ బోర్డుల్లో మరింత పారదర్శకత సాధించే లక్ష్యంతో సంబంధిత చట్టంలో కీలక మార్పులకు కేంద్రం నడుంబిగించింది. ఇందులోభాగంగా వక్ఫ్ బోర్డుల పాలనా వ్యవహారాల్లో మహిళలు, ముస్లి మేతరులకు చోటు కల్పించాలని భావిస్తోంది. ఈ మేరకు వక్ఫ్ చట్టంలో సవరణలు తేవాలని నిర్ణయించింది.
ఇందులో భాగంగా వక్ఫ్ చట్టం,1995 పేరును యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్, ఎంపవర్‌మెంట్, ఎఫీషియెన్సీ అండ్ డెవలప్‌మెంట్ యాక్ట్,1995గా మార్చుతూ వక్ఫ్ (సవరణ)బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. సంబంధిత బిల్లు వివరాలు మంగళవారం లోక్‌సభ సభ్యులకు అందాయి. ఆ బిల్లులోని అభ్యంతరాలు, అందుకు కారణాల జాబితా ప్రకారం ప్రస్తుత వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40ని తొలగించనున్నారు.
ఏదైనా ఆస్తి వక్ఫ్‌కు చెందినదిగా నిర్ణయించే అధికారం ప్రస్తుతం వక్ఫ్ బోర్డుకే ఉంది. ఇంతటి అపరిమిత అధికా రాలను తగ్గించాలని బిల్లులో ప్రతిపాదించారు. కేంద్ర వక్ఫ్ మండలి, రాష్ట్రాల వక్ఫ్ బోర్డుల్లో భిన్న వర్గాలకు, ముస్లిం పురుషులతోపాటు మహిళలు, ముస్లిమేత రులకూ ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ముస్లింలలో బోరా, అగాఖనీల కోసం ప్రత్యేకంగా బోర్డ్ ఆఫ్ ఔఖాఫ్‌ను ఏర్పాటు చేయనున్నారు. కనీసం ఐదేళ్లుగా ఇస్లామ్ మతాన్ని ఆచరిస్తూ సొంత ఆస్తిని దానంగా ఇస్తేనే దానిని ‘వక్ఫ్’గా పేర్కొనాలని ‘వక్ఫ్’ పదానికి బిల్లు కొత్త నిర్వచనం ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment