సాక్షి, హైదరాబాద్: మైనార్టీల సంక్షేమంలో భాగంగా ప్రకటించిన రూ.లక్ష ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. మొదటి దశలో భాగంగా ఎంపిక చేసిన 10 వేల మంది లబ్దిదారులకు ఈ నెల 16 నుంచి రూ.లక్ష చెక్కుల పంపిణీ ప్రారంభించాలన్నారు. ఈ పథకానికి ఇప్పటికే రూ. 270 కోట్లు కేటాయించగా, ఇప్పుడు మరో రూ.130 కోట్లు కేటాయించామని, దీంతో మొత్తం రూ. 400 కోట్లకు చేరిందన్నారు.
అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మైనార్టీల సమస్యలపై చర్చించేందుకు సచివాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, గంగుల, తలసాని, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎస్ శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, మైనారిటీ శాఖ కార్యదర్శి ఉమర్ జలీల్ పాల్గొన్నారు. మైనారిటీలకు రూ.లక్ష సాయం, ఓవ ర్సీస్ స్కాలర్‌షిప్స్, శ్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్, మౌజం సంఖ్య పెంపు, క్రిస్టియన్ శ్మశాన వాటికలు, ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ తదితర అంశాలపై చర్చించారు.
అన్ని వర్గాల అభివృద్ధికి....
రాష్ట్రంలో మైనారిటీలతోపాటు అన్ని వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం శ్రద్ధ వహిస్తుందని హరీశ్‌రావు చెప్పారు. శ్మశానవాటికలకు 125 ఎకరాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్‌లు–మౌజంల సంఖ్య పెంపుపై ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో జనాభా దామాషా ప్రకారం లబ్దిదారుల ఎంపిక సాగాలని, మైనారిటీల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
శ్మశానవాటికలు, ఈద్గాల భూముల కోసం వచ్చిన వినతులను క్రోడీకరించాలని, ఈ దిశగా పనులు వేగవంతం చేయాలని చెప్పారు. ఒవైసీ పహాడీ షరీఫ్ దర్గా ర్యాంప్ పనులు, దర్గా బర్హనా షా అద్దెల సవరణ, క్రిస్టియన్ శ్మశానవాటికలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఇతర పనులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు విడుదల చేయాలన్నారు.
16 నుంచి మైనారిటీలకు రూ.లక్ష సాయం
Published Wed, Aug 9 2023 5:18 AM | Last Updated on Wed, Aug 9 2023 10:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment