మహారాష్ట్రలో ఓ విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. నిండు గర్భిణిగా ఉన్న ఓ ముస్లిం మహిళ ఊహించని రీతిలో రైలులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇతర మహిళా ప్రయాణికులు ఆమెకు పురుడు పోశారు. రైలులో తనకు పుట్టిన బిడ్డకు ఆ తల్లి ఆ రైలు పేరునే పెట్టింది. ఇకపై తన బిడ్డను ఆ రైలు పేరుతోనే పిలుచుకుంటానని తెలిపింది.
వివరాల్లోకి వెళితే జూన్ 6న ఉదయం కొల్హాపూర్-ముంబై మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న గర్భిణి ఫాతిమా ఖాతూన్ (31)కు పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఈ విషయాన్ని ఆమె రైలు లోనావాలా స్టేషన్‌కు చేరుకుంటున్న సమయంలో భర్త తయ్యబ్‌కు తెలిపింది. తయ్యబ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫాతిమాకు వాంతులు అవుతుండటంతో ఆమె రైలులోని టాయిలెట్‌కు వెళ్లింది. ఎంతసేపటికీ ఫాతిమా తిరిగి రాలేదు. దీంతో తయ్యబ్ టాయిలెట్‌లోనికి వెళ్లి చూశాడు. ఫాతిమా ఆడబిడ్డకు జన్మనిచ్చిందని గుర్తించాడు. రైలులో ఉన్న ఇతర మహిళా ప్రయాణికులు ఈ సంగతి తెలిపాడు. దీంతో వారు ఫాతిమాకు సహాయం అందించారు.
ఈ విషయాన్ని తయ్యబ్ రైల్వే పోలీసులకు తెలియజేశాడు. రైలు లోనావాలా స్టేషన్‌కు చేరుకోగానే అక్కడి రైల్వే సిబ్బంది ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తల్లీబిడ్డకు చికిత్స అందించారు. వారి ఆరోగ్య పరిస్థితి కుదుటపడ్డాక వారిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు.
ఈ సందర్భంగా తయ్యబ్ మీడియాతో మాట్లాడుతూ తన భార్య డెలివరీ తేదీ జూన్ 20 అని, అయితే ఇంతలోనే ఆమె రైలులో ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు. తమకు ఇప్పటికే ముగ్గురు కుమారులు ఉన్నారన్నారు. తాము ఆ రైలులో ప్రయాణిస్తున్నప్పుడు తిరుపతి నుంచి మహాలక్ష్మి ఆలయానికి వెళ్తున్న కొందరు ప్రయాణికులు తమ బిడ్డను చూసి ‘మహాలక్షి ఎక్స్‌ప్రెస్’లో లక్ష్మీదేవి జన్మించిందని అన్నారని తయ్యబ్ పేర్కొన్నాడు. ఈ మాట విన్న తన భార్య తమ బిడ్డకు ‘మహాలక్ష్మి’ అనే పేరు పెట్టిందని ఆయన తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment