సామూహిక నమాజులు చేసేచోట మద్యం సేవించి మూత్రవిసర్జన
ఈద్గాకు తాళం వేసి ఉండటంతో ప్రహరీ పగులగొట్టి లోనికి ప్రవేశించిన దుండగులు
సత్తెనపల్లి: ముస్లింలు పవిత్రంగా భావించే ఈద్గా స్థలాన్ని టీడీపీ మూకలు అపవిత్రం చేసిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో శనివారం రాత్రి జరిగింది. ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారానికి టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం రాత్రి సత్తెనపల్లి వచ్చారు. దీంతో ఆ పార్టీకి చెందిన కొందరు రౌడీ మూకలు ఈద్గా స్థలంలోకి చొరబడి మద్యం సేవించి, పొగతాగుతూ మూత్ర విసర్జన చేశారు. ఈద్గా స్థలానికి తాళం వేసి ఉండటంతో ప్రహరీ పగులగొట్టి టీడీపీ మూకలు లోపలికి ప్రవేశించాయి. అక్కడే ఆహారం వండుకుని, మద్యం సేవించి ఖాళీ సీసాలు, సిగరెట్ పెట్టెలు పడేశారు. ఆ ప్రాంతంలోనే మూత్ర విసర్జన కూడా చేశారు.
ఈద్గా ప్రాంతాన్ని ఆదివారం ముస్లింలు, మత పెద్దలు పరిశీలించి తమ మనోభావాలను దెబ్బ తీశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మునిసిపల్ వైస్ చైర్మన్ షేక్ నాగుర్‌మీరా మాట్లాడుతూ.. రంజాన్ రోజున 10 వేల మంది ముస్లింలు సామూహిక నమాజులకు హాజరయ్యే ఈద్గా స్థలంలో మద్యం సేవించి, మూత్ర విసర్జన చేయడం బాధాకరమన్నారు. టీడీపీ ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం దారుణమన్నారు. ఈద్గా ప్రాంతమంతా పరిశీలించి అక్కడ పడేసిన ఖాళీ మద్యం సీసాలను, సిగరెట్ పెట్టెలను తొలగించారు.
ఈద్గాలోని నమాజ్ చేసే ప్రాంతాన్ని వాటర్ ట్యాంకర్‌తో నీటిని రప్పించి కడిగి శుభ్రం చేశారు. ఈద్గా స్థలాన్ని అపవిత్రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు షేక్ నాగుల్‌బాషా, నాయకులు సయ్యద్ సలీం, షేక్ మహమ్మద్ గని, షేక్ జానీ, షేక్ ముక్త్యార్, హుస్సేన్, మత పెద్దలు సుభానీఖాన్, ఖలీల్, సయ్యద్ హుస్సేన్, మహీబుల్లా, చిన్నమాబు, యూసఫ్, రెహమాన్, షేక్ కరీం, ఖాజా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment