అభిప్రాయం
ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి కొత్త చిక్కు వచ్చిపడింది. ముస్లిం మైనారిటీలకు అమలు చేస్తున్న నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ బీజేపీ అగ్రనేత ఒకరు ప్రకటించడం ఇందుకు కారణం. బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ ఈ ప్రకటనను ఖండించకపోవడం ముస్లిమ్ మైనారి టీలు గమనిస్తున్నారు. అందుకే ఇప్పటికే అరకొ రగా ఉన్న ముస్లిమ్‌ల మద్దతు తమ పార్టీ పూర్తిగా కోల్పోతుందని టీడీపీ భయపడుతోంది.
ఇటీవల ఓ బహిరంగ సభలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ ముస్లిమ్ మైనారిటీలకు అమలు చేస్తోన్న నాలుగు శాతం రిజర్వేషన్లను తప్పుపట్టారు. ఈసారి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లిమ్ల రిజ ర్వేషన్లను రద్దు చేస్తామని తెగేసి చెప్పారు. లోక్ సభకు ఇప్పటికే జరిగిన రెండు విడతల పోలింగ్‌లో బీజేపీకి నిరాశే ఎదురైనట్లు సంకేతాలు
అందుతున్నాయి. దీంతో కులాలకతీతంగా యావత్ హిందూ ఓటు బ్యాంకును కమలం పార్టీ వైపు మళ్లించడానికి బీజేపీ అగ్రనేతలు ముస్లిమ్‌ల రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించారని భావిస్తున్నారు.
ముస్లిమ్‌ల వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయడానికి 2005లో కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాజేందర్ సచార్ నాయకత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం ఏడుగురు సభ్యులున్న సచార్ కమిటీ 2006లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సచార్ కమిటీ నివేదిక ప్రకారం భారతదేశ జనాభాలో ముస్లిమ్‌లు 14 శాతం ఉన్నారు.
అయితే అధికార యంత్రాంగంలో ముస్లిమ్‌ల శాతం కేవలం 2.5 శాతం మాత్రమే. దళితులు, ఆదివాసీల కంటే దారుణ పరిస్థితుల్లో ముస్లి మ్‌లు ఉన్నారు. చదువు లేకపోవడమే ముస్లిమ్ సమాజం ఎదుర్కొంటున్న సకల సమస్యలకు ప్రధాన కారణమని జస్టిస్ రాజేందర్ సచార్ కమిటీ కుండబద్దలు కొట్టింది. ముస్లిమ్ సమాజం మేలు కోసం మొత్తం 76 సిఫార్సులు చేసింది ఈ కమిటీ. అయితే వీటిలో అమలుకు నోచుకున్నవి అతి తక్కువ.
వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ముస్లిమ్‌ల జీవితాల్లో వెలుగులు నింపడానికి నాలుగు శాతం రిజర్వేషన్లు ప్రవేశ పెట్టారు. విభజన తరువాత కూడా ఆంధ్రప్ర దేశ్‌లో ముస్లిమ్‌లకు నాలుగుశాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. ఇప్పుడు బీజేపీ అగ్రనేతలు ఈ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్నా చంద్ర బాబు నోరు మెదపకపోవడం విడ్డూరం. నెత్తి మీద టోపీ పెట్టుకుని... ముస్లిమ్‌లతో ఆత్మీయ సమావేశాలంటూ సందడి చేసే చంద్రబాబు అసలు రంగు బయటపడింది.
వాస్తవానికి రాయలసీమలో ముస్లిమ్ మైనా రిటీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. కర్నూలు,నంద్యాల, కడప, రాయచోటి, కదిరి లాంటి అనేక ప్రాంతాల్లో గెలుపు ఓటములను ప్రభా వితం చేయగల స్థాయిలో ముస్లిమ్‌లు ఉన్నారు. రాయలసీమే కాదు కోస్తా జిల్లాల్లో కూడా వీరి జనాభా భారీగానే ఉంది. గుంటూరు తూర్పు, పెదకూరపాడు, సత్తెనపల్లి, నరసరావు పేట, చిలకలూరిపేట, విజయవాడ పశ్చిమం, బందరు, పెడన వంటి అనేక ప్రాంతాల్లో కూడా ముస్లిమ్ మైనారిటీలు అభ్యర్థుల జయాపజయా లను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తారు.
అటువంటి ముస్లిమ్‌ల రిజర్వేషన్లు రద్దు చేస్తామని బీజేపీ అంటే తెలుగుదేశం నిశ్శబ్దంగా ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే ముస్లిమ్‌ల రిజర్వే షన్ రద్దు ఖాయం అని ముస్లిమ్‌లు బలంగా నమ్ముతున్నారు. దీంతో ఇప్పటివరకు కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి అనుకూలంగా ఉన్న ముస్లి మ్‌లు పోలింగ్ నాటికి జగన్‌కి జై కొడతారని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
ఎస్. అబ్దుల్ ఖాలిక్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
మొబైల్: 63001 74320
Comments
Please login to add a commentAdd a comment