రామవరప్పాడు/గన్నవరం : లోకేశ్ యువగళం పాదయాత్ర కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ప్రజలు, ప్రయాణికుల సహనానికి పరీక్ష పెట్టింది. విజయవాడ రూరల్ మండలం నిడమానూరుకు చేరుకున్న పాదయాత్ర విజయవాడ మీదుగా సోమవారం గన్నవరం నియోజకవర్గానికి చేరుకోగా.. సాయంత్రం నిడమానూరు క్యాంప్ సైట్‌లో బీసీ సామజికవర్గాల ప్రతినిధులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు.
సమావేశంలో బీసీ ప్రతినిధుల కంటే టీడీపీ నేతలే ఎక్కువగా ఉన్నారు. సమావేశంలో.. ‘ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ముస్లిం మైనార్టీలకు ఏం చేశాడ’ని లోకేశ్‌ను ప్రశ్నించేందుకు ప్రయత్నించిన ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్‌ను పోలీసులు అడ్డుకున్నారు. లోకేశ్ మాట్లాడుతుండగానే జనం మెల్లగా జారుకున్నారు.
గన్నవరం చేరుకున్న పాదయాత్ర
అనంతరం.. లోకేశ్ పాదయాత్ర సోమవారం రాత్రి కృష్ణాజిల్లా గన్నవరం చేరుకుంది. అంతకుముందు, కేసరపల్లి వద్ద మండలంలోకి ప్రవేశించిన యాత్ర ఎయిర్‌పోర్ట్, దుర్గాపురం, గన్నవరం మీదుగా చిన్నఆవుటపల్లిలోని ఎన్‌ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఆవరణలో క్యాంప్ సైట్‌కు చేరుకుంది. పాదయాత్ర జాతీయ రహదారిపై కొనసాగడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నప్పటికీ టీడీపీ శ్రేణుల అత్యుత్సాహం ఫలితంగా ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. కొంతమంది మద్యం మత్తులో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. ఇక లోకేశ్ సమక్షంలో కేడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరారు. మరోవైపు.. మండల పార్టీ ఇచ్చిన రూటుకు భిన్నంగా ఎమ్మెల్యే కార్యాలయం మీదుగా పాదయాత్ర వెళ్లాని టీడీపీ నేతలు పట్టుబట్టారు. అయితే, పోలీసులు అంగీకరించలేదు. దీంతో రూట్‌మ్యాప్ ప్రకారం పాదయాత్ర కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment