
దేశంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని బీహారీపూర్ బరేలీలోని దారుల్ ఉలూమ్ షేన్ అలా హజ్రత్‌లో ఆల్ ఇండియా ముస్లిం జమాత్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షహబుద్దీన్ రిజ్వీ బరేల్వీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పంద్రాగస్టున ముస్లింలు తమ ఇళ్లు, దుకాణాలు, మదర్సాలు, దర్గాలు, పాఠశాలలు, కళాశాలలు, ఇస్లామిక్ సంస్థలలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని విజ్ఞప్తి చేశారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సంతోషకరమైన సందర్భంగా ప్రతి భారతీయుడు, ముఖ్యంగా ముస్లింలు తమ ఇళ్లు, దుకాణాలపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరుతున్నామన్నారు. మదర్సాలు, విద్యాసంస్థలు స్వాతంత్య్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకోవాలని, ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని మౌలానా ముఫ్తీ షహబుద్దీన్ కోరారు.
స్వాతంత్య్ర పోరాటంలో హిందూ, ముస్లిం సంఘాలు సహకారం మరువరానిదన్నారు. అన్ని వర్గాల త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్ర పోరాటం విజయవంతమైందన్నారు. పంద్రాగస్టున ప్రత్యేక తపాలా బిళ్లలను విడుదల చేయాలని, వివిధ కూడళ్లకు స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను పెట్టాలని ఆయన సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment