ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఈ రోజు (సోమవారం) లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. ఇటీవలే ఇక్కడే నూతన రామాలయాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ముస్లిం ఓటర్లు వివిధ పార్టీలు, నేతలపై తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. తమది ‘మందిరం-మసీదు’ సమస్య కాదని, ఉపాధి- అభివృద్ధికే తమ మొదటి ప్రాధాన్యత అని వారు చెబుతున్నారు.
రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో కీలక ప్రాత్ర పోషించిన ఇక్బాల్ అన్సారీతో సహా కొంతమంది ముస్లింలు అయోధ్య అభివృద్ధి క్రెడిట్‌ను బీజేపీకి ఇచ్చారు. అన్సారీ మీడియాతో మాట్లాడుతూ ‘ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ నేతలు దేవుడిని స్మరించుకుంటారు. కానీ ప్రజలు మాత్రం ఆరోగ్యం, విద్యా సౌకర్యాలు, భద్రతను కోరుకుంటారు. అయోధ్యలో బీజేపీ అభివృద్ధి పనులు చేసింది. అందుకే బీజేపీకి ప్రజాదరణ దక్కింది. పోలింగ్ రోజున తప్పకుండా ఓటు వేస్తాను’ అని ఆయన తెలిపారు.
ముస్లిం మహిళలు బీజేపీ వెంటే ఉన్నారని బీజేపీ నేత అష్ఫాక్ హుస్సేన్ పేర్కొన్నారు. స్థానికుడు బబ్లూ ఖాన్ మాట్లాడుతూ ట్రిపుల్ తలాక్ విషయంలో ముస్లిం మహిళలకు బీజేపీ మంచి పరిష్కారం చూపింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలోనూ బీజేపీ సమర్ధవంతంగా వ్యవహరించింది. ఫైజాబాద్ లోక్‌సభ స్థానంలోని రుదౌలీ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద పెద్ద సంఖ్యలో ముస్లింలకు ఇళ్ల కేటాయింపు జరిగింది. అయోధ్యలో జరుగుతున్న అభివృద్ధిపై స్థానికులు సంతృప్తిగా ఉన్నారు. ఫైజాబాద్‌కు చెందిన ప్రస్తుత బీజేపీ ఎంపి లల్లూ సింగ్ మూడవసారి గెలుస్తారని బబ్లూ ఖాన్ పేర్కొన్నారు.
మందిరం-మసీదులపై ప్రజలకు ఆసక్తి లేదని, యువతకు ఉద్యోగాలు కావాలని స్థానికుడు మహ్మద్ అమీర్ పేర్కొన్నారు. మాకు ఉద్యోగం కావాలి. మందిరం-మసీదు అనేవి మా ఇంటికి ఉపయోగపడవు. తాను ముస్లింను అయినందున ఇలా అనడం లేదని, ఒక నిరుద్యోగిగా తన ఆవేదన చెబుతున్నానని అన్నారు. ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీకే ఓటేస్తానని అమీర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment