లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో యూపీలో బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని 80 సీట్లలో ఎస్పీకి 37, బీజేపీకి 33, కాంగ్రెస్‌కు 6, ఆర్‌ఎల్‌డీకి 2, ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీరామ్)కి ఒకటి, అప్నాదళ్ (సోనేలాల్)కి ఒక సీటు లభించింది. అయోధ్యలో బీజేపీకి ఘోర పరాభవం ఎదురయ్యింది. దీనికి పలు కారణాలున్నాయంటున్నారు విశ్లేషకులు.
అయోధ్యలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్ 54,567 ఓట్లతో విజయం సాధించారు. ఆయనకు మొత్తం 5,54,289 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్‌కు 4,99,722 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి సచ్చిదానంద్ పాండే 46,407 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో యూపీ లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి చేకూరుతుందని బీజేపీ భావించింది. అయితే ఈ విషయంలో బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయి.
కుల సమీకరణ:
అయోధ్యలో పాసి వర్గం (దళితులు) పెద్ద సంఖ్యలో ఉంది. అయోధ్యలో ఎస్పీ తన అభ్యర్థిగా ఈ వర్గానికి చెందిన అవధేష్ ప్రసాద్‌ను ఎన్నికల బరిలో నిలిపింది. అవధేష్ ప్రసాద్ యూపీ రాజకీయాల్లో దళితుల తరపున గొంతువిప్పే నాయకునిగా పేరొందారు.
అవధేష్‌కు ఆదరణ:
ఎస్పీ అభ్యర్థి అవధేష్ ప్రసాద్‌కు అయోధ్య ప్రజల్లో అత్యధిక ఆదరణ ఉంది. ఆయన తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రిగా కూడా పనిచేశారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఆయన ఒకరు.
రాజ్యాంగంపై ప్రకటన:
అయోధ్య బీజేపీ అభ్యర్థి లల్లూ సింగ్ రాజ్యాంగానికి సంబంధించి చేసిన ప్రకటనపై బెడిసికొట్టింది. ‘రాజ్యాంగాన్ని మార్చాలంటే మోదీ ప్రభుత్వానికి 400 సీట్లు కావాలని’ లల్లూ సింగ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన బీజేపీకి ఎదురుదెబ్బగా మారింది.
లల్లూ సింగ్‌పై అసంతృప్తి:
లల్లూ సింగ్ అయోధ్య నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ ఆయనను మూడోసారి అభ్యర్థిగా నిలబెట్టింది. అయోధ్య పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి కానరాకపోవడంతో లల్లూపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యింది. బీజేపీ రామమందిరంపై దృష్టి పెట్టి, ప్రజా సమస్యలను ఉపేక్షిందనే ఆరోపణలున్నాయి. ఈ కారణంగానే లల్లూ ఓటమి పాలయ్యారు.
ఇళ్లు, దుకాణాల కూల్చివేత:
అయోధ్యలో 14 కి.మీ పొడవున రామ్ పథాన్ని నిర్మించారు. అలాగే భక్తి పథం, రామజన్మభూమి పథాలు కూడా నిర్మించారు. వీటి కారణంగా తమ ఇళ్లు, దుకాణాలు దెబ్బతిన్నాయని, ఎవరికీ నష్టపరిహారం అందలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రిజర్వేషన్ అంశం:
అయోధ్యలో బీజేపీ నేతలు తమ పార్టీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ ప్రచారాన్ని సాగించారు. రాజ్యాంగాన్ని మారుస్తామని కూడా వ్యాఖ్యానించారు. దీంతో ఓటర్లు ఎస్పీ వైపు మొగ్గు చూపారు.
యువతలో ఆగ్రహం:
అయోధ్యలో యువత ఓట్లు కూడా బీజేపీకి వ్యతిరేకంగా పడ్డాయి. స్థానికులు అగ్నివీర్ పథకం విషయంలో ప్రభుత్వంతో ఏకీభవించలేదు. పేపర్ లీక్‌లు కూడా మరో కారణంగా నిలిచాయి.
కాంగ్రెస్‌పై సానుభూతి:
అయోధ్యలోని దళితుల్లో బీజేపీపై ఆగ్రహం నెలకొంది. అదే సమయంలో కాంగ్రెస్‌పై సానుభూతి ఏర్పడింది. దీని ప్రభావం ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment