2024 లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ ప్రైవేట్ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఈ వివరాలపై జనం అమితమైన ఆసక్తికనబరుస్తున్నారు. ఎగ్జిట్‌పోల్స్ ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది మంది నేతలు గెలుపు ఖాయమని తెలుస్తోంది. పైగా వీరికి పోరు నామమాత్రంగా ఉండనున్నదని కూడా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఆయన వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు. ఈసారి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. 2019 ఎన్నికల్లో మోదీకి ప్రత్యర్థిగా నిలబడిన వారందరికీ డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఈసారి మోదీ 10 లక్షలకు పైగా ఓట్లు సాధిస్తారని బీజేపీ చెబుతోంది.
రాజ్‌నాథ్ సింగ్
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈసారి కూడా లక్నో పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రాజ్ నాథ్ కూడా ఈసారి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన ఐదు లక్షలకు పైగా ఓట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
హేమమాలిని
మథుర లోక్‌సభ స్థానం నుంచి హేమమాలిని వరుసగా మూడోసారి పోటీకి దిగారు. గత 10 ఏళ్లలో తాను ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. హేమ మాలిని మథుర నుంచి హ్యాట్రిక్ సాధించడానికి సిద్ధమవుతున్నారు.
అఖిలేష్ యాదవ్
కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎస్ఫీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అజంగఢ్ నుండి గెలిచారు. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే అయ్యాక, ఆయన తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. అఖిలేష్‌పై బీజేపీకి చెందిన సుబ్రతా పాఠక్ రంగంలోకి దిగారు.
డింపుల్ యాదవ్
ఈసారి డింపుల్ యాదవ్ మెయిన్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 2022లో ములాయం సింగ్ మరణానంతరం ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో డింపుల్ యాదవ్ విజయం సాధించారు. మెయిన్‌పూర్ సీటు ఎస్పీకి కంచుకోటగా పేరొందింది. ములాయం సింగ్ యాదవ్ ఇక్కడి నుంచి ఎన్నికల్లో విజయం సాధించారు.
అనుప్రియా పటేల్
అప్నా దళ్ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్.. మీర్జాపూర్ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి కూడా ఆమె మీర్జాపూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూ, హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతున్నారు.
రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్ బరేలీ స్థానం నుంచి పోటీకి దిగారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో రాహుల్ అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. దీంతో ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌కు రిజర్వ్‌డ్ స్థానమైన రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు.
స్మృతీ ఇరానీ
స్మృతీ ఇరానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2019లో అమేథీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో రాహుల్ స్మృతీ ఇరానీకి ఘోర పరాజయాన్ని అందించారు. అయితే 2019 ఎన్నికల్లో ఆమె రాహుల్ గాంధీని ఓడించారు. ప్రస్తుతం స్మృతి ఇరానీకి ప్రత్యర్థిగా గతంలోసోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన కేఎల్ శర్మ రంగంలోకి దిగారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment