సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో ముస్లిం సమాజంపై వివక్ష చూపి వారిని తీవ్ర వేధింపులకు గురిచేసినా ఒక్క అక్షరం ముక్క రాయని ఈనాడు పత్రిక ఇప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వారిని సగౌరవంగా నిలబెట్టినా అన్యాయం చేస్తున్నారంటూ దుష్ప్రచారానికి దిగింది. పల్నాడు జిల్లా పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ రాజకీయ ప్రయోజనాల కోసం ఆదివారం అమరావతిలోని ఒక ముస్లిం కాలనీకి వెళ్లి ముస్లిం యువకులను అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను రెచ్చగొట్టారు.
ఈ క్రమంలో ఏర్పడిన ఉద్రిక్తతలను తొలగించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటే దాన్ని ముస్లిం యువకులపై దాడిగా ఈనాడు చిత్రీకరించి చిలవలు పలవలుగా కథనం రాసింది. ఒక యువకుణ్ణి పోలీసులు కొడుతున్నట్లు ఫొటో ఒకటి ప్రచురించి వైఎస్సార్‌సీపీ ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్నట్లు చూపించడానికి తాపత్రయపడింది.
దేశద్రోహం కేసుపై ఎందుకు రాయలేదు?
ఈ చిన్న ఘటనను భూతద్దంలో చూపించిన ఈనాడు.. చంద్రబాబు హయాంలో ముస్లింలపై అడుగడుగునా దారుణాలు జరిగినా ఏనాడూ రాయలేదు. 2018లో చంద్రబాబు సీఎంగా ఉండగా గుంటూరులో నారా హమారా పేరుతో నిర్వహించిన సభలో కొందరు యువకులు తమకిచ్చిన హామీలు అమలుచేయాలని ప్లకార్డులు చూపించడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించి వారిపై రాజద్రోహం కేసుపెట్టి చిత్రహింసలు గురిచేసినప్పుడు ఈనాడులో కనీసం వారి గురించి రాయలేదు.
కేవలం చంద్రబాబును ప్రశ్నించారనే కారణంతో 9 మంది యువకులపై ఉగ్రవాదులనే ముద్రవేసి నెలలపాటు వారిని చిత్రహింసలకు గురిచేశారు. సామాన్య ముస్లిం యువకులపై దేశద్రోహం కేసులు ఏమిటని ముస్లిం సమాజం యావత్తూ ఆందోళన చేసినా ఈనాడు స్పందించలేదు. గుంటూరులో పలు సాకులు చూపి ముస్లిం పిల్లలు 200 మందిపై కేసులు పెట్టినా, వేధించినా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు తెలుగుదేశం ప్రయోజనాల కోసం ఏమీ జరగకపోయినా ముస్లిం యువకులపై ఎక్కడలేని ప్రేమ ఒలకబోస్తూ ఇష్టారాజ్యంగా రాతలు రాయడంపై ఆ వర్గంలోనే ఆగ్రహం వ్యక్తమవుతోంది.
చదవండి: మార్గదర్శి అక్రమ వ్యవహారాల కేసులో సీఐడీ కీలక నిర్ణయం
వారికి మంత్రి పదవి ఇవ్వకపోయినా పట్టించుకోలేదు
నిజానికి.. చంద్రబాబు ముస్లింలను అన్ని రకాలుగా అవమానించడంతోపాటు తీవ్రంగా అణచివేశారు. టీడీపీకి ఓట్లు వేయలేదనే కక్షతో కనీసం ఆ వర్గానికి చంద్రబాబు తన కేబినెట్‌లో నాలుగేళ్లపాటు చోటు కల్పించలేదు. నంద్యాల ఉప ఎన్నిక రావడంతో ఆ వర్గాన్ని ఆకట్టుకునేందుకు చివరి ఆర్నెలల్లో ఎన్‌ఎండీ ఫరూక్‌ను మంత్రిని చేశారు. దీనిపై అప్పట్లోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది.ముస్లిం సమాజమంతా ముక్తకంఠంతో చంద్రబాబు తీరును వ్యతిరేకించినా ఈనాడుకు పట్టలేదు. ఇప్పుడుమాత్రం చంద్రబాబుకు మేలు చేకూర్చేందుకు వారిపై ప్రేమ ఒలకబోసేలా వార్తలు రాయడంపై ముస్లింలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment