ఉత్తరప్రదేశ్‌లోని ముజఫ్ఫర్‌నగర్‌కు చెందిన ఒక ముస్లిం గాయకుడు భజన కీర్తన పాడటం వివాదాస్పదంగా మారి, అతని తమ్ముని హత్యకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భజన పాట పాడటంపై తలెత్తిన వివాదంలో గాయకుని సోదరుడిని కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు.
ఈ ఘటనలో మృతి చెందిన ఖుర్షీద్(17) గాయకుడు ఫర్మానీ నాజ్‌కు వరుసకు సోదరుడు అవుతాడు. ఈ ఘటన రతన్‌పురీ పరిధిలోని ముహమ్మద్‌పుర్ మాఫీ గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మహాశివుని కీర్తిస్తూ సాగే ‘హర హర శంభో’ అనే పాటను ముస్లిం గాయకుడు నాజ్ గత ఏడాది పాడాడు. ఈ నేపధ్యంలో దేవబంద్‌కు చెందిన ఒక ముస్లిం మతపెద్ద ఇది మత విశ్వాసాలకు విరుద్దమంటూ అతనిపై ఫర్మానా జారీ చేశారు.
అయితే నాజ్ ముస్లిం మతపెద్ద తీర్మానాన్ని తప్పుబడుతూ కళాకారులకు ఎటువంటి మతం ఉండదని, తానేమీ తప్పు చేయలేదని పేర్కొన్నారు. నాజ్ గతంలో సింగింగ్ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ సీజన్-12లో కూడా పాల్గొన్నారు. నాజ్ నిర్వహిస్తున్న యూ ట్యూబ్ చానల్‌కు 4.5 మిలియన్లకు మించిన సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
కాగా నాజ్ సోదరుడు ఖుర్షీద్ హత్య కేసులో పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వారి దగ్గర నుంచి మారణాయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ముగ్గురిని అద్నాన్, వాజిద్, జుబేర్‌లుగా పోలీసులు గుర్తించారు. వారంతా కూడా గాయకుడు నాజ్‌కు వరుసకు సోదరులే కావడం విశేషం. ప్రస్తుతం పోలీసులు వారిని విచారిస్తున్నారు.
ఇది కూడా చదవండి: అయోధ్య రామమందిరానికి 400 కేజీల తాళం
Comments
Please login to add a commentAdd a comment