మహారాష్ట్ర: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధ్యక్షులు ప్రకాశ్ అంబేద్కర్ ఔరంగజేబు సమాధిని సందర్శించడాన్ని తప్పుబట్టారు. దీన్ని సమర్ధించినందుకు శివసేన(UBT) అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రేపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తాజాగా వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధ్యక్షులు ప్రకాశ్ అంబేద్కర్ ఔరంగాబాద్లోని ఔరంగజేబు సమాధిని సందర్శించిన సందర్బంగా ఔరంగజేబు చాలా కాలం దేశాన్ని పరిపాలించారని అన్నారు.
ఈ వ్యాఖ్యలకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ.. హిట్లర్ కూడా జర్మనీ దేశాన్ని చాలాకాలం పాలించాడు. అంతమాత్రాన అక్కడివారికి హిట్లర్ దేవుడు అవుతాడా? ఈ సందర్బంగా అంబేద్కర్ చర్యను మీరెలా సమర్ధిస్తారని ఉద్ధవ్ థాక్రేను ప్రశ్నించారు. మీరిద్దరూ పొత్తు పెట్టుకున్న కారణంగానే అసలేం మాట్లాడటం లేదా? అనడిగారు.
అసలు పరాయి దేశం నుంచి వచ్చిన ఔరంగజేబు మన నాయకుడెలా అవుతాడు? ఛత్రపతి శివాజీ ఒక్కడే మన నాయకుడని ఆయన అన్నారు. మన దేశంలో ఉన్న ముస్లింలు ఔరంగజేబు వారసులు కారని.. వారసలు ఆ మొఘల్ చక్రవర్తిని తమ నాయకుడిగా అంగీకరించరని అన్నారు. వారు సైతం ఛత్రపతి శివాజీనే తమ నాయకుడిగా చెప్పుకుంటారన్నారు.
ఒకప్పుడు బాల్ థాక్రే కాంగ్రెస్-ఎన్సీపీ పార్టీలతో చెట్లు కలపాల్సిన పరిస్థితి వస్తే తాను పార్టీని శాశ్వతంగా మూసివేస్తానన్న మాటను గుర్తుచేసి మీ తీరు మాత్రం భిన్నంగానూ మీ నాన్న గారికి వ్యతిరేకంగానూ ఉందన్నారు.
ఇక బీహార్లో ఈ నెలలో జరగనున్న విపక్ష ఐక్య కూటమి సమావేశం గురించి ప్రస్తావించగా పనికిరాని వంద పాదులు ఏకమైనా ఒక మర్రిచెట్టుకు సమానం కావన్నారు. గతంలో మోదీ వ్యతిరేకంగా ఇంతకంటే పెద్ద కూటమే వచ్చింది. అప్పుడే ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఏం చేస్తారని వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చదవండి: నా లివర్ ఇనుముతో తయారుకాలేదు..
Comments
Please login to add a commentAdd a comment