రాజకీయ అవకాశవాది చంద్రబాబుకు ముస్లింలపై ప్రేమ లేదు
టీడీపీ, బీజేపీ, జనసేన మతతత్వ ఫాసిస్టు పార్టీలు
ఈ పార్టీలు ముస్లింలు, క్రిస్టియన్ మైనార్టీలకు శత్రువులు
వారు అధికారంలోకి వస్తే ముస్లిం, దళిత రిజర్వేషన్లు తీసేస్తారు ముస్లిం, దళితులకు అండగా నిలిచే సెక్యులర్ నాయకుడు జగన్
ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చింది మహానేత వైఎస్సార్
రిజర్వేషన్లతో ముస్లింలు ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నారు
ఏపీలో బీజేపీ ఎజెండాను చంద్రబాబు, పవన్ అమలు చేస్తున్నారు
ఏపీ ప్రజలు సీఎం వైఎస్ జగన్‌కు మద్దతుగా నిలవాలి
సాక్షి ‘ఫేస్ టు ఫేస్’ కార్యక్రమంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
సాక్షి, హైదరాబాద్: ముస్లింలు, దళితులకు చంద్రబాబు ప్రధాన శత్రువు అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. రాజకీయ అవకాశవాది అయిన చంద్రబాబుకు ముస్లింలపై ఎటువంటి ప్రేమ ఉండదని, టీడీపీ, బీజేపీ, జనసేన మతతత్వ ఫాసిస్టు పార్టీలని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ పార్టీలు ముస్లింలు, క్రిస్టియన్ మైనార్టీలకు శత్రువులని అన్నారు.
ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన అధికారంలోకి వస్తే ముందుగా ముస్లిం రిజర్వేషన్లు, ఆ తర్వాత దళితుల రిజర్వేషన్లు తొలగిస్తారని తెలిపారు. ఇందుకోసం బీజేపీ చేస్తున్న కుట్రను చంద్రబాబు, పవన్ ఏపీలో అమలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ముస్లింలు, దళితుల ప్రయోజనాలను తాకట్టుపెట్టి స్వలాభం కోసమే ఆలోచిస్తారన్నారు. 2002లో గుజరాత్ అల్లర్ల కారణంగా దేశం మొత్తం కాలిపోతుంటే, ముస్లింలపై దౌర్జన్యాలు జరుగుతుంటే చంద్రబాబు మాత్రం బీజేపీకి మద్దతిచ్చారని తెలిపారు.
చంద్రబాబును ముస్లింలు ఎన్నటికీ నమ్మరని స్పష్టంగా చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సెక్యులర్ వాది అని తెలిపారు. సోమవారం సాక్షి ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో పాల్గొన్న అసదుద్దీన్ ఓవైసీ తన అభిప్రాయాలను సూటిగా, స్పష్టంగా చెప్పారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ నిన్నటి వరకు విశ్వగురు, జీ–20,చంద్రయాన్, 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అంటూ ఊదరగొట్టారని, ఇప్పుడు అవన్నీ వదిలేసి హిందూ–ముస్లిం వివాదాన్ని తెరమీదకు తెచ్చారని అన్నారు. ముస్లింలను ద్వేషించడం ఒక్కటే ప్రధాని మోదీ గ్యారంటీ అని, తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మోదీ ఆయనలోని లోపాలను కప్పిపుచ్చుకొనేందుకు ఇలాంటి వాతావరణం సృష్టించారన్నారు.
ఇప్పుడిప్పుడే ముస్లింలు బాగుపడుతున్నారు
వైఎస్‌ఆర్ ఇచ్చిన ముస్లిం రిజర్వేషన్ల వల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో చాలా మంది ముస్లిం యువకులు, విద్యార్థులు లబ్ధి పొందుతున్నారని ఒవైసీ చెప్పారు. ఇప్పుడిప్పుడే ముస్లింలు బాగుపడుతున్నారని తెలిపారు. డాక్టర్లు, ఇంజనీర్లు, డీఎస్పీలు, ఆర్డీవోలు, టీచర్లుగా ఉద్యోగులు పొందుతున్నారన్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు ముస్లింలు అంటే తీవ్రమైన ద్వేషమని, 4 శాతం రిజర్వేషన్ల ద్వారా ముస్లింలు లబి్ధపొందడం బీజేపీకి మింగుడుపడటంలేదని తెలిపారు.
విద్య, ఉద్యోగ పరంగా ముస్లింలు లబ్ధి పొందడం, స్వావలంబన సాధించడం బీజేపీకి నచ్చడంలేదని, దీంతో రిజర్వేషన్లు తొలగించేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లు మతం ప్రాతిపదికన కాదని, ముస్లింలలోని నిమ్న కులాల వారికి ఇస్తున్నారని చెప్పారు. సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు కారణంగా వారికి రిజర్వేషన్‌లు అందుతున్నాయని తెలిపారు.
బీజేపీతో కలిసి టీడీపీ, జనసేన కుట్రలు
ముస్లింల అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన పార్టీలు పనిచేస్తున్నాయన్నారు. చంద్రబాబు, పవన్ బీజేపీ ఎజెండా ఆధారంగా ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఏపీలో వీరు అధికారంలోకి వస్తే బీజేపీ కుట్రలు అమలు చేస్తారని, చంద్రబాబు ముస్లిం రిజర్వేషన్లు లేకుండా చేస్తారని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల తరువాత దళితులకు కూడా రిజర్వేషన్లు లేకుండా చేస్తారన్నారు. ఏపీ ప్రజలంతా ఆలోచించి టీడీపీ, బీజేపీ, జనసేనలాంటి మతతత్వ, ఫాసిస్టు పార్టీలను ఓడిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.
హామీ ఇచ్చి అమలు చేసిన వైఎస్సార్
ముస్లిం రిజర్వేషన్లను మహానేత వైఎస్సార్ హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే అమలు చేశారని అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. కాంగ్రెస్ పరిశీలకుడిగా గులాం నబీ ఆజాద్ 2004లో హైదరాబాద్ వచ్చినప్పుడు అప్పటి కాంగ్రెస్ నేత యూనుస్ సుల్తాన్ ఇంట్లో జరిగిన సమావేశంలో ముస్లిం రిజర్వేషన్లు ఇస్తామని వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చారన్నారు.
హామీ ఇచ్చినట్లుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు. కోర్టు దీనిపై అభ్యంతరం చెప్పడంతో ప్రముఖ ఆంత్రోపాలజిస్టు కృష్ణన్ ఆధ్వర్యంలో కమిటీ వేశారని, ముస్లింలలో కుల ప్రాతిపదికన 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సహేతుకమే అని ఆ కమిటీ తేలి్చందని చెప్పారు. ఆ తరువాత వేసిన ఎస్‌ఎల్‌పీలో ముస్లిం రిజర్వేషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందన్నారు.
సెక్యులర్ లీడర్ జగన్‌కు అండగా నిలవండి
సెక్యులర్ లీడర్ అయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అందరూ మద్దతివ్వాలని ఒవైసీ కోరారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని జగన్ రాజకీయ నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. జగన్ ఎప్పుడూ దళితులు, ముస్లింల ప్రయోజనాల విషయంలో రాజీపడలేదన్నారు. ముస్లింలు, దళితులకు అండగా నిలిచే సెక్యులర్ లీడర్ జగన్ ఏపీకి అవసరమని, ఆయనకు మద్దతుగా నిలిచి ఓటెయ్యాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒవైసీ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment