లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు ఓ ముస్లిం విద్యార్థి చెంపపై ఇతర విద్యార్థులను కొట్టమని శిక్ష విధించిన ఘటన తీవ్ర దుమారం రేపింది. అయితే తాజాగా ఈ ఘటనపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ తీరును తప్పు పట్టింది. ఇలాంటి ఘటనలు జరగకుండా యూపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదని జస్టిస్ ఏఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.
పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకున్న తీరుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేయాల్సి ఉందని, కానీ.. యూపీ ప్రభుత్వం అలా చేయలేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. విద్యార్థుల్లో ఇటువంటి ప్రవర్తన మార్చాలని వారికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి నవంబర్‌లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(టీఐఎస్‌ఎస్) నిపుణుల బృందాన్ని నియమించిన విషయం తెలిసిందే. టీఐఎస్‌ఎస్ ఇచ్చిన సిఫార్సులు పరిశీలించాలని అవసరమైతే పిల్లల తల్లిదండ్రులతో సంప్రదించి తదుపరి సూచనలు చేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది ఫరాసత్‌కు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచనలు ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా.. టీఐఎస్‌ఎస్ సిఫార్సులు సరిగా లేవని న్యాయవాది ఫరాసత్ సుప్రీంకోర్టును వెల్లడించారు.
మరోవైపు.. క్లాస్‌రూం ఘటనపై సుప్రీంకోర్టు గుర్రుగా ఉంది. ఈ ఘటన సంబంధించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ఏను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉల్లంఘించినట్లు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తరగతి గదిలో పిల్లలు వివక్ష ఎదుర్కొకుండా చూడటం స్థానిక అధికారుల విధి అని తెలిపింది. అయితే గత ఏడాది సెప్టెంబర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం సదరు టీచర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయటంలో జాప్యం చేయటంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పాఠశాలలో ఇటువంటి ఘటన జరగటంపై సర్కార్ వ్యవహరించిన తీరు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసేలా ఉందని జస్టిస్ ఓకా వ్యాఖ్యానించారు.
ఈ కేసులో పోలీసులు సదరు టీచర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుండా ఆలస్యం చేస్తూ.. టీచర్ త్రిప్తా త్యాగి చేసిన అసభ్యకర వ్యాఖ్యలకు సంబంధించి బాధిత బాలుడి తండ్రి వాంగ్మూలం కూడా నమోదు చేయకపోవటం సరికాదని వ్యాఖ్యానించింది. మతపరమైన మైనారీటీలకు చెందిన విద్యార్థులపై సహవిద్యార్థుల వల్ల జరిగే హింసకు సంబంధించి పాఠశాల వ్యవస్థలో నివారణ, పరిష్కార మార్గదర్శకాలను రూపొందిచాలని పిటిషనర్ తుషార్ గాంధీ తరఫు న్యాయవాది ఫరాసత్ సుప్రీం కోర్టును కోరారు.
Comments
Please login to add a commentAdd a comment