![Political Suspense Over Delhi BJP CM POST](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/Delhi-BJP-CM-POST.jpg.webp?itok=vKOaFDPA)
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఢిల్లీ బీజేపీ విజయం దిశగా దూసుకెళ్లింది. భారీ మెజార్టీతో ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు? అనే చర్చ నడుస్తోంది. బీజేపీ నుంచి ముఖ్యంగా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో మోదీ మార్క్ రాజకీయాల్లో భాగంగా మహిళకు అవకాశం ఇస్తారా? అనే విషయం తెరపైకి వచ్చింది.
ఇక, ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం వీరేంద్ర సచ్‌దేవా కొనసాగుతున్నారు. ఆయన సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నా రు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ సీఎం పోస్టుపై అగ్రనాయకత్వం నిర్ణయమే ఫైనల్. అది మాకు పెద్ద సమస్య కాదు. ఆప్‌ను ఓడించడమే మా లక్ష్యం అంటూ కామెంట్స్ చేశారు.
అయితే, హర్యానా-మహారాష్ట్రలో బీజేపీ నాయకత్వం వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రిని ఖరారు చేసింది. పార్టీ సమావేశం.. ఆ తరువాతనే సీఎంను ప్రకటించింది. ఇప్పుడు కూడా అదే తరహాలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు.. మహిళా సీఎం ఉంటారనే వాదన అనూహ్యంగా తెర మీదకు రావటంతో కొత్త సమీకరణాలపైన చర్చ జరుగుతోంది. 1993లో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిన సమయంలో సుష్మా స్వరాజ్ కేంద్ర మంత్రిగా రాజీనామా చేసి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు అప్పగించారు. మరోసారి మహిళకే సీఎం పగ్గాలు ఇవ్వాలని నిర్ణయిస్తే రేసులో స్మృతి ఇరానీ, మీనాక్షి లేఖి, బన్సూరి స్వరాజ్ పేర్లను బీజేపీ అధిష్టానం పరిశీలించే అవకాశం ఉంది. అదే విధంగా ఎన్నికల ప్రచారంలోనూ మహిళా ఓటర్లే లక్ష్యంగా హామీలు గుప్పించిన విషయం తెలిసిందే.
సీఎం రేసులో ఉన్న ముఖ్య నేతలు వీరే..
దుష్యంత్ కుమార్ గౌతమ్
ముఖ్యమంత్రి రేసులో ఉన్న కీలక పేర్లలో ఒకరు దుష్యంత్ కుమార్ గౌతమ్. ఆయన కరోల్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నారు. ఆయన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, దళిత నాయకుడు. గౌతమ్ రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. దుష్యంత్ గౌతమ్ రాజకీయంగా, సామాజిక కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/14_28.jpg)
పర్వేష్ వర్మ
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేష్ వర్మ, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై నూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేశారు. ఎన్నికల్లో ఫలితాల ప్రారంభమైన సమయం నుంచి పర్వేష్ వర్మ ఆధిక్యంలో ఉన్నప్పటికీ తాజాగా వెనుకంజలో ఉన్నారు. ఒకవేళ పర్వేష్ గెలిస్తే ఈయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వర్మ జాట్ నేపథ్యం బీజేపీ రాజకీయ లెక్కల్లో కీలక పాత్ర పోషిస్తుంది.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/1_436.jpg)
విజేందర్ గుప్తా..
విజయేందర్ గుప్తా పార్టీ సీనియర్ నాయకుడు. ఢిల్లీలో ఆప్ ఆధిపత్యం ఉన్నప్పటికీ ఆయన 2015 మరియు 2020 రెండింటిలోనూ రోహిణి స్థానం నుంచి విజయం సాధించారు. ఢిల్లీ బీజేపీ మాజీ చీఫ్ అయిన గుప్తా ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశారు. ఆప్ ధాటిని ఎదుర్కొన్న ఆయన అనుభవం అత్యున్నత పదవికి బలమైన పోటీదారుగా చేయనున్నాయి.
సతీష్ ఉపాధ్యాయ్
ఆయన మాలవీయ నగర్ అసెంబ్లీ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వృత్తిపరంగా సతీష్ ఉపాధ్యాయ్ వ్యాపారం, రాజకీయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్నారు. అనుభవజ్ఞుడైన సతీస్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి. సతీష్‌కు కూడా సీఎం అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment