ఢిల్లీ ఎన్నికల్లో పూర్తిగా చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ
హామీల వర్షం కురిపించినా లెక్కచేయని ఓటర్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పూర్వ వైభవాన్ని సాధించాలని ఆశపడ్డ కాంగ్రెస్ పార్టీకి వరుసగా మూడోసారి కూడా భంగపాటే ఎదురైంది. అధికార పీఠాన్ని అధిరోహించే శక్తి లేకున్నా కనీసం తమ అస్థిత్వాన్ని నిలుపుకోవాలన్న ఆశలపై ఢిల్లీ ఓటర్లు పూర్తిగా నీళ్లు చల్లారు. హ్యాట్రిక్ విజయాలతో 1998 నుంచి వరుసగా 15 ఏళ్ల పాటు ఢిల్లీని పరిపాలించిన కాంగ్రెస్ ఆ తర్వాత హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. వరుసగా మూడు సార్లు ఓడిపోవడం కాంగ్రెస్ శ్రేణులకు తీవ్ర నిరాశకు గురిచేసింది. గత ఎన్నికల కంటే కొంత మెరుగైన స్థాయిలో ఓట్లు సాధించినప్పటికీ సీట్ల ఖాతా తెరవలేదు.
దెబ్బకొట్టిన ఒంటరి పోరు
ఢిల్లీలో 2015, 2020 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా నెగ్గని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో కనీసంగా 10 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగింది. ఇందుకు అనుగుణంగా ఎన్నో హామీలు ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. అయితే అధికార ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు లేకపోవడం దెబ్బకొట్టింది. అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు ఆప్ నిరాకరించడంతో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసింది.
ప్రధాన పోటీ బీజేపీ, ఆప్‌ల మధ్యే కొనసాగుతుండటంతో కాంగ్రెస్‌ను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. 2008లో 48 శాతం ఓట్లతో 43 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ 2013లో 24.70 శాతం సీట్లతో 7 సీట్లకు పరిమితమైంది. 2015లో కాంగ్రెస్‌కు 9.7 శాతం, 2020లో 4.3 శాతం ఓట్లు వచ్చినా ఒక్క సీటు కూడా గెలువలేదు. ఇక ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ దాదాపు 6.38 శాతం ఓట్లను రాబట్టుకుంది. 70 శాతానికి పైగా అభ్యర్థులు డిపాజిట్లు సైతం కోల్పోయారు. ఆప్‌తో పొత్తుపెట్టుకొని పోటీ చేస్తే కనీసం ఖాతా తెరిచే పరిస్థితి అయినా ఉండేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
పనిచేయని హామీలు
ఢిల్లీ అసెంబ్లీలో ఎలాగైనా పాగా వేయాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఓటర్లపై అనేక హామీలు గుప్పించింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఐదు గ్యారంటీలను ప్రకటించింది. ‘ప్యారీ దీదీ యోజన’ కింద మహిళలకు నెలకు రూ.2,500, రూ.500లకే ఎల్‌పీజీ సిలిండర్, కుటుంబాలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, పింఛను రూ.2,500 నుంచి రూ.5,000కు పెంపు, నిరుద్యోగ యువతకు ఏడాదిపాటు నెలకు రూ.8,500 ఆర్థిక సహాయం వంటి హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లింది.
తన మేనిఫెస్టోలో సైతం కులగణనæ, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, వితంతువుల కుమార్తెల పెళ్లికి రూ.1.10 లక్షల ఆర్థిక సాయం, ఢిల్లీవ్యాప్తంగా 100 ఇందిరా క్యాంటీన్ల ఏర్పాటు వంటి హామీలతో ముందుకెళ్లినా ఆ పార్టీని జనం పట్టించుకోలేదు. వీటికితోడు యమునా నదీ కాలుష్యాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకున్నా ఉపయోగపడలేదు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాం«దీ, ప్రియాంక గాం«దీ, మల్లికార్జున ఖర్గే తదితరులు ప్రచారం చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కాంగ్రెస్ కీలక నేతలైన సందీప్ దీక్షిత్ న్యూఢిల్లీ నియోజకవర్గంలో 25,520 ఓట్ల తేడాతో ఓటమి చెందగా, కల్కాజీ నియోజకవర్గంలో అల్కా లాంబ 47,691 ఓట్ల తేడాతో, నాంగ్‌లోయి నుంచి రోహిత్ చౌదరి 36,401 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment