'నాలుగు రాష్ట్రాల ఎన్నికల దృష్ట్యా...ఈ కీలక నిర్ణయం'
అమరావతి: చలామణీలో ఉన్న రూ. 500, 1000 నోట్ల రద్దు చేయాలన్న నిర్ణయం ఒక్క రోజు జరిగిన నిర్ణయం కాదని, కేంద్రంలో కీలకమైన ఇద్దరు ముగ్గురు వ్యక్తులు దీనిపై ఆరేడు నెలలుగా చర్చించి తీసుకున్న నిర్ణయమని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. దేశంలో కీలకమైన నాలుగు ప్రధాన రాష్ట్రాల ఎన్నికల ముందు కూడా చలామణీలో ఉన్న నోట్ల రద్దు చేయాలన్న కీలక నిర్ణయం ప్రకటించడం ద్వారా నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి అవినీతి నిర్మూలనపై ఉన్న చిత్తశుద్దిని తెలియజేస్తోందని చెప్పారు.
ఒకట్రెండు నెలలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి డబ్బుల ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో భవిష్యత్‌లో రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగే తీరులో భారీగా మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఆ పార్టీ నేతలు బుర్రలేని వ్యక్తులు మాదిరి మాట్లాడుతున్నారని విమర్శించారు. నోట్ల రద్దు వల్ల వ్యక్తిగతంగా ఇబ్బంది ఎదుర్కొంటున్న వ్యక్తులే ఈ నిర్ణయాన్ని తప్పుపడుతూ దీని వల్ల సామాన్యులు ఇబ్బంది పడుతున్నట్టు ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడుతున్నారని సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు.