సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిపై తెలంగాణ రాష్ట్ర సమితి పూర్తి సంతృప్తితో ఉంది. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమేనని ఆ పార్టీ బలంగా విశ్వసిస్తోంది. అన్ని జిల్లాల్లోని ఎన్నికల సరళి ఆధారంగా అంచనాలు వేసిన గులాబీదళం.. రాష్ట్ర వ్యాప్తంగా మెరుగైన ఫలితాలు ఉంటాయని భావిస్తోంది. గత ఎన్నికల కంటే టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉంటుందని లెక్కలు వేస్తోంది. గత ఎన్నికల కంటే ఎక్కువ సంఖ్యలో సీట్లను గెలుచుకోవడం ఖాయమేననే అంచనాకు వచ్చిన టీఆర్‌ఎస్ అధిష్టానం సీట్ల సంఖ్యలో స్పష్టత కోసమే ఎదురుచూస్తోంది. పోలింగ్ సరళిపై ఉదయం ఉంచే సానుకూల స్పందనలు వచ్చినట్లు టీఆర్‌ఎస్ ముఖ్యులు చెబుతున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు స్వచ్ఛందంగా తరలి వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారని, వీరిలో అధిక శాతం టీఆర్‌ఎస్‌కే మద్దతు తెలిపారని సమాచారం అందినట్లు పేర్కొన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని సెగ్మెంట్ల నుంచి పూర్తి స్థాయిలో సమాచారాన్ని తెప్పించి విశ్లేషించారు. అదే సమయంలో అన్ని జాతీయ చానళ్లు నిర్వహించిన సర్వే సమాచారం అందింది. అన్ని చానళ్ల ఎగ్జిట్ పోల్స్‌లోనూ టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉంటుందని వచ్చింది. సీట్ల సంఖ్యలో తేడా ఉన్నాయే తప్ప అన్నింట్లోనూ టీఆర్‌ఎస్ విజయం ఖాయమని సర్వేలు తేల్చాయి. సొంతంగా సేకరించిన సమాచారంతోపాటు జాతీయ చానళ్ల నివేదికలు సైతం ఒకేరకంగా ఉండడంతో మళ్లీ ప్రభుత్వ ఏర్పాటు ఖాయమని టీఆర్‌ఎస్ అంచనాలో ఉంది. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఆధిక్యం వస్తుందని టీఆర్‌ఎస్ ధీమాతో ఉంది. నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లోని కూటమి నుంచి కొంత పోటీ ఉందని భావిస్తోంది.
కలిసొచ్చిన పథకాలు
నాలుగేళ్ల మూడు నెలల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు బాగా కలిసి వచ్చాయని టీఆర్‌ఎస్ నిర్ధారణకు వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారని నిర్ధారించుకుంది. రైతులు, వారి కుటుంబాలు సైతం టీఆర్‌ఎస్ అండగా నిలిచారని సమాచారం ఆధారంగా ధ్రువీకరించుకుంది. ప్రాజెక్టుల నిర్మాణంపై ఓటింగ్ సమయంలో బాగా సా నుకూలత వ్యక్తమైంది. కొత్తగా సాగునీరు చేరిన అసెంబ్లీ నియో జకవర్గాలలో ఏకపక్షంగా టీఆర్‌ఎస్‌కు మద్దతు వ్యక్తమైందని సమాచారం ఆధారంగా నిర్ధారణకు వచ్చింది. సాగునీరు కొత్తగా సరఫరా అయిన సెగ్మెంట్లలో వ్యక్తమైన సానుకూలతతో దక్షిణ తెలంగాణలో సీట్ల సంఖ్య ఈసారి పెరుగుతుందని టీఆర్‌ఎస్ అంచనా లో ఉంది.
కేసీఆర్ ప్రచారం సానుకూలమై..
ఎన్నికలలో సీఎం కేసీఆర్ అన్నీతానై వ్యవహరించడం టీఆర్‌ఎస్‌కు బాగా కలిసి వచ్చిందని పోలింగ్ సరళితో స్పష్టమైందని పార్టీ నిర్ధారణకు వచ్చింది. ప్రజా కూటమిలోని పార్టీల వ్యవహారశైలిని ఎత్తి చూపుతూ.. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని వివరిస్తూ కేసీఆర్ చేసిన ప్రసంగాలు ఓటర్లపై బాగా ప్రభావం చూపాయని టీఆర్‌ఎస్ భావిస్తోంది. ముందస్తు ఎన్నికల వ్యూహంలో అన్ని విషయాల్లోనూ కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుండడం పార్టీకి మేలు చేసిందని అంచనా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 116 అసెంబ్లీ సెగ్మెంట్లలో నేరుగా ప్రచారం చేయడం.. చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు, తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీపడబోమని చెబుతూ చేసిన ప్రసంగాలు ఓటర్లను ఆలోచింపజేశాయని, పోలింగ్‌లో అ ప్రభావం కనిపించిందని టీఆర్‌ఎస్ భావిస్తోంది.
కేసీఆర్ ప్రత్యేక సమీక్ష
ఎన్నికల సరళిపై టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రోజంతా సమీక్షించారు. పోలింగ్ ప్రారంభం కాగానే అన్ని జిల్లాల నుంచి సమాచారం సేకరించారు. మధ్యాహ్నం చింతమడకలో ఓటు వేసేందుకు వెళ్లి వచ్చిన అనంతరం తుది అంచనాలపై సమాచారం తెప్పించారు. స్థూలంగా అన్ని జిల్లాల్లోనూ టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన ఆధిక్యం ఉందని అంచనా నివేదికలు స్పష్టం చేసినట్టు సమాచారం.
మళ్లీ మా ప్రభుత్వమే
కేటీఆర్ ధీమా..
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్ మూడింట రెండోవంతు మెజారిటీ సాధిస్తుందని మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సరళి టీఆర్‌ఎస్‌కు సానుకూలంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment