సాక్షిప్రతినిధి, నల్లగొండ : ముందస్తు శాసనసభ ఎన్నికల ఫలితాలు ఆసక్తి గొల్పుతున్నాయి. అనూహ్య విజయాలు, పరాజయాలు చర్చనీయాంశం అయ్యాయి. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తమదైన ముద్రవేసుకున్న కోమటిరెడ్డి సోదరులు ఒకేసారి అసెంబ్లీకి వెళ్లలేకపోతున్నారు. నల్లగొండనుంచి అయిదో విజయం కోసం పోటీపడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓటమి పాలుకాగా, ఆయన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తొలి విజయాన్ని అందుకున్నారు. దీంతో తమ్ముడు ఇన్.. అన్న అవుట్ అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక, నకిరేకల్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన చిరుమర్తి లింగయ్య తన రాజకీయ గురువు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అని చెబుతుంటారు. 2009 ఎన్నికల్లో గురుశిష్యులు ఒకే సారి అసెంబ్లీకి వెళ్లారు.
కానీ, ఈ ఎన్నికల్లో శిష్యుడు లింగయ్య విజయం సాధించగా, వెంకట్‌రెడ్డి మాత్రం ఓటమి పాలయ్యారు. నార్కట్‌పల్లి మండలం బ్రహ్మణ వెల్లెంల గ్రామానికి చెందిన ఈ ముగ్గురు నేతల్లో ఈసారి ఇద్దరు మాత్రమే గెలుపొందారు. మరో వైపు నల్లగొండ జిల్లాలో పలువురు నేతలు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీలుగా పనిచేసిన రికార్డును రాజగోపాల్‌రెడ్డి బ్రేక్ చేశారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పనిచేసిన నాయకుల్లో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డిని రాజ్యసభ సభ్యుడి పదవి రించింది. రామన్నపేట మాజీ ఎమ్మె ల్యే ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రాగ్యానాయక్ సతీమణి భారతీ రాగ్యానాయక్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పని చేశారు. కాగా, ఎమ్మెల్సీ పదవిలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచింది మాత్రం రాజగోపాల్ రెడ్డి ఒక్కరే కావడం విశేషం. అదేమాదిరిగా, గురు శిష్యుల సంబంధం ఉన్న కె.జానారెడ్డి ఓడిపోగా, ఆయన శిష్యుడిగా పేరున్న ఎన్.భాస్కర్‌రావు మిర్యాలగూడ నుంచి రెండో సారి ఎమ్మెల్యేగా> గెలిచారు.
పతి గెలుపు... సతి ఓటమి
రాష్ట్ర రాజకీయాల్లో ఒకేసారి శాసన సభకు ఎన్నికైన దంపతుల జాబితాలో చేరిన మూడో జంట ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి. 2014 ఎన్నికల్లో పద్మావతి కోదాడ నుంచి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి హుజూర్‌నగర్ నుంచి గెలిచారు. గతంలో ఇలా.. ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలా దేవి, ఆ తర్వాత మహబూబ్‌నగర్ జిల్లా నుంచి టీడీపీ పార్టీ తరఫున దయాకర్‌రెడ్డి, ఆయన భార్య సీతాదయాకర్‌రెడ్డి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే, రెండో సారి కూడా గెలిచి అరుదైన రికార్డు సృష్టించాలనుకున్న ఉత్తమ్ దంపతులకు ఈ ఎన్నికల్లో చుక్కెదురైంది. ఈ ఎన్నికల్లో పద్మావతి కోదాడ నుంచి పోటీ చేసినా, టీఆర్‌ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోగా, హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment