రేణుకాచౌదరి
సాక్షి, మధిర: దశాబ్దకాలానికిపైగా ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి కీలకంగా పనిచేశారు. ఒక రకంగా శాసించారు. ఏకచత్రాధిపత్యంగా పట్టుసాధించిన ఆమె ప్రాబల్యం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నానాటికీ తగ్గిపోతోందనే ప్రచారం జరుగుతోంది. ఖమ్మం పార్లమెంట్ సభ్యురాలిగా 1999, 2004 ఎన్నికల్లో గెలుపొంది కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా, కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేశారు. నాడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేంద్రమంత్రి హోదాలో సుడిగాలి పర్యటనలు చేసి కాంగ్రెస్‌లో తన వర్గాన్ని బలోపేతం చేసుకున్నారు. ఆమె చెప్పిందే వేదంగా నడిచింది. కోట్లాదిరూపాయల నిధులు జిల్లా అభివృద్ధికి మంజూరు చేయించారు.
అయితే 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు చేతిలో ఆమె ఓటమి చెందారు. 2014 ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరగ్గా.. ప్రస్తుత ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం వద్ద ఆమెకు ఉన్న పలుకుబడితో రాజ్యసభ సభ్యురాలిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ పదవీకాలం కూడా ముగిసింది. ఈ క్రమంలో జిల్లా కాంగ్రెస్‌లో మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ప్రాబల్యం పెరుగుతూ వచ్చింది. భట్టి సహకారంతోనే ఐతం సత్యం కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడయ్యారు. భట్టి అనుచరుడిగా ఉన్న సత్యంను పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకుండా అడ్డుకునేందుకు ఆమె అప్పట్లో ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఐతం సత్యం మృతి చెందిన తర్వాత ఆ పదవిని నేటికీ భర్తీ చేయలేదు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆమె వర్గీయులకు టికెట్లు దక్కలేదు. కొత్తగూడెం నియోజకవర్గంలో రేణుకా అనుచరుడిగా ఉన్న ఎడవల్లి కృష్ణకు కాంగ్రెస్ టికెట్ దక్కకపోవడంతో బీఎల్‌ఎఫ్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఖమ్మం సీటుకోసం ఆమె అనుచరులు పోట్ల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్, పాలేరు సీటుకోసం రాయల నాగేశ్వరరావు ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రజాకూటమి పొత్తుల్లో భాగంగా ఖమ్మం సీటు టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు.. పాలేరు సీటు కందాల ఉపేందర్‌రెడ్డికి ఇచ్చారు. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆమె పట్టుకోల్పోతున్నారని రాజకీయపార్టీలు చర్చించుకుంటున్నాయి.
అంతేకాంకుండా రేణుకా వర్గీయులుగా మధిర మండలంలో గెలుపొందిన ఇద్దరు సర్పంచ్‌లు, ఒక ఎంపీటీసీ సభ్యుడితోపాటు కొంతమంది అనుచరులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వైరా నియోజకవర్గంలో రేణుకాచౌదరి వర్గీయులు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సూరంపల్లి రామారావు, కారేపల్లి మాజీ ఎంపీపీ పగడాల మంజుల తదితరులు పార్టీకి రాజీనామా చేసి.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా బరిలో నిలిచిన లావుడ్యా రాములు నాయక్‌కు మద్దతు ఇచ్చారు. దీనికితోడు మల్లు భట్టి విక్రమార్క మధిర అసెంబ్లీ స్థానంనుంచి మూడుసార్లు గెలుపొందడం.. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టం.. రాష్ట్రవ్యాప్తంగా పలు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజా కూటమి అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించడంతో ఆయనకు అధిష్టానం దగ్గర పరపతి పెరిగినట్లు క్షేత్రస్థాయి కేడర్‌లో చర్చజరుగుతోంది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌గాంధీ వచ్చినప్పుడు నిర్వహించిన బహిరంగ సభల్లో కూడా రేణుకా చౌదరికి మాట్లాడే అవకాశం కూడా రాకపోవడంపై ఆమె వర్గీయులు ఆవేదనకు గురయ్యారు. అదేవిధంగా ఈ సారి కాంగ్రెస్ తరఫున భట్టికి సీఎల్‌పీ లీడర్ కానీ, మరేదైనా ప్రాధాన్యత కలిగిన పార్టీ పదవి కట్టబెట్టే అవకాశం ఉందని సమాచారం. దీంతో జిల్లా కాంగ్రెస్‌లో భట్టి పట్టు సాధిస్తుండగా.. రేణుకాచౌదరి ప్రాధాన్యత తగ్గిపోతుందని వివిధ పార్టీల నాయకులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment