సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ల ప్రకటనను పూర్తి చేస్తుండటంతో టీపీసీసీ ముఖ్య నేతలు, ప్రచార కమిటీ ప్రతినిధులు ప్రచార రంగంలోకి దూకబోతున్నారు. ప్రచారంలో జోరు పెంచి కార్యకర్తల్లో జోష్ నింపాలని కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే దఫాలవారీగా రోడ్‌షోలు నిర్వహిస్తూ వస్తున్న కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి మూడో దఫా రోడ్‌షో, బహిరంగ సభ షెడ్యూల్‌ను ఫైనల్ చేయనున్నారు. ఏయే నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించాలన్న దానిపై రెండు రోజుల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ముఖ్య నేతలు సమావేశం కానున్నారు.
వరుస బహిరంగ సభలు...
టికెట్లు ప్రకటించడంతో ముఖ్య నేతలంతా రెండు రోజుల్లోనే నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని ప్రచారంలో పాల్గొనేందుకు కార్యాచరణ రూపొందించుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైతం నామినేషన్ దాఖలు తర్వాత నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్‌లో రోడ్‌షోతోపాటు పలు బహిరంగ సభల్లో పాల్గొంటారని తెలిసింది. ఇందులో భాగంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి బుధవారం కొడంగల్‌లో నామినేషన్ దాఖలు చేస్తున్నారు. గురువారం నుంచి వరుసగా కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో భారీ బహిరంగ సభల్లో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే రేవంత్‌రెడ్డి కామారెడ్డి, బోధన్, నర్సాపూర్, జహీరాబాద్‌లో బైక్ ర్యాలీ నిర్వహించి ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ప్రధానంగా తనతోపాటు టీడీపీ నుంచి వచ్చి టికెట్లు పొందిన అభ్యర్థుల తరఫున బహిరంగ సభల్లో పాల్గొని, మిగతా చోట్ల రెండో దఫాలో ప్రచారం నిర్వహించేందుకు రేవంత్‌రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది.
సోనియా, రాహుల్ సభలకు ఏర్పాట్లు...
నామినేషన్ల ఘట్టం పూర్తి కాగానే ఈ నెల 22, 23 తేదీల్లో యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీ బహిరంగ సభల ఏర్పాటుకు అవకాశమివ్వాలని అధిష్టానంతో టీపీసీసీ చర్చించింది. దీనితో ఏఐసీసీ సంబంధిత తేదీలతోపాటు వరంగల్/కరీంనగర్‌లో ఒకటి, మహబూబ్‌నగర్/నల్లగొండలో మరో సభ ఏర్పాటు చేయడంపై తుది నిర్ణయం వెలువరించనుంది. 2 రోజుల పర్యటనలో భాగంగా హైదరాబాద్‌లోనూ ఒక సభ పెట్టేందుకు ఒప్పించినట్టు తెలిసింది. మొత్తం రెండు రోజుల్లో మూడు సభలు ఏర్పాటు చేసి రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరనుంది. నవంబర్ చివరి వారంలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ 9 బహిరంగ సభల్లో పాల్గొనేలా టీపీసీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రాహుల్ బైంసాతోపాటు కామారెడ్డి బహిరంగ సభల్లో పాల్గొన్నారు. కాగా, వరుసగా జాతీయ, రాష్ట్ర నేతలతో ప్రచారాన్ని వేగవంతం చేసి కార్యకర్తల్లో జోష్ తీసుకురావాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment