సాక్షి, హైదరబాద్ : కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులకు నిరసనగా ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డితో సహా పలువురు నాయకులు సంఘీభావంగా రేవంత్ ఇంటికి చేరుకొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేయడానికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేశారు. దీంతో పోలీసులకు కాంగ్రెస్ నేతలకు మధ్య వాగ్వివాదం జరిగింది.
రాజకీయ కక్షతోనే రేవంత్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు చేయిస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. పాత కేసులను బయటకు తీసి కాంగ్రెస్ నాయకులను అనగదొక్కే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొన్న జగ్గారెడ్డిపై కేసు, నేడు రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు ఇవన్నీ టీఆర్‌ఎస్ చేతకాని తనానికి నిదర్శనమని విమర్శించారు. కేసీఆర్‌ను ఓటమి భయం వెంటాడుతోందని అందుకే ఇలాంటి పిచ్చి పనులు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ ఇంటిపై ఐటీ దాడులను జానా రెడ్డి ఖండించారు. కాంగ్రెస్ నాయకులను భయపెట్టడానికే కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment