
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి నూతనంగా ఎన్నికైన 119 మంది శాసనసభ్యుల్లో వివిధ పార్టీలకు చెందిన 67 మందిపై సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ తెలిపింది. ఈ మేరకు సంస్థ కన్వీనర్ పద్మనాభరెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తంగా శాసనసభలో 56.3 శాతం మంది ఎమ్మెల్యేలపై వివిధ రకాల కేసులున్నాయని తెలిపారు. ఇందులో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన 88 మంది శాసనసభ్యుల్లో 44 మందిపై కేసులున్నట్లు చెప్పారు.
ఇక బీజేపీ నుంచి ఎన్నికైన ఒకే ఒక్క ఎమ్మెల్యేపైనా పలు కేసులున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి గెలిచిన 21 మంది శాసనసభ్యుల్లో 16 మందిపై కేసులున్నట్లు పేర్కొన్నారు. ఎంఐఎం పార్టీ తరఫున గెలిచిన 7 మంది సభ్యుల్లో ఆరుగురిపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, సంబంధిత పార్టీలు ప్రధాన పత్రికలు, టీవీ చానళ్లలో నామినేషన్ వేసినప్పటి నుంచి 3 సార్లు కేసుల గురించి ప్రచురించాలని, ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని తెలిపారు. అయితే కొద్దిమంది అభ్యర్థులు మినహా ఎవరూ ఈ తీర్పును అమలు చేయలేదన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి తమ సంస్థ తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment