సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 88 సీట్లలో ఘన విజయం సాధించినప్పటికీ 26 నియోజకవర్గాల్లో మాత్రం ‘కారు’జోరుకు ‘ట్రక్కు’బ్రేకులు వేసింది. ప్రజలు ఎప్పుడూ పేరు కూడా వినని సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ (ఎస్‌ఎంఎఫ్‌బీ) అనే పార్టీతోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ కేటాయించిన ట్రక్కు గుర్తు టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపింది. ఈవీఎంలలో పొందుపరిచిన ట్రక్కు చిహ్నం, కారు గుర్తును పోలి ఉండటం నిరక్షరాస్యులు, వృద్ధులు గందరగోళపరిచింది. దీంతో ఎస్‌ఎంఎఫ్‌బీ పోటీ చేసిన 26 నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఓట్లకు భారీగా గండిపడింది. ఫలితంగా ఆయా చోట్ల టీఆర్‌ఎస్ మెజారిటీ 5 వేల నుంచి 10 వేల ఓట్ల వరకు తగ్గడమే కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఓటమికి కారణమైంది.
ఆరు చోట్ల ప్రత్యక్ష ప్రభావం...
రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌ఎంఎఫ్‌బీ పార్టీకి వచ్చిన ఓట్ల వివరాలను పరిశీలిస్తే ఆ పార్టీ పోటీ చేసిన ప్రతిచోటా గణనీయంగా ఓట్లు వచ్చాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో అత్యల్పంగా 1,152 ఓట్లు రాగా, అత్యధికంగా ధర్మపురిలో 13,114 ఓట్లు వచ్చాయి. మొత్తం 26 స్థానాల్లో పోటీ చేస్తే బీజేపీ, టీజేఎస్, సీపీఐ లాంటి పార్టీలు, బలమైన ఇండిపెండెంట్లు పోటీలో లేని అన్ని స్థానాల్లోనూ ఆ పార్టీనే మూడో స్థానంలో నిలిచింది. కొన్ని చోట్ల ఈ పార్టీలకన్నా ఎక్కువ ఓట్లు కూడా సాధించింది. నియోజకవర్గాలవారీ వివరాలను పరిశీలిస్తే నకిరేకల్‌లో ఏకంగా టీఆర్‌ఎస్ అభ్యర్థిని ట్రక్కు గుర్తు ఓడించింది.
తాండూరులో ఓటమిపాలైన పట్నం మహేందర్‌రెడ్డి ఓటమి మార్జిన్ 2,925 ఓట్లకు చేరడానికి కూడా ట్రక్కు గుర్తే కారణమైంది. ధర్మపురిలో 10 వేల పైచిలుకు మెజారిటీతో గెలవాల్సిన కొప్పుల ఈశ్వర్ బతుకు జీవుడా అంటూ 400 ఓట్లతో గెలివాల్సి వచ్చింది. అలాగే పరిగి, పెద్దపల్లి, కామారెడ్డి నియోజకవర్గాల్లో గెలిచిన టీఆర్‌ఎస్ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీకన్నా ట్రక్కు గుర్తుకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. వాటితోపాటు మరో 20 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ ట్రక్కు గుర్తు కారణంగా తగ్గిపోయింది.
సీపీఎం కూటమికన్నా ఎక్కువ ఓట్లు...
సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌బ్లాక్ 26 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 1,66,367 ఓట్లు సాధించగా కమ్యూనిస్టు పార్టీగా రాష్ట్ర ప్రజలకు సుపరిచితమైన సీపీఎంతో కలసి 107 స్థానాల్లో పోటీ చేసిన బహుజన లె‹ఫ్ట్ ఫ్రంట్ పార్టీ (బీఎల్‌ఎఫ్) కేవలం 1,41,432 ఓట్లే సాధించగలిగింది. రాష్ట్రవ్యాప్తంగా పోలయిన ఓట్లలో బీఎల్‌ఎఫ్‌పీ అభ్యర్థులకు 0.7 శాతం ఓట్లు రాగా ఎస్‌ఎంఎఫ్‌బీకి మాత్రం 0.8 శాతం ఓట్లు వచ్చాయి. దీన్నిబట్టి రాష్ట్ర ఓటర్లు కారు, ట్రక్కు గుర్తులను పోల్చుకోవడంలో గందరగోళానికి గురయ్యారని, అందుకే ఆ పార్టీకి అన్ని ఓట్లు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఆటో తీసేశారు కానీ...
2014 సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగ్గా అప్పుడు కారుతోపాటు ఆటో గుర్తుకు కూడా ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. ఆటో గుర్తు కారణంగా అప్పట్లో టీఆర్‌ఎస్ చాలా చోట్ల నష్టపోగా కొన్ని చోట్ల లాభపడింది. అయితే ఈ గందరగోళం మంచిది కాదనే ఆలోచనతో ఈసారి ఎన్నికల్లో ఆటో గుర్తును ఎవరికీ ఇవ్వొద్దని ఎన్నికల సంఘాన్ని టీఆర్‌ఎస్ కోరింది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఆటో గుర్తును ఎన్నికల సంఘం మినహాయించింది. కానీ కారు గుర్తును పోలి ఉన్న ట్రక్కు గుర్తును వదిలేయడంతో వీలున్నంతమేర ఆ గుర్తు టీఆర్‌ఎస్‌కు నష్టం చేయడం
గమనార్హం.
వివిధ నియోజకవర్గాల్లో ట్రక్కు గుర్తుకు వచ్చిన ఓట్లు...
అలంపూర్ (8,803), భువనగిరి (3,613), భూపాలపల్లి (2,171), దుబ్బాక (12,215), గద్వాల (7,189), జడ్చర్ల (2,886), జనగామ (10,031), కామారెడ్డి (10,537), ఖైరతాబాద్ (1,152), ఎల్బీ నగర్ (3,739), మహేశ్వరం (3,457), మల్కాజిగిరి (4,651), మానకొండూరు (13,610), మంథని (5,457), మెదక్ (6,947), మునుగోడు (2,279), నాగార్జున సాగర్ (9,819), నాగర్ కర్నూల్ (5,545), నకిరేకల్ (10,383), పాలకుర్తి (3,199), పరిగి (8,694), పెద్దపల్లి (8,499), కుత్బుల్లాపూర్ (3,045), రామగుండం (3,531), కంటోన్మెంట్ (1,745), తాండూరు (2,608), తుంగతుర్తి (3,729), వికారాబాద్ (3,214), వరంగల్ వెస్ట్ (3,619).
2,124ఓట్లు..
నకిరేకల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల వీరేశం కారు గుర్తుకు 85,440 ఓట్లు పోలవగా ఈ స్థానంలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య హస్తం గుర్తుకు 93,699 ఓట్లు వచ్చాయి. 8,259 ఓట్ల తేడాతో వీరేశంపై లింగయ్య గెలిచారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అక్కడ సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ (ఎస్‌ఎంఎఫ్‌బీ) పార్టీ తరఫున పోటీ చేసిన దుబ్బ రవికుమార్ ట్రక్కు గుర్తుకు ఏకంగా 10,383 ఓట్లు పడ్డాయి. వీరేశం, లింగయ్యల మధ్య ఉన్న తేడా కంటే 2,124 ఎక్కువ ఓట్లు ట్రక్కు గుర్తుకు పడ్డాయన్నమాట.
267ఓట్లు..
తాండూరు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డికి 67,553 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్‌రెడ్డికి 70,428 ఓట్లు లభించాయి. ఇద్దరి మధ్య తేడా 2,875 ఓట్లు. కానీ ఇక్కడ అదే ఎస్‌ఎంఎఫ్‌బీ పార్టీ నుంచి పోటీ చేసిన పి. మహేందర్‌రెడ్డి అనే అభ్యర్థికి 2,608 ఓట్లు వచ్చాయి. అంటే ప్రధాన అభ్యర్థులు మహేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిల మధ్య తేడాకన్నా కేవలం 267 ఓట్లే తక్కువ వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment