forward bloc party
-
ట్రక్కు గుర్తు ఎవరికీ ఇవ్వొద్దు!
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకీ ట్రక్కు గుర్తును కేటాయించవద్దంటూ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరాను సీఎం కేసీఆర్ కోరారు. గురువారం ఢిల్లీలో సీఈసీని కలిసిన కేసీఆర్ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలో ట్రక్కు గుర్తు, తమ పార్టీ గుర్తయిన కారు ఒకే రకంగా ఉండటం వల్ల ఓటర్లు అయోమయానికి గురవుతున్నారని కేసీఆర్ వివరించారు. ఇటీవల పూర్తయిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రులకు కేటాయించిన ట్రక్కు (ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి కేటాయించారు), కెమెరా, ఇస్త్రీ పెట్టె, టోపీ తదితర గుర్తుల కారణంగా ఓటర్లు తికమకపడడంతో తమ పార్టీ కొన్ని ఓట్లు కోల్పోవాల్సి వచ్చిందని సీఎం పేర్కొన్నారు. కారు, ట్రక్కు గుర్తులు దాదాపు ఒకేరకంగా ఉన్నందున.. 15 మంది టీఆర్ఎస్ అభ్యర్థులు 1000 నుంచి 15,000 ఓట్లు నష్టపోయారని సీఈసీకి ఆయన వివరించారు. అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు కనీసం వెయ్యి ఓట్లు.. ఈ ట్రక్కు గుర్తు కారణంగా పొందలేకపోయారన్నారు. 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 100 స్థానాల్లో టీఆర్ఎస్ గెలిచేందుకు విస్తృతావకాశాలున్నప్పటికీ.. ఈ సమస్య కారణంగా 88 సీట్లే పొందగలిగిందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు మరిన్ని స్థానాలు వచ్చి ఉండేవని కేసీఆర్ అభిప్రాపడ్డారు. తమ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని.. అయితే, టీఆర్ఎస్కు అఖండ మెజారిటీని కట్టబెట్టే ప్రయత్నంలో ట్రక్కు గుర్తు కారణంగా ఓటర్లు అయోమయానికి గురయ్యారన్నారు. ఓట్లు తొలగింపుపై ఫిర్యాదు ఎన్నికల సందర్భంగా రూపొందించిన ఓటర్ల జాబితాలో 22 లక్షల మంది పేర్లను తొలగించిన అంశాన్నీ సునీల్ అరోరా దృష్టికి సీఎం తీసుకెళ్లారు. టీఆర్ఎస్ 100 సీట్లను పొందలేకపోవడానికి ఎన్నికల జాబితాలో తప్పులు కూడా ఓ కారణమన్నారు. తన ఫిర్యాదును స్వీకరించి వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు తొలగించిన పేర్లను తిరిగి జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో 2.81 కోట్ల ఓటర్లుండగా.. తాజా అసెంబ్లీ ఎన్నికలకు ముందు హడావుడిగా ప్రచురించిన (సెప్టెంబర్ 2018 వరకున్న వివరాల ఆధారంగా) కొత్త జాబితాలో 22 లక్షల ఓట్లు గల్లంతయిన సంగతి తెలిసిందే. ట్రక్కు గుర్తు, 22లక్షల ఓట్ల గల్లంతుతోపాటుగా.. ఈవీఎంలో తమ పార్టీ గుర్తు కారు రంగును కాస్త ముదురురంగులోకి మార్చాలని కూడా కేసీఆర్ కోరారు. కేసీఆర్ డిమాండ్లకు సీఈసీ సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై మిగిలిన సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇటీవల తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిపినందుకు ఎన్నికల సంఘానికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో సీఎం తోపాటు పార్టీ ఎంపీ బి.వినోద్ కుమార్, బండ ప్రకాశ్‌లు పాల్గొన్నారు. రిజిస్టర్ పార్టీయే: వినోద్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఎఫ్బీపీ) గుర్తింపు పొందిన పార్టీయేం కాదని.. కేవలం రిజిస్టర్డ్ పార్టీయేనని కేసీఆర్ గుర్తుచేశారు. అందువల్ల సార్వత్రిక ఎన్నికల్లో ట్రక్కు గుర్తు ఎఫ్బీపీ సహా ఎవరికీ కేటాయించవద్దంటూ కేసీఆర్ విజ్ఞప్తి చేశారని ఎంపీ వినోద్ వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఓటర్లు గుర్తించేందుకు అనువుగా పార్టీల గుర్తులుండాలే తప్ప వారిని అమోమయానికి గురిచేసేలా ఉండకూడదని సీఈసీని సీఎం కోరారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ అంశంపై సీఈసీకి ఫిర్యాదు చేశామని అయితే.. అప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఏమీ చేయలేమని ఎన్నికల సంఘం చెప్పిందన్నారు. -
కారుకు ట్రక్కు బ్రేకులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లలో ఘన విజయం సాధించినప్పటికీ 26 నియోజకవర్గాల్లో మాత్రం ‘కారు’జోరుకు ‘ట్రక్కు’బ్రేకులు వేసింది. ప్రజలు ఎప్పుడూ పేరు కూడా వినని సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ (ఎస్ఎంఎఫ్బీ) అనే పార్టీతోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ కేటాయించిన ట్రక్కు గుర్తు టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపింది. ఈవీఎంలలో పొందుపరిచిన ట్రక్కు చిహ్నం, కారు గుర్తును పోలి ఉండటం నిరక్షరాస్యులు, వృద్ధులు గందరగోళపరిచింది. దీంతో ఎస్ఎంఎఫ్బీ పోటీ చేసిన 26 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓట్లకు భారీగా గండిపడింది. ఫలితంగా ఆయా చోట్ల టీఆర్ఎస్ మెజారిటీ 5 వేల నుంచి 10 వేల ఓట్ల వరకు తగ్గడమే కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓటమికి కారణమైంది. ఆరు చోట్ల ప్రత్యక్ష ప్రభావం... రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎంఎఫ్బీ పార్టీకి వచ్చిన ఓట్ల వివరాలను పరిశీలిస్తే ఆ పార్టీ పోటీ చేసిన ప్రతిచోటా గణనీయంగా ఓట్లు వచ్చాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో అత్యల్పంగా 1,152 ఓట్లు రాగా, అత్యధికంగా ధర్మపురిలో 13,114 ఓట్లు వచ్చాయి. మొత్తం 26 స్థానాల్లో పోటీ చేస్తే బీజేపీ, టీజేఎస్, సీపీఐ లాంటి పార్టీలు, బలమైన ఇండిపెండెంట్లు పోటీలో లేని అన్ని స్థానాల్లోనూ ఆ పార్టీనే మూడో స్థానంలో నిలిచింది. కొన్ని చోట్ల ఈ పార్టీలకన్నా ఎక్కువ ఓట్లు కూడా సాధించింది. నియోజకవర్గాలవారీ వివరాలను పరిశీలిస్తే నకిరేకల్‌లో ఏకంగా టీఆర్ఎస్ అభ్యర్థిని ట్రక్కు గుర్తు ఓడించింది. తాండూరులో ఓటమిపాలైన పట్నం మహేందర్‌రెడ్డి ఓటమి మార్జిన్ 2,925 ఓట్లకు చేరడానికి కూడా ట్రక్కు గుర్తే కారణమైంది. ధర్మపురిలో 10 వేల పైచిలుకు మెజారిటీతో గెలవాల్సిన కొప్పుల ఈశ్వర్ బతుకు జీవుడా అంటూ 400 ఓట్లతో గెలివాల్సి వచ్చింది. అలాగే పరిగి, పెద్దపల్లి, కామారెడ్డి నియోజకవర్గాల్లో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీకన్నా ట్రక్కు గుర్తుకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. వాటితోపాటు మరో 20 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ ట్రక్కు గుర్తు కారణంగా తగ్గిపోయింది. సీపీఎం కూటమికన్నా ఎక్కువ ఓట్లు... సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌బ్లాక్ 26 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 1,66,367 ఓట్లు సాధించగా కమ్యూనిస్టు పార్టీగా రాష్ట్ర ప్రజలకు సుపరిచితమైన సీపీఎంతో కలసి 107 స్థానాల్లో పోటీ చేసిన బహుజన లె‹ఫ్ట్ ఫ్రంట్ పార్టీ (బీఎల్ఎఫ్) కేవలం 1,41,432 ఓట్లే సాధించగలిగింది. రాష్ట్రవ్యాప్తంగా పోలయిన ఓట్లలో బీఎల్ఎఫ్పీ అభ్యర్థులకు 0.7 శాతం ఓట్లు రాగా ఎస్ఎంఎఫ్బీకి మాత్రం 0.8 శాతం ఓట్లు వచ్చాయి. దీన్నిబట్టి రాష్ట్ర ఓటర్లు కారు, ట్రక్కు గుర్తులను పోల్చుకోవడంలో గందరగోళానికి గురయ్యారని, అందుకే ఆ పార్టీకి అన్ని ఓట్లు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆటో తీసేశారు కానీ... 2014 సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగ్గా అప్పుడు కారుతోపాటు ఆటో గుర్తుకు కూడా ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. ఆటో గుర్తు కారణంగా అప్పట్లో టీఆర్ఎస్ చాలా చోట్ల నష్టపోగా కొన్ని చోట్ల లాభపడింది. అయితే ఈ గందరగోళం మంచిది కాదనే ఆలోచనతో ఈసారి ఎన్నికల్లో ఆటో గుర్తును ఎవరికీ ఇవ్వొద్దని ఎన్నికల సంఘాన్ని టీఆర్ఎస్ కోరింది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఆటో గుర్తును ఎన్నికల సంఘం మినహాయించింది. కానీ కారు గుర్తును పోలి ఉన్న ట్రక్కు గుర్తును వదిలేయడంతో వీలున్నంతమేర ఆ గుర్తు టీఆర్ఎస్కు నష్టం చేయడం గమనార్హం. వివిధ నియోజకవర్గాల్లో ట్రక్కు గుర్తుకు వచ్చిన ఓట్లు... అలంపూర్ (8,803), భువనగిరి (3,613), భూపాలపల్లి (2,171), దుబ్బాక (12,215), గద్వాల (7,189), జడ్చర్ల (2,886), జనగామ (10,031), కామారెడ్డి (10,537), ఖైరతాబాద్ (1,152), ఎల్బీ నగర్ (3,739), మహేశ్వరం (3,457), మల్కాజిగిరి (4,651), మానకొండూరు (13,610), మంథని (5,457), మెదక్ (6,947), మునుగోడు (2,279), నాగార్జున సాగర్ (9,819), నాగర్ కర్నూల్ (5,545), నకిరేకల్ (10,383), పాలకుర్తి (3,199), పరిగి (8,694), పెద్దపల్లి (8,499), కుత్బుల్లాపూర్ (3,045), రామగుండం (3,531), కంటోన్మెంట్ (1,745), తాండూరు (2,608), తుంగతుర్తి (3,729), వికారాబాద్ (3,214), వరంగల్ వెస్ట్ (3,619). 2,124ఓట్లు.. నకిరేకల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం కారు గుర్తుకు 85,440 ఓట్లు పోలవగా ఈ స్థానంలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య హస్తం గుర్తుకు 93,699 ఓట్లు వచ్చాయి. 8,259 ఓట్ల తేడాతో వీరేశంపై లింగయ్య గెలిచారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అక్కడ సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ (ఎస్ఎంఎఫ్బీ) పార్టీ తరఫున పోటీ చేసిన దుబ్బ రవికుమార్ ట్రక్కు గుర్తుకు ఏకంగా 10,383 ఓట్లు పడ్డాయి. వీరేశం, లింగయ్యల మధ్య ఉన్న తేడా కంటే 2,124 ఎక్కువ ఓట్లు ట్రక్కు గుర్తుకు పడ్డాయన్నమాట. 267ఓట్లు.. తాండూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డికి 67,553 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్‌రెడ్డికి 70,428 ఓట్లు లభించాయి. ఇద్దరి మధ్య తేడా 2,875 ఓట్లు. కానీ ఇక్కడ అదే ఎస్ఎంఎఫ్బీ పార్టీ నుంచి పోటీ చేసిన పి. మహేందర్‌రెడ్డి అనే అభ్యర్థికి 2,608 ఓట్లు వచ్చాయి. అంటే ప్రధాన అభ్యర్థులు మహేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిల మధ్య తేడాకన్నా కేవలం 267 ఓట్లే తక్కువ వచ్చాయి. -
శవయాత్రలో డిష్యుం డిష్యుం... గాలిలో కాల్పులు
టీనగర్: అంతిమయాత్రలో జరిగిన ఘర్షణకు సంబంధించి నలభై మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీ సులు గాలిలోకి కాల్పులు జరిపారు. 40 మందిపై కేసు నమోదు చేశారు. ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడకుండా భారీ పోలీసు భద్రత కల్పించారు. ఈ ఘటన తేనిలో చోటుచేసుకుంది. తేని జిల్లా ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తమిళన్ (37). అవివాహితుడైన ఆయన బెంగళూరులో లా కోర్సు చదివారు. పరీక్షలు రాసేందుకు బెంగళూరుకు వెళ్లిన తమిళన్ తాను బసచేసిన గదిలో గుండెపోటుతో మృతిచెందారు. ఆయన మృతదేహానికి అంత్యక్రియలు జరిపేందుకు తేనికి తీసుకొచ్చారు. శనివారం మధ్యాహ్నం ఆయన మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఆ సమయంలో ఊరేగింపుగా వెళ్లిన వారికి, మరో వర్గానికి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆ ప్రాంతం యుద్ధవాతావరణాన్ని తలపించింది. బొమ్మయ్గౌండన్పట్టికి చెందిన రామర్ (45) ట్రాక్టర్ నుంచి పడి తీవ్రంగా గాయపడి అతను మృతిచెందాడు. ఘర్షణలో అల్లినగరం, పల్లివోడై వీధికి చెందిన మలైసామి (35) మృతిచెందాడు. విషయం తెలిసి జిల్లా ఎస్పీ మహేష్, పోలీసులను అక్కడికి చేరుకున్నారు. రాళ్లదాడికి పాల్పడిన వ్యక్తులపై లాఠీచార్జి జరిపి వారిని చెదరగొట్టారు. ఆ తర్వాత అల్లినగరంలోను ఊరేగింపు జరుగుతుండగా రాళ్లదాడి జరిగింది. అక్కడ తెరచివున్న దుకాణాలపై కొందరు రాళ్లు రువ్వారు. ప్రభుత్వ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. రాళ్ల దాడిలో ఎస్పీ మహేష్ సహా తొమ్మిది మంది గాయపడ్డారు. శవయాత్ర రత్నానగర్ చేరుకుంటుండగా అక్కడ ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఆ సమయంలో జరిగిన రాళ ్లదాడిలో డీఎస్పీ శీనిసామి, ఇన్స్పెక్టర్ ఆరుముగం, సాయుధపోలీసు రమేష్ గాయపడ్డారు. అప్పటికీ సద్దుమణగక పోవడంతో పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపారు. దక్షిణ డివిజన్ ఐజీ అభయ్‌కుమార్, దిండుగల్ సర్కిల్ డీఐజీ అరివుసెల్వం, జిల్లా ఎస్పీ శరణన్ తేనికి చేరుకున్నారు. తేనీలో దుకాణాలను బంద్ చేశారు. ఆ ప్రాంతంలో భారీ పోలీసు భద్రత ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా 40 మందిపై కేసు నమోదు చేశారు.