సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ : 2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకీ ట్రక్కు గుర్తును కేటాయించవద్దంటూ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సునీల్ అరోరాను సీఎం కేసీఆర్ కోరారు. గురువారం ఢిల్లీలో సీఈసీని కలిసిన కేసీఆర్ ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈవీఎంలో ట్రక్కు గుర్తు, తమ పార్టీ గుర్తయిన కారు ఒకే రకంగా ఉండటం వల్ల ఓటర్లు అయోమయానికి గురవుతున్నారని కేసీఆర్ వివరించారు. ఇటీవల పూర్తయిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రులకు కేటాయించిన ట్రక్కు (ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి కేటాయించారు), కెమెరా, ఇస్త్రీ పెట్టె, టోపీ తదితర గుర్తుల కారణంగా ఓటర్లు తికమకపడడంతో తమ పార్టీ కొన్ని ఓట్లు కోల్పోవాల్సి వచ్చిందని సీఎం పేర్కొన్నారు.
కారు, ట్రక్కు గుర్తులు దాదాపు ఒకేరకంగా ఉన్నందున.. 15 మంది టీఆర్‌ఎస్ అభ్యర్థులు 1000 నుంచి 15,000 ఓట్లు నష్టపోయారని సీఈసీకి ఆయన వివరించారు. అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు కనీసం వెయ్యి ఓట్లు.. ఈ ట్రక్కు గుర్తు కారణంగా పొందలేకపోయారన్నారు. 119 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 100 స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలిచేందుకు విస్తృతావకాశాలున్నప్పటికీ.. ఈ సమస్య కారణంగా 88 సీట్లే పొందగలిగిందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మరిన్ని స్థానాలు వచ్చి ఉండేవని కేసీఆర్ అభిప్రాపడ్డారు. తమ ప్రభుత్వం నాలుగున్నరేళ్ల పాలనపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని.. అయితే, టీఆర్‌ఎస్‌కు అఖండ మెజారిటీని కట్టబెట్టే ప్రయత్నంలో ట్రక్కు గుర్తు కారణంగా ఓటర్లు అయోమయానికి గురయ్యారన్నారు.
ఓట్లు తొలగింపుపై ఫిర్యాదు
ఎన్నికల సందర్భంగా రూపొందించిన ఓటర్ల జాబితాలో 22 లక్షల మంది పేర్లను తొలగించిన అంశాన్నీ సునీల్ అరోరా దృష్టికి సీఎం తీసుకెళ్లారు. టీఆర్‌ఎస్ 100 సీట్లను పొందలేకపోవడానికి ఎన్నికల జాబితాలో తప్పులు కూడా ఓ కారణమన్నారు. తన ఫిర్యాదును స్వీకరించి వచ్చే లోక్‌సభ ఎన్నికల వరకు తొలగించిన పేర్లను తిరిగి జాబితాలో చేర్చేలా చర్యలు తీసుకోవాలని సీఈసీని కోరారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో 2.81 కోట్ల ఓటర్లుండగా.. తాజా అసెంబ్లీ ఎన్నికలకు ముందు హడావుడిగా ప్రచురించిన (సెప్టెంబర్ 2018 వరకున్న వివరాల ఆధారంగా) కొత్త జాబితాలో 22 లక్షల ఓట్లు గల్లంతయిన సంగతి తెలిసిందే.
ట్రక్కు గుర్తు, 22లక్షల ఓట్ల గల్లంతుతోపాటుగా.. ఈవీఎంలో తమ పార్టీ గుర్తు కారు రంగును కాస్త ముదురురంగులోకి మార్చాలని కూడా కేసీఆర్ కోరారు. కేసీఆర్ డిమాండ్లకు సీఈసీ సానుకూలంగా స్పందించారు. ఈ విషయంపై మిగిలిన సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇటీవల తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతంగా జరిపినందుకు ఎన్నికల సంఘానికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో సీఎం తోపాటు పార్టీ ఎంపీ బి.వినోద్ కుమార్, బండ ప్రకాశ్‌లు పాల్గొన్నారు.
రిజిస్టర్ పార్టీయే: వినోద్
ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ (ఎఫ్‌బీపీ) గుర్తింపు పొందిన పార్టీయేం కాదని.. కేవలం రిజిస్టర్డ్ పార్టీయేనని కేసీఆర్ గుర్తుచేశారు. అందువల్ల సార్వత్రిక ఎన్నికల్లో ట్రక్కు గుర్తు ఎఫ్‌బీపీ సహా ఎవరికీ కేటాయించవద్దంటూ కేసీఆర్ విజ్ఞప్తి చేశారని ఎంపీ వినోద్ వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఓటర్లు గుర్తించేందుకు అనువుగా పార్టీల గుర్తులుండాలే తప్ప వారిని అమోమయానికి గురిచేసేలా ఉండకూడదని సీఈసీని సీఎం కోరారన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ అంశంపై సీఈసీకి ఫిర్యాదు చేశామని అయితే.. అప్పటికే ఎన్నికల ప్రక్రియ మొదలైనందున ఏమీ చేయలేమని ఎన్నికల సంఘం చెప్పిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment