Telangana Result 2018
-
పార్టీని మరింత బలోపేతం చేద్దాం
సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆశీర్వాదంతో మరోసారి ఏర్పడిన ప్రభుత్వానికి మంచి మంత్రివర్గం ఉంటుందని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా ఉండి పార్టీని మరింత బలోపేతం చేయాలని, పార్టీ బాగుంటేనే అందరం బాగుంటామని అన్నారు. టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ నియమితులైన నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సెక్రటరీ జనరల్ కె.కేశవరావు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ బాధ్యులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే... ‘తెలంగాణ ప్రజలు మనల్ని మళ్లీ ఆశీర్వదించారు. రాష్ట్రం సాధించినందుకు అప్పుడు, ప్రజలు ఆశించిన పాలన అందించినందుకు ఇప్పుడు అధికారం ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగించాలి. రాష్ట్రంలో మంచి మంత్రివర్గం ఉంటుంది. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తాం. పార్టీ సైతం ఇదే రకంగా ఉండాలి. ప్రభుత్వానికి మద్దతుగా పార్టీ నిలవాలంటే మరింత ధృడంగా ఉండాలి. ఉద్యమం, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇబ్బందులతో పార్టీని గుర్తించలేకపోయాం. ఈ విషయంలో కొన్ని ఆరోపణ లొచ్చాయి. పని విధానం మార్చుకుందాం. పార్టీ క్షేమంగా ఉంటేనే మనకు మంచిది. ప్రభుత్వం ఏం చేయాలో పార్టీ నిర్ణయించాలి. కేటీఆర్ ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటారు. పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలో మీరే నిర్ణయించి నాకు సూచించండి. సంస్థాగతంగా గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి. సభ్యత్వ నమోదు, గ్రామ, మండల స్థాయి నుంచి పార్టీ కమిటీలను చేపట్టాలి. జిల్లా కమిటీలు ఉంటే... ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా కమిటీలకు మధ్య కొన్ని స్పర్దలు వస్తాయి. పార్టీ నిర్మాణం ఇప్పుడున్నట్లు ఉంటే బాగుంటుందా?, జిల్లా కమిటీలు ఉంటే బాగుంటుందా? అనేది ఆలోచించండి. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలి. పార్టీ పరంగా ఇప్పుడున్న వ్యవస్థ సరిపోతుందా? ఒక్కో లోక్‌సభకు ఒక ప్రధాన కార్యదర్శి, ఇద్దరు కార్యదర్శులు ఉండాలా? జిల్లా స్థాయిలో, లోక్‌సభ సెగ్మెంట్ స్థాయిలో పార్టీకి ఏ విధానం ఉత్తమమో సూచించండి. రేపు మరోసారి భేటీ అయి అన్ని చర్చించండి. సభ్యత్వ నమోదు విషయంలో బాగా పని చేయాలి. జాతీయ రాజకీయాల్లో భాగస్వామ్యం పంచుకోవాలి. టీఆర్ఎస్ను రాష్ట్ర స్థాయిలో నడిపించేందుకు సమర్థుడు అవసరం. అందుకే కేటీఆర్‌కు పార్టీని అప్పగిస్తున్నాం. మంచి వ్యూహరచన, సమర్థత కలిగిన కేటీఆర్ ఆ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు’అన్నారు. ప్రగతిభవన్ పాస్‌లు... టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ బాధ్యులకు అన్నింట్లోనూ ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ చెప్పారు. ‘నేను మీకు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తా. మిమ్మల్ని కలుస్తా. రాష్ట్ర కమిటీ బాధ్యులు ప్రగతిభవన్‌కు వచ్చి నన్ను కలిసేందుకు వీలుగా పాసులు జారీ చేస్తాం. ప్రభుత్వంలో పదవుల భర్తీలో ముందుగా రాష్ట్ర కమిటీ వారినే పరిగణనలోకి తీసుకుంటాం. ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులతోపాటు హైదరాబాద్‌లో వసతి సదుపాయాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తాం. ప్రజల ఆకాంక్షల విషయంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేలా పార్టీ ఉండాలి. విపత్తులతో పంట నష్టం జరిగితే ముందుగా మన పార్టీ వాళ్లే వెళ్లాలి. బాధితులకు భరోసాతో పాటు నష్టం అంచనాలను అధికారులకు ముందుగా మనమే ఇవ్వాలి. మీరంతా క్షేత్రస్థాయిలో తిరగాలి. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య అనుసంధానంగా ఉండాలి’అని కేసీఆర్ అన్నారు. అందరి వేదికగా టీఆర్ఎస్: కేటీఆర్ పార్టీలో అందరికీ భాగస్వామ్యం ఉంటుందని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. స్థానిక పరిస్థితుల కారణంగా పార్టీకి ఎవరూ దూరం కావొద్దని... ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని చెప్పారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడి వెళ్లిపోయాక కేటీఆర్ ప్రసంగించారు. ‘కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో అంతా తామే అన్నట్లుగా ఉంటున్నారు. వ్యక్తిగతంగా వాళ్లకు నచ్చని వారిని తొక్కిపెడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులను, కేసీఆర్ అభిమానులను కొన్ని విషయాల్లో దూరం పెడుతున్నారు. పార్టీ విధానాలకు బద్ధులై ఉండే ప్రతి ఒక్కరికీ టీఆర్ఎస్ వేదికగా ఉండాలి. అలా పార్టీని నిర్మిద్దాం. టీఆర్ఎస్లో ఇంత కీలకమైన బాధ్యతలు ఇచ్చినందుకు అధినేత కేసీఆర్‌కు, మీకు ధన్యవాదాలు. టీఆర్ఎస్ విధివిధానాలను ఎప్పటికప్పుడు సమాచార మాధ్యమాలకు చెప్పేందుకు పార్టీ తరుఫున అధికార ప్రతినిధులను నియమిస్తాం. టీవీ చర్చల్లో ఎవరు పడితే వాళ్లు ఏదేదో చెప్పకుండా కొందరిని ఎంపిక చేస్తాం. పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది’అని అన్నారు. కేటీఆర్ నియామకానికి ఆమోదం... టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ నియామకానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర కార్యవర్గం తరుఫున ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించారు. చప్పట్లతో అందరు ఏకగ్రీవంగా ఆమోదించారు. రాష్ట్ర కమిటీ ధన్యవాద తీర్మానం... ‘కె.తారక రామారావును కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించినందుకు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా అభినందిస్తోంది. కేటీఆర్ నియామకంతో టీఆర్ఎస్కు యువరక్తం అందించినట్లయింది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసి, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా దేశవిదేశాల్లో తెలంగాణకు ఖ్యాతిని పెంచిన కేటీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ మరింత నిర్మాణాత్మకంగా, ఉత్సాహపూరితంగా తయారవుతుందనే ఆశాభావంతో కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేటీఆర్‌కు శుభాకాంక్షలతో బంగారు తెలంగాణ నిర్మాణానికి టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ పునరంకితమవుతుంది’అని తీర్మానించింది. కేసీఆర్‌కు పాదాభివందనం... టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తనను నియమించిన కేసీఆర్‌కు తెలంగాణ భవన్లో కేటీఆర్ పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేసీఆర్‌కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. కేసీఆర్‌కు శుభాకాంక్షలు... రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారి జరిగిన టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కమిటీ బాధ్యులు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. నేడు రాష్ట్ర కమిటీ సమావేశం... టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం జరగనుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్యర్యంలో తొలిసారి రాష్ట్ర కార్యవర్గం భేటీ కానుంది. పార్టీ బలోపేతంపై ఈ భేటీలో కీలక చర్చలు జరగనున్నాయి. -
కారుకు ట్రక్కు బ్రేకులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 88 సీట్లలో ఘన విజయం సాధించినప్పటికీ 26 నియోజకవర్గాల్లో మాత్రం ‘కారు’జోరుకు ‘ట్రక్కు’బ్రేకులు వేసింది. ప్రజలు ఎప్పుడూ పేరు కూడా వినని సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ (ఎస్ఎంఎఫ్బీ) అనే పార్టీతోపాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులకు ఈసీ కేటాయించిన ట్రక్కు గుర్తు టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపింది. ఈవీఎంలలో పొందుపరిచిన ట్రక్కు చిహ్నం, కారు గుర్తును పోలి ఉండటం నిరక్షరాస్యులు, వృద్ధులు గందరగోళపరిచింది. దీంతో ఎస్ఎంఎఫ్బీ పోటీ చేసిన 26 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓట్లకు భారీగా గండిపడింది. ఫలితంగా ఆయా చోట్ల టీఆర్ఎస్ మెజారిటీ 5 వేల నుంచి 10 వేల ఓట్ల వరకు తగ్గడమే కాకుండా కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓటమికి కారణమైంది. ఆరు చోట్ల ప్రత్యక్ష ప్రభావం... రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఎంఎఫ్బీ పార్టీకి వచ్చిన ఓట్ల వివరాలను పరిశీలిస్తే ఆ పార్టీ పోటీ చేసిన ప్రతిచోటా గణనీయంగా ఓట్లు వచ్చాయి. ఖైరతాబాద్ నియోజకవర్గంలో అత్యల్పంగా 1,152 ఓట్లు రాగా, అత్యధికంగా ధర్మపురిలో 13,114 ఓట్లు వచ్చాయి. మొత్తం 26 స్థానాల్లో పోటీ చేస్తే బీజేపీ, టీజేఎస్, సీపీఐ లాంటి పార్టీలు, బలమైన ఇండిపెండెంట్లు పోటీలో లేని అన్ని స్థానాల్లోనూ ఆ పార్టీనే మూడో స్థానంలో నిలిచింది. కొన్ని చోట్ల ఈ పార్టీలకన్నా ఎక్కువ ఓట్లు కూడా సాధించింది. నియోజకవర్గాలవారీ వివరాలను పరిశీలిస్తే నకిరేకల్‌లో ఏకంగా టీఆర్ఎస్ అభ్యర్థిని ట్రక్కు గుర్తు ఓడించింది. తాండూరులో ఓటమిపాలైన పట్నం మహేందర్‌రెడ్డి ఓటమి మార్జిన్ 2,925 ఓట్లకు చేరడానికి కూడా ట్రక్కు గుర్తే కారణమైంది. ధర్మపురిలో 10 వేల పైచిలుకు మెజారిటీతో గెలవాల్సిన కొప్పుల ఈశ్వర్ బతుకు జీవుడా అంటూ 400 ఓట్లతో గెలివాల్సి వచ్చింది. అలాగే పరిగి, పెద్దపల్లి, కామారెడ్డి నియోజకవర్గాల్లో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీకన్నా ట్రక్కు గుర్తుకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. వాటితోపాటు మరో 20 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన మెజారిటీ ట్రక్కు గుర్తు కారణంగా తగ్గిపోయింది. సీపీఎం కూటమికన్నా ఎక్కువ ఓట్లు... సమాజ్‌వాదీ ఫార్వర్డ్‌బ్లాక్ 26 స్థానాల్లో పోటీ చేసి ఏకంగా 1,66,367 ఓట్లు సాధించగా కమ్యూనిస్టు పార్టీగా రాష్ట్ర ప్రజలకు సుపరిచితమైన సీపీఎంతో కలసి 107 స్థానాల్లో పోటీ చేసిన బహుజన లె‹ఫ్ట్ ఫ్రంట్ పార్టీ (బీఎల్ఎఫ్) కేవలం 1,41,432 ఓట్లే సాధించగలిగింది. రాష్ట్రవ్యాప్తంగా పోలయిన ఓట్లలో బీఎల్ఎఫ్పీ అభ్యర్థులకు 0.7 శాతం ఓట్లు రాగా ఎస్ఎంఎఫ్బీకి మాత్రం 0.8 శాతం ఓట్లు వచ్చాయి. దీన్నిబట్టి రాష్ట్ర ఓటర్లు కారు, ట్రక్కు గుర్తులను పోల్చుకోవడంలో గందరగోళానికి గురయ్యారని, అందుకే ఆ పార్టీకి అన్ని ఓట్లు వచ్చాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆటో తీసేశారు కానీ... 2014 సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగ్గా అప్పుడు కారుతోపాటు ఆటో గుర్తుకు కూడా ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది. ఆటో గుర్తు కారణంగా అప్పట్లో టీఆర్ఎస్ చాలా చోట్ల నష్టపోగా కొన్ని చోట్ల లాభపడింది. అయితే ఈ గందరగోళం మంచిది కాదనే ఆలోచనతో ఈసారి ఎన్నికల్లో ఆటో గుర్తును ఎవరికీ ఇవ్వొద్దని ఎన్నికల సంఘాన్ని టీఆర్ఎస్ కోరింది. దీంతో ఈసారి ఎన్నికల్లో ఆటో గుర్తును ఎన్నికల సంఘం మినహాయించింది. కానీ కారు గుర్తును పోలి ఉన్న ట్రక్కు గుర్తును వదిలేయడంతో వీలున్నంతమేర ఆ గుర్తు టీఆర్ఎస్కు నష్టం చేయడం గమనార్హం. వివిధ నియోజకవర్గాల్లో ట్రక్కు గుర్తుకు వచ్చిన ఓట్లు... అలంపూర్ (8,803), భువనగిరి (3,613), భూపాలపల్లి (2,171), దుబ్బాక (12,215), గద్వాల (7,189), జడ్చర్ల (2,886), జనగామ (10,031), కామారెడ్డి (10,537), ఖైరతాబాద్ (1,152), ఎల్బీ నగర్ (3,739), మహేశ్వరం (3,457), మల్కాజిగిరి (4,651), మానకొండూరు (13,610), మంథని (5,457), మెదక్ (6,947), మునుగోడు (2,279), నాగార్జున సాగర్ (9,819), నాగర్ కర్నూల్ (5,545), నకిరేకల్ (10,383), పాలకుర్తి (3,199), పరిగి (8,694), పెద్దపల్లి (8,499), కుత్బుల్లాపూర్ (3,045), రామగుండం (3,531), కంటోన్మెంట్ (1,745), తాండూరు (2,608), తుంగతుర్తి (3,729), వికారాబాద్ (3,214), వరంగల్ వెస్ట్ (3,619). 2,124ఓట్లు.. నకిరేకల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం కారు గుర్తుకు 85,440 ఓట్లు పోలవగా ఈ స్థానంలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య హస్తం గుర్తుకు 93,699 ఓట్లు వచ్చాయి. 8,259 ఓట్ల తేడాతో వీరేశంపై లింగయ్య గెలిచారు. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అక్కడ సమాజ్‌వాదీ ఫార్వర్డ్ బ్లాక్ (ఎస్ఎంఎఫ్బీ) పార్టీ తరఫున పోటీ చేసిన దుబ్బ రవికుమార్ ట్రక్కు గుర్తుకు ఏకంగా 10,383 ఓట్లు పడ్డాయి. వీరేశం, లింగయ్యల మధ్య ఉన్న తేడా కంటే 2,124 ఎక్కువ ఓట్లు ట్రక్కు గుర్తుకు పడ్డాయన్నమాట. 267ఓట్లు.. తాండూరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డికి 67,553 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి పైలట్ రోహిత్‌రెడ్డికి 70,428 ఓట్లు లభించాయి. ఇద్దరి మధ్య తేడా 2,875 ఓట్లు. కానీ ఇక్కడ అదే ఎస్ఎంఎఫ్బీ పార్టీ నుంచి పోటీ చేసిన పి. మహేందర్‌రెడ్డి అనే అభ్యర్థికి 2,608 ఓట్లు వచ్చాయి. అంటే ప్రధాన అభ్యర్థులు మహేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిల మధ్య తేడాకన్నా కేవలం 267 ఓట్లే తక్కువ వచ్చాయి. -
నేడు కేసీఆర్ ప్రమాణం...
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు. మధ్యాహ్నం 1.25 గంటలకు రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుతానికి కేసీఆర్ ఒక్కరే ప్రమాణం చేయనుండగా.. జిల్లాలు, సామాజిక వర్గాల కూర్పు అనంతరం వారంలోపు పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరనుంది. రాజ్యాంగం ప్రకారం తెలంగాణలో సీఎంతోపాటు 17 మంది మంత్రులు ఉండాలి.. ఈ లెక్కల ప్రకారం.. సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం బుధవారం తెలంగాణభవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ శాసనసభపక్ష నేతగా కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ఎల్పీ నేతగా కేసీఆర్‌ను ఎన్నుకునే తీర్మానాన్ని ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత ప్రవేశపెట్టారు. ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ బలపరిచారు. అనంతరం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరు చప్పట్లతో తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. గవర్నర్‌కు అందజేత టీఆర్ఎస్ శానససభాపక్ష నేతగా కేసీఆర్ ఎన్నిక అనంతరం 11 మంది ఎమ్మెల్యేల బృందం రాజ్‌భవన్‌కు వెళ్లింది. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిసి ఎన్నికకు సంబందించిన పత్రాలను అందజేసింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా టీఆర్ఎస్ఎల్పీ నేతను ఆహ్వానించాలని కోరింది. ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సి.లక్ష్మారెడ్డి, కొప్పుల ఈశ్వర్, పద్మా దేవేందర్‌రెడ్డి, గొంగడి సునీత, అజ్మీరా రేఖానాయక్, దాస్యం వినయభాస్కర్, వి.శ్రీనివాస్‌గౌడ్, రవీంద్రకుమార్, కాలె యాదయ్యలు గవర్నర్‌ను కలిశారు. అంతకుముందు కేంద్ర ఎన్నికల సంఘం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ నర్సింహన్‌కు అందజేసింది. అన్నింటినీ పరిశీలించిన అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ నర్సింహన్ టీఆర్ఎల్పీనేత కేసీఆర్‌ను ఆహ్వానించారు. రాజీనామాలు ఆమోదం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రాజీనామా చేస్తూ గవర్నర్ నరసింహన్‌కు లేఖ పంపారు. గవర్నర్ దీన్ని ఆమోదించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి.. రాష్ట్ర మంత్రివర్గ రాజీనామా ఆమోదాన్ని ధ్రువీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మంత్రులంతా మాజీలయ్యారు. అసంతృప్తులు లేకుండా! మంత్రివర్గంలో ఎక్కువ మంది కొత్తవారికి చోటు కల్పించాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. గురువారం తనతోపాటు ఒక్కరినే మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. అదేరోజు పూర్తిస్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తే ప్రస్తుతం ఉన్న వారిలో అవకాశం దక్కని వారు అసంతృప్తితో ఉంటారు. కొన్ని రోజుల తర్వాత అయితే ఇప్పటి వరకు మంత్రులుగా ఉన్న వారిలో ఎక్కువ మందిని పక్కనపెట్టే అవకాశం ఉంటుంది. మంత్రులుగా ఉంటూ ఎమ్మెల్యేగా పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావు, అజ్మీరా చందులాల్, జూపల్లి కృష్ణారావు, పట్నం మహేందర్‌రెడ్డి ఓటమిపాలయ్యారు. వీరి స్థానంలో కొత్తగా నలుగురికి అవకాశం కల్పించాల్సి ఉంది. జిల్లాలు, సామాజికవర్గాల కూర్పుతో కొత్త జట్టును ఎంపిక చేసుకోనున్నారు. పరిశీలనలో దానం, వివేకా సామాజికవర్గాల వారీగా ఎర్రబెల్లి దయాకర్‌రావు, డీఎస్ రెడ్యానాయక్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్‌లకు చోటు కల్పించే అవకాశం ఉంది. వచ్చే మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రులు ఉంటారా లేదా అనేదానిపై స్పష్టతలేదు. అయితే.. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి స్థానంలో మాదిగ సామాజికవర్గానికి చెందిన అరూరి రమేశ్, మహమూద్ అలీ స్థానంలో మహ్మమ్మద్ ఫరీదుద్దీన్‌లు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. టి పద్మారావుగౌడ్ స్థానంలో కేపీ వివేకానంద్ గౌడ్, జోగు రామన్న స్థానంలో దానం నాగేందర్ లేదా దాస్యం వినయభాస్కర్ పేర్లను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలిస్తున్నారు. స్పీకర్ పదవిని ఎవరికి అప్పగించాలనే విషయంపై స్పష్టత వచ్చిన తర్వాతే మంత్రివర్గ కూర్పు తుదిదశకు రానుంది. -
అచ్చొచ్చిన చోట.. అలవోకగా.. ‘గెలుపు’
మెదక్ జిల్లాలో నాయకులకు నేటితో నరాలు తెగే ఉత్కంఠకు తెర పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మెదక్ జిల్లా నాయకుల భవిష్యత్తును మార్చాయి. గతంలో మెదక్‌లో టీఆర్ఎస్ పది స్ధానాలను గెలుచుకుంది, కానీ ఇప్పుడు తొమ్మిది స్ధానాలకు పరిమితమైన ఓటు బ్యాంకు పెరగడంతో భారీ మెజారీటీతో మెదక్‌లో టీఆర్ఎస్ విజయం సాధించారు. ఉద్యమాల గడ్డగా పేరొందిన ‘సిద్దిపేట’ దేశ చరిత్రలోనే 2018 లో అత్యంత లక్ష మెజారీటితో గెలుపొందిన వ్యక్తిగా తన్నీరు హరీష్ రావు చరిత్ర సృష్టించారు. సాక్షి, మెదక్ : మెదక్‌లో రాజకీయ నేతగా నిలదొక్కుకోగలిగారంటే అది ఆమె సంకల్ప బలమే వృత్తి రీత్యా న్యాయవాది అయిన పద్మా దేవేందర్ రెడ్డి రాజకీయాల్లో అనేక ఆటుపోట్లను ఎదుర్కొటు, అడ్వకేట్ గా పనిచేసిన అనుభవంతో రాజకీయాల్లో డిప్యూటీ స్పీకర్ పదవిని స్వీకరించారు. బాధ్యతలను నిర్వర్తించడంలో కష్టపడే తత్వంతో మెదక్ స్ధానాన్ని టీఆర్ఎస్ అభ్యర్ధి పద్మా దేవేందర్ రెడ్డి నిలబెట్టుకున్నారు. మెదక్ జిల్లాలో గతంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నపది స్ధానాల్లో ఘన విజయం సాధించింది.ఈసారి ఈ జిల్లాలో టీఆర్ఎస్ ఒక స్థానాన్ని కొల్సోయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ , హరీష్ రావులకు బలమైన కేడర్ ఉన్నా కానీ ఈసారి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఒక నియోజకవర్గంలో ప్రజల మద్దతును పొందింది. సంగారెడ్డి నియోజకవర్గంలో గతంలో గెలిచిన చింతా ప్రభాకర్ ఈ ఎన్నికల్లో ఒటమి చెందారు. ఇప్పుడు సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్ధి జగ్గారెడ్డి గెలుపోందారు. హరీష్ రావు ఇలాకా సిద్దిపేటలో గతంలో కన్న ఈసారి భారీ మెజారీటితో గెలిచారు. కష్టపడేతత్వమే ఈయన బలం, నిత్యం ప్రజలతో మమేకం అయ్యే హరీష్ రావుకు, సిద్దిపేటలో టీ.జే.ఎస్ అభ్యర్ధి భవాని రెడ్డి ప్రత్యర్ధిగా నిలుచున్న గట్టిపోటీ ఇవ్వలేక పొయింది. ఎందుకంటే హరీష్ రావుకు సిద్దిపేటలో ట్రబుల్ షూటర్‌కు కబలమైన కేడర్ ఉండడం వల్ల లక్ష పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు.‘సిద్దిపేట’ దేశ చరిత్రలోనే 2018 లో అత్యంత మెజారీటితో గెలుపొందిన వ్యక్తిగా తన్నీరు హరీష్ రావు చరిత్ర సృష్టించారు. నర్సాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి సునీతారెడ్డి పైన టీఆర్ఎస్ అభ్యర్ధి చిలుముల మదన్ రెడ్డి విజయం సాధించారు. జహీరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్ధి కె.మాణిక్‌రావు గట్టి పోటీ ఇవ్వడంతో కాంగ్రెస్ అభ్యర్ధి గీతారెడ్డి ఒటమి పాలైనారు. పఠాన్‌చెరులో టీఆర్ఎస్ అభ్యర్ధి గూడెం మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి కాటా శ్రీనివాస్ గౌడ్ పైన గెలిచారు. ఆందోల్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర రాజనర్సింహ గట్టి పోటీ ఇచ్చిన టీఆర్ఎస్ అభ్యర్ధి చంటి క్రాంతి కిరణ్ గెలుపొందారు. నారయణఖేడ్‌లో కాంగ్రెస్ అభ్యర్ధి సురేశ్ షెట్కార్ , టీఆర్ఎస్ అభ్యర్ధి భుపాల్‌రెడ్డి పైన చిత్తుగా ఒడిపోయారు. దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్ధి మద్దుల నాగేశ్వర్‌రెడ్డి పైన , టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట రామలింగారెడ్డి భారీ మెజారీటీతో విజయం సాధించారు. మాటల మాంత్రికుడు తనదైన పరిపాలనతో, ప్రత్యర్ధుల మాటలకు తన తూటలకు విసారే వాక్చాతుర్యంతో, కేసీఆర్ పోటీ చేసిన గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్ధి ఒంటేరు ప్రతాప్ రెడ్డి , బీజేపీ అభ్యర్ధి ఆకుల విజయ లు కేసీఆర్‌కు ఎంత పోటీ ఇచ్చిన, అభివృద్దే మంత్రంగా భావించే కేసీఆర్ గజ్వేల్ స్ధానాన్ని మరోసారి భారీ విజయంతో నిలబెట్టుకున్నారు. నియోజకవర్గం అభ్యర్ధి పార్టీ మెదక్ పద్మాదేవేందర్ రెడ్డి టీఆర్ఎస్ నర్సాపూర్ చిలుముల మదన్ రెడ్డి టీఆర్ఎస్ జహీరాబాద్(ఎస్సీ) కె. మాణిక్ రావు టీఆర్ఎస్ సంగారెడ్డి జగ్గారెడ్డి కాంగ్రెస్ ఆందోల్ చంటి క్రాంతి కిరణ్ టీఆర్ఎస్ పఠాన్‌చెరు గూడెం మహిపాల్ రెడ్డి టీఆర్ఎస్ సిద్దిపేట టీ. హరీశ్ రావు టీఆర్ఎస్ గజ్వేల్ కేసీఆర్ టీఆర్ఎస్ హూస్నాబాద్ వడితెల సతీష్ కుమార్ టీఆర్ఎస్ దుబ్బాక సోలిపేట రామలింగా రెడ్డి టీఆర్ఎస్ నారాయణఖేడ్ ఎమ్. భూపాల్ రెడ్డి టీఆర్ఎస్ -
టీఆర్ఎస్కు సినీతారల ‘విజయాభినందనలు’
తెలంగాణలో ఘనవిజయం దిశగా దూసుకుపోతోన్న తెలంగాణ రాష్ట్రసమితి పార్టీకి ఆ పార్టీ నాయకులకు సినీ తారల నుంచి కూడా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సర్వేల అంచనాలను కూడా తలకిందులు చేస్తూ ఘనవిజయం సాధించటంతో హీరోలు.. టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్, కేటీఆర్‌లను అభినందిస్తూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ కేసీఆర్‌గారికి హృదయపూర్వక విజయాభినందలు అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘నాలుగున్నరేళ్ల కాలం పాటు పరిపాలన తర్వాత ఇంత అత్యధిక స్థానాలలో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావటం చాలా గొప్ప విషయం. కేసీఆర్ గారు ప్రవేశ పెట్టిన పథకాలన్నీ ప్రజలకి ఎంతో మేలు చేశాయి. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఆయనకి ఈ అఖండ విజయాన్ని అందించారు. మళ్లీ రెండోసారి తెలంగాణకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న శ్రీ కే చంద్ర శేఖర రావు గారికి నా హృదయపూర్వక అభినందనలు’ అంటూ ఓ లేఖను విడుదల చేశారు. హీరోలు శ్రీకాంత్, సుధీర్ బాబు, నాని, నిఖిల్, మంచు మనోజ్ లతో పాటు దర్శకులు హరీష్ శంకర్, గోపిచంద్ మలినేని, మెహర్ రమేష్, కోన వెంకట్, మధుర శ్రీధర్ లాంటి సినీతారలు శుభాకాంక్షలు తెలిపారు. Congratulations brother @KTRTRS and @trspartyonline for the glorious win.👍👏 The people of Telangana have done their part and I'm sure you will deliver your best for a prosperous future!#TelanganaWithKCR — Nani (@NameisNani) December 11, 2018 Congratulations to our film industry uncle #TalasaniSrinivasYadav garu and @talasani_sai for the win and constantly being there for the welfare of our people..❤️🙏 #TelanganaElection2018 #ElectionResults2018 — Manoj Kumar Manchu❤️ (@HeroManoj1) December 11, 2018 -
తేడా కొడుతోందా!
-
ముఖ్యమంత్రి పదవి కోసం కాంగ్రెస్‌లో పోటీ