సాక్షి, హైదరాబాద్: ప్రజల ఆశీర్వాదంతో మరోసారి ఏర్పడిన ప్రభుత్వానికి మంచి మంత్రివర్గం ఉంటుందని టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా ఉండి పార్టీని మరింత బలోపేతం చేయాలని, పార్టీ బాగుంటేనే అందరం బాగుంటామని అన్నారు. టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ నియమితులైన నేపథ్యంలో శుక్రవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సెక్రటరీ జనరల్ కె.కేశవరావు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ బాధ్యులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు.
ఆ విషయాలు ఆయన మాటల్లోనే... ‘తెలంగాణ ప్రజలు మనల్ని మళ్లీ ఆశీర్వదించారు. రాష్ట్రం సాధించినందుకు అప్పుడు, ప్రజలు ఆశించిన పాలన అందించినందుకు ఇప్పుడు అధికారం ఇచ్చారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగించాలి. రాష్ట్రంలో మంచి మంత్రివర్గం ఉంటుంది. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం కల్పిస్తాం. పార్టీ సైతం ఇదే రకంగా ఉండాలి. ప్రభుత్వానికి మద్దతుగా పార్టీ నిలవాలంటే మరింత ధృడంగా ఉండాలి. ఉద్యమం, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇబ్బందులతో పార్టీని గుర్తించలేకపోయాం. ఈ విషయంలో కొన్ని ఆరోపణ లొచ్చాయి. పని విధానం మార్చుకుందాం. పార్టీ క్షేమంగా ఉంటేనే మనకు మంచిది.
ప్రభుత్వం ఏం చేయాలో పార్టీ నిర్ణయించాలి. కేటీఆర్ ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటారు. పార్టీ బలోపేతం కోసం ఏం చేయాలో మీరే నిర్ణయించి నాకు సూచించండి. సంస్థాగతంగా గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి. సభ్యత్వ నమోదు, గ్రామ, మండల స్థాయి నుంచి పార్టీ కమిటీలను చేపట్టాలి. జిల్లా కమిటీలు ఉంటే... ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా కమిటీలకు మధ్య కొన్ని స్పర్దలు వస్తాయి. పార్టీ నిర్మాణం ఇప్పుడున్నట్లు ఉంటే బాగుంటుందా?, జిల్లా కమిటీలు ఉంటే బాగుంటుందా? అనేది ఆలోచించండి.
లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలి. పార్టీ పరంగా ఇప్పుడున్న వ్యవస్థ సరిపోతుందా? ఒక్కో లోక్‌సభకు ఒక ప్రధాన కార్యదర్శి, ఇద్దరు కార్యదర్శులు ఉండాలా? జిల్లా స్థాయిలో, లోక్‌సభ సెగ్మెంట్ స్థాయిలో పార్టీకి ఏ విధానం ఉత్తమమో సూచించండి. రేపు మరోసారి భేటీ అయి అన్ని చర్చించండి. సభ్యత్వ నమోదు విషయంలో బాగా పని చేయాలి. జాతీయ రాజకీయాల్లో భాగస్వామ్యం పంచుకోవాలి. టీఆర్‌ఎస్‌ను రాష్ట్ర స్థాయిలో నడిపించేందుకు సమర్థుడు అవసరం. అందుకే కేటీఆర్‌కు పార్టీని అప్పగిస్తున్నాం. మంచి వ్యూహరచన, సమర్థత కలిగిన కేటీఆర్ ఆ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు’అన్నారు.
ప్రగతిభవన్ పాస్‌లు...
టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ బాధ్యులకు అన్నింట్లోనూ ప్రాధాన్యత ఇస్తామని కేసీఆర్ చెప్పారు. ‘నేను మీకు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తా. మిమ్మల్ని కలుస్తా. రాష్ట్ర కమిటీ బాధ్యులు ప్రగతిభవన్‌కు వచ్చి నన్ను కలిసేందుకు వీలుగా పాసులు జారీ చేస్తాం. ప్రభుత్వంలో పదవుల భర్తీలో ముందుగా రాష్ట్ర కమిటీ వారినే పరిగణనలోకి తీసుకుంటాం. ఎమ్మెల్సీ, కార్పొరేషన్ చైర్మన్ పదవులతోపాటు హైదరాబాద్‌లో వసతి సదుపాయాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తాం. ప్రజల ఆకాంక్షల విషయంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేలా పార్టీ ఉండాలి. విపత్తులతో పంట నష్టం జరిగితే ముందుగా మన పార్టీ వాళ్లే వెళ్లాలి. బాధితులకు భరోసాతో పాటు నష్టం అంచనాలను అధికారులకు ముందుగా మనమే ఇవ్వాలి. మీరంతా క్షేత్రస్థాయిలో తిరగాలి. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య అనుసంధానంగా ఉండాలి’అని కేసీఆర్ అన్నారు.
అందరి వేదికగా టీఆర్‌ఎస్: కేటీఆర్
పార్టీలో అందరికీ భాగస్వామ్యం ఉంటుందని టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. స్థానిక పరిస్థితుల కారణంగా పార్టీకి ఎవరూ దూరం కావొద్దని... ఇలాంటివి భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని చెప్పారు. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడి వెళ్లిపోయాక కేటీఆర్ ప్రసంగించారు. ‘కొందరు ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో అంతా తామే అన్నట్లుగా ఉంటున్నారు. వ్యక్తిగతంగా వాళ్లకు నచ్చని వారిని తొక్కిపెడుతున్నారు. తెలంగాణ ఉద్యమకారులను, కేసీఆర్ అభిమానులను కొన్ని విషయాల్లో దూరం పెడుతున్నారు.
పార్టీ విధానాలకు బద్ధులై ఉండే ప్రతి ఒక్కరికీ టీఆర్‌ఎస్ వేదికగా ఉండాలి. అలా పార్టీని నిర్మిద్దాం. టీఆర్‌ఎస్‌లో ఇంత కీలకమైన బాధ్యతలు ఇచ్చినందుకు అధినేత కేసీఆర్‌కు, మీకు ధన్యవాదాలు. టీఆర్‌ఎస్ విధివిధానాలను ఎప్పటికప్పుడు సమాచార మాధ్యమాలకు చెప్పేందుకు పార్టీ తరుఫున అధికార ప్రతినిధులను నియమిస్తాం. టీవీ చర్చల్లో ఎవరు పడితే వాళ్లు ఏదేదో చెప్పకుండా కొందరిని ఎంపిక చేస్తాం. పార్టీ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత వీరిపై ఉంటుంది’అని అన్నారు.
కేటీఆర్ నియామకానికి ఆమోదం...
టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ నియామకానికి పార్టీ రాష్ట్ర కార్యవర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర కార్యవర్గం తరుఫున ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించారు. చప్పట్లతో అందరు ఏకగ్రీవంగా ఆమోదించారు.
రాష్ట్ర కమిటీ ధన్యవాద తీర్మానం...
‘కె.తారక రామారావును కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించినందుకు టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా అభినందిస్తోంది. కేటీఆర్ నియామకంతో టీఆర్‌ఎస్‌కు యువరక్తం అందించినట్లయింది. తెలంగాణ ఉద్యమంలో పనిచేసి, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా దేశవిదేశాల్లో తెలంగాణకు ఖ్యాతిని పెంచిన కేటీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ మరింత నిర్మాణాత్మకంగా, ఉత్సాహపూరితంగా తయారవుతుందనే ఆశాభావంతో కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేటీఆర్‌కు శుభాకాంక్షలతో బంగారు తెలంగాణ నిర్మాణానికి టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ పునరంకితమవుతుంది’అని తీర్మానించింది.
కేసీఆర్‌కు పాదాభివందనం...
టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తనను నియమించిన కేసీఆర్‌కు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేసీఆర్‌కు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.
కేసీఆర్‌కు శుభాకాంక్షలు...
రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారి జరిగిన టీఆర్‌ఎస్ కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కమిటీ బాధ్యులు కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
నేడు రాష్ట్ర కమిటీ సమావేశం...
టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం శనివారం జరగనుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆధ్యర్యంలో తొలిసారి రాష్ట్ర కార్యవర్గం భేటీ కానుంది. పార్టీ బలోపేతంపై ఈ భేటీలో కీలక చర్చలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment