సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలను స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా చపాతీ రోలర్ గుర్తు చిక్కు తెస్తుందేమోనని టీఆర్‌ఎస్ ఆందోళన చెందుతోంది. రెండూ ఒకే బ్యాలెట్‌లో ఉండనుండటంతో గ్రామీణ ప్రాంతాల ఓటర్లు తమ ఓట్లను ఎవరికేస్తారోనన్న గుబులు పట్టుకుంది. బీజేపీలోనూ ఒకింత ఆందోళన కనిపిస్తోంది. ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థుల పేర్లు మొదటి వరుసలోనే ఉన్నాయి. స్క్రూటినీ తరువాత తిరస్కరణకు గురైన, ఆమోదం పొందిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఈనెల 15న ప్రకటించారు. అందులో టీఆర్‌ఎస్ అభ్యర్థి పేరు ప్రభాకర్‌రెడ్డి కూసుకుంట్లగా పేర్కొంది.
నామినేషన్ల ఉప సంహరణ తరువాత ఇంటిపేరును పరిగణనలోకి తీసుకొని ఆంగ్ల అక్షరక్రమంలో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీలకు, తరువాత రిజిస్టర్డ్ పార్టీలకు, తరువాత స్వతంత్రులకు సీరియల్ నంబర్లను, గుర్తులను సోమవారం రాత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేటాయించారు. దీంతో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పేరు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కంటే ముందుకు వచ్చింది. బీఎస్పీ అభ్యర్థి ఆందోజు శంకరాచారి సీరియల్ నంబరు 1, టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల సీరియల్ నంబరు 2, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి నంబరు 3, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి నాలుగో నంబరు ఇచ్చారు.
ఒకే బ్యాలెట్‌లో..
సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అభ్యర్థి మారమోని శ్రీశైలం యాదవ్‌కు చపాతీ రోలర్ గుర్తును, సీరియల్ నంబరు 12ను కేటాయించారు. తెలంగాణ సకల జనుల పార్టీ, తెలంగాణ రిపబ్లికన్ పార్టీ, సోషల్ జస్జిస్ పార్టీ ఆఫ్ ఇండియా, ప్రజావాణి పార్టీలకు కేటాయించిన హెలికాప్టర్, షిప్, డైమండ్, టెలివిజన్ గుర్తులు ఒకే బ్యాలెట్లో ఉండనున్నాయి. ఈ ఎన్నికకు మూడు బ్యాలెట్ యూనిట్లు అవసరం. కప్పు సాసర్, క్యాలీఫ్లవర్, టిల్లర్ గుర్తులను స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించారు.
దీంతో బీజేపీకీ ఆందోళన తప్పడం లేదు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి గుర్తులే చాలా చోట్ల తమ అభ్యర్థుల ఓటమికి కారణం అయ్యాయని టీఆర్‌ఎస్ వాపోయింది. ఆ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్ గుర్తు కలిగిన స్వతంత్ర అభ్యర్థికి 25 వేల ఓట్లు వచ్చాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ నకిరేకల్‌లో కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తుకు 11 వేల ఓట్లు లభించాయి. అక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థి వేముల వీరేశం 6 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment