రాష్ట్ర శాసనసభ ముందస్తు ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు రోజులు కావస్తున్నా, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఓటమిపై అంతర్మథనం కొనసాగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో భారీ ఫలితాన్ని ఆశించిన కాంగ్రెస్.. కేవలం సంగారెడ్డి నియోజకవర్గంలో గెలుపుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పార్టీకి చెందిన దిగ్గజ నేతలు ఓటమి పాలు కాగా, చాలా చోట్ల నామమాత్ర పోటీకే కాంగ్రెస్ పరిమితమైంది. కూటమి భాగస్వామ్య పక్షాలతో పొత్తులు, బలహీన, బహుళ నాయకత్వం ఉన్న చోట అభ్యర్థుల ఎంపికలో తడబాటు కాంగ్రెస్ ఘోర పరాజయానికి దారితీశాయి. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అనుకూలతతో పాటు, జిల్లాలో నాయకత్వ సంక్షోభం కూడా ఓటమికి దారితీసినట్లు ఫలితాల సరళి వెల్లడిస్తోంది.
–సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి
ఇటీవల ముగిసిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా కూటమి ఉమ్మడి మెదక్ జిల్లాలోని పదకొండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ తొమ్మిది స్థానాల్లో, కూటమి భాగస్వామ్య పక్షం సీపీఐ హుస్నాబాద్‌లో, టీజేఎస్ సిద్దిపేట, దుబ్బాకలో పోటీ చేసింది. దుబ్బాకలో కూటమి భాగస్వామ్య పార్టీలు కాంగ్రెస్, టీజేఎస్ రెండూ స్నేహపూర్వక పోటీ పేరిట బరిలో నిలిచాయి. సంగారెడ్డి మినహా మిగతా పది అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైన వారిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రులు
గీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి ఉన్నారు. కూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కూడా ఓటమి పాలైన అభ్యర్థుల జాబితాలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు రోజులు కావస్తున్నా, కాంగ్రెస్ అభ్యర్థులు ఇంకా షాక్ నుంచి తేరుకున్న పరిస్థితి కనిపించలేదు. సంగారెడ్డిలో గెలుపొందిన మాజీ విప్ జగ్గారెడ్డి మినహా పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులెవరూ ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. తమ ఓటమికి దారితీసిన పరిస్థితులపై ఇప్పటి వరకు ఒక్క కాంగ్రెస్ అభ్యర్థి కూడా పెదవి విప్పడం లేదు. పార్టీ, అభ్యర్థుల కోసం కష్టపడిన నేతలు, శ్రేణులు మాత్రం అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి తమ సానుభూతి తెలిపి వస్తున్నట్లు సమాచారం.
ఎవరికి వారుగా.. ఎన్నికల బరిలోకి
గతంలో జిల్లాలో బలమైన రాజకీయ పక్షంగా ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ నేతలు, శ్రేణులు ఎన్నికల సందర్భంగా ఏకతాటిపై నడిచిన సందర్భం కనిపించలేదు. గజ్వేల్, జహీరాబాద్, సంగారెడ్డి, అందోలు, నర్సాపూర్ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులపై స్పష్టత ఉన్నా, నామినేషన్ల పర్వం మొదలైన తర్వాతే కాంగ్రెస్ జాబితాను విడుదల చేసింది. మరోవైపు సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీని రద్దు చేసినా, ఈ ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులు పెద్దగా దృష్టి సారించిన దాఖలాలు లేవు. సంగారెడ్డి, అందోలు, నర్సాపూర్‌లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు కొంత మేర పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసుకుని, శ్రేణులను సమీకరించే ప్రయత్నం చేశారు. 1952లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న జహీరాబాద్‌లో గీతారెడ్డి నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాతే తన ప్రచారాన్ని ప్రారంభించారు. పూర్తిగా పార్టీ స్థానిక నాయకత్వంపైనే భారం మోపడం, వయోభారం తదితరాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.
రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైనా పార్టీ యంత్రాంగానికి అందుబాటులో లేకపోవడం ఓటమికి బాటలు వేసింది. అందోలులో ప్రచార ఆర్భాటం లేకుండా పార్టీ యంత్రాంగాన్ని ముందు వరుసలో నిలిపిన దామోదర రాజనర్సింహ వ్యూహం పూర్తి స్థాయి ఫలితాన్ని ఇవ్వలేదు. నర్సాపూర్‌లో సునీత లక్ష్మారెడ్డి సర్వశక్తులూ ఒడ్డినా, కొన్ని మండలాల్లో బలహీన నాయకత్వం ప్రతిబంధకంగా నిలిచింది. గజ్వేల్‌లో కేసీఆర్‌కు గట్టి పోటీ ఇస్తాడని భావించిన ఒంటేరు ప్రతాప్‌రెడ్డి.. టీఆర్‌ఎస్ ఎన్నికల వ్యూహాన్ని ఎదుర్కోలేక పోలింగ్‌కు ముందే చేతులెత్తేసిన పరిస్థితి కనిపించింది.
బహుళ బలహీన నాయకత్వంతో నష్టం
నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా పార్టీకి కొంత బలంగా ఉన్న నారాయణఖేడ్, పటాన్‌చెరు, మెదక్, దుబ్బాక, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిర్ణయించడంలో కాంగ్రెస్ తడబాటుకు గురైంది. పటాన్‌చెరులో ఓ వైపు పార్టీలోనే అంతర్గతంగా టికెట్ కోసం అరడజను మంది నేతలు పోటీ పడుతున్న నేపథ్యంలో.. టీఆర్‌ఎస్ నుంచి కొత్తగా మరో నలుగురు వచ్చి చేరడం గందరగోళానికి దారితీసింది. అభ్యర్థిని నిర్ణయించడంలో చివరి వరకు మీనమేషాలు లెక్క పెట్టడం పార్టీకి పూడ్చుకోలేని నష్టాన్ని మిగిల్చింది. నారాయణఖేడ్‌లో పార్టీ టికెట్‌ను ఆశించిన మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎంపీపీ సంజీవరెడ్డి నడుమ రాజీ కుదర్చడంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం విఫలమైంది. సంజీవరెడ్డి చివరి నిమిషంలో పార్టీని వీడడంతో కాంగ్రెస్ కనీస పోటీని కూడా ఇవ్వలేకపోయింది.
పొత్తులపై చివరి వరకు ఉత్కంఠ
మెదక్, సిద్దిపేట, దుబ్బాక స్థానాలను టీజేఎస్‌కు కేటాయించిన కాంగ్రెస్ చివరి నిమిషంలో దుబ్బాక, మెదక్‌లో బీ ఫారాలు జారీ చేసింది. టికెట్ల కేటాయింపు గందరగోళంలో దుబ్బాక నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన సీనియర్ నేత ముత్యంరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. నామినేషన్ల పర్వానికి కొద్ది రోజుల ముందు పార్టీలో చేరిన నాగేశ్వర్‌రెడ్డికి చివరి క్షణంలో టికెట్ ఇవ్వడం, టీజేఎస్ అభ్యర్థి కూడా స్నేహపూర్వక పోటీ పేరిట బరిలో ఉండడం నష్టాన్ని మిగిల్చింది. మెదక్‌లోనూ అరడజను మంది నేతలు టికెట్ ఆశించినా, అనూహ్యంగా మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి సోదరుడు ఉపేందర్‌రెడ్డి తెరమీదకు వచ్చారు. టికెట్ ఆశించిన నేతలందరూ రాజీపడి ఏకతాటిపైకి వచ్చే లోపే పోలింగ్ తేదీ సమీపించడంతో పూర్తి స్థాయిలో ప్రచారం కూడా జరగలేదు. హుస్నాబాద్‌లోనూ సీపీఐ ఒత్తిడికి తలొగ్గి బలమైన అభ్యర్థి ప్రవీణ్‌రెడ్డికి టికెట్ నిరాకరించడం పార్టీ శ్రేణులకు మింగుడు పడలేదు. సిద్దిపేటను టీజేఎస్‌కు కేటాయించడంతో కాంగ్రెస్ నేతల నుంచి మద్దతు లేక కూటమి భాగస్వామ్య పక్షం కనీస ఓట్లను కూడా సాధించలేక పోయింది.
Comments
Please login to add a commentAdd a comment