
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: చేదు ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ పోస్టుమార్టం చేపట్టింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయానికి దారితీసిన కారణాలపై ఆరా తీస్తోంది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలో కేవలం మూడు సీట్లకే పరిమితం కావడంతో నైరాశ్యంలో కూరుకుపోయిన ఆ పార్టీ.. ఓటమిపై విశ్లేషణ ప్రారంభించింది. మహేశ్వరం, ఎల్‌బీనగర్, తాం డూరు స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్.. సిట్టింగ్ స్థానాలతో సహా ఏడు సీట్లను కోల్పోవడంతో పార్టీ నాయకత్వం బిత్తరపోయింది. టీడీపీతో జతకట్టడంతో మెజార్టీ సీట్లు దక్కించుకుంటామని గంపెడాశతో ఉన్న తమకు ఆ పొత్తే కొంపముంచినట్లు తాజాగా వెలువడ్డ ఫలితాలు స్పష్టం చేస్తుండడంతో కాంగ్రెస్ నేతలు దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు.
తాండూరులో మంత్రి మహేందర్‌రెడ్డి ఓడించడం ఊరట కలిగించే అంశమే అయినా సులువుగా గెలుస్తామని భావించిన సీట్లలో కూడా భారీ మెజార్టీతో ఓటమి పాలవడంతో సీట్ల సర్దుబాటు వ్యవహారం కూడా పార్టీకి నష్టం చేకూర్చుందనే వాదన వినిపిస్తోంది. సంస్థాగతంగా బలంగా ఉన్న సెగ్మెంట్లను టీడీపీకి కేటాయించడం.. ఆ పార్టీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కూడా అంచనా వేయకపోవడం దారుణ ఓటమి కారణాలుగా కాంగ్రెస్ నాయకత్వం విశ్లేషించింది. చంద్రబాబునాయుడు ప్రచారాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో టీఆర్‌ఎస్ సఫలమైందని, అలాగే ఏపీ ఓటర్లలోనూ ఇది చీలికకు దారితీసిందని అభిప్రాయపడింది. అంతేగాకుండా చంద్రబాబు రావడం వల్ల మరోసారి ప్రాంతీయభావం పెరిగి అది ప్రజాకూటమికి వ్యతిరేక ఓటుగా మారిందని తేల్చింది.
దీనికితోడు టీఆర్‌ఎస్‌కు సంక్షేమ పథకాలు కలిసివచ్చాయని అంచనా వేసింది. వికారాబాద్‌లో పార్టీ అభ్యర్థి ప్రసాద్‌కుమార్ బలంగా ఉన్నా.. బలమైన సామాజికవర్గం ఆయనకు మద్దతు ఇవ్వలేదని గుర్తించింది. అలాగే స్వతంత్ర అభ్యర్థి చంద్రశేఖర్ బరిలో నిలవడంతో పార్టీ ఓటమికి ప్రధాన కారణంగా తేల్చింది. ఇబ్రహీంపట్నం స్థానాన్ని మహాకూటమికి కేటాయించకపోతే ఈజీగా గెలిచేవాళ్లమని అభిప్రాయపడింది. కేవలం స్వల్ప ఓట్ల తేడాతో ఆ స్థానాన్ని కోల్పోయామని, టీడీ పీ బరిలో లేకపోతే అక్కడ ఆ పార్టీకి పడ్డ 17వేల ఓట్లు కూడా అదనంగా వచ్చేవనే అభిప్రాయానికొచ్చింది. శాసనసభ ఎన్నికల ఫలితాల ప్రభావం త్వరలో జరిగే స్థానిక సంస్థలు, సహకార ఎన్నికలపై ఉంటాయని, వీటిని అధిగమించడం ఎలా అనేదానిపై లోతుగా ఆలోచించాలని అధినాయకత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment