రిజిస్టర్‌లో నమోదు చేస్తున్న వైద్య సిబ్బంది
సాక్షి, వేములవాడ: ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలంటే తప్పకుండా వెంట ఆధార్‌కార్డు తీసుకెళ్లాల్సిందే... ఎందుకంటే ప్రతీ రోగి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచేందుకు ప్రభుత్వం కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రోగి సర్కారు వైద్యం కోసం దవాఖానాకు వెళ్లగా, బీపీ, షుగర్, జ్వరం పరీక్షలు నిర్విహించి వాటిని నమోదు చేస్తారు. దీంతో ప్రతీ రోగి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం 200లకు పైగా రోగులు వైద్య పరీక్షలకు వస్తున్నట్లు డాక్టర్ మానస తెలిపారు. వీరి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నట్లు చెప్పారు. ఆధార్‌కార్డు నంబర్ నమోదు చేయకుంటే ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు కావడం లేదని, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చేవారు తప్పకుండా తమ ఆధార్‌కార్డును తీసుకుని రావాలని సూచిస్తున్నామని చెబుతున్నారు.
రోగుల వివరాలు నమోదు
ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలను నమోదు చేస్తారు. రోగి పూర్తి పేరు, ఊరు, వీధి, వ్యాధి లక్షణాలు నమోదు చేస్తారు. అనంతరం బీపీ, షుగర్, ల్యాబ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఫార్మాసీకి తీసుకెళితే సదరు రోగి పేరు నమోదు చేసుకోని, ఈ–ఔషదీలో మందుల పేర్లను నమోదు చేస్తారు. దీంతో రోగి వాడిన మందుల సమాచారం ఆన్‌లైన్‌లో ఉండిపోతుంది. ఇలా ప్రతీ రోగి పూర్తి వివరాలు రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా ఆధార్‌కార్డుతో కూడిన ఐటీ నంబర్‌పై లభ్యం కానుంది.
ఇంటింటికి నమోదు
ఆశావర్కర్లు ఇంటింటికి తిరుగుతూ రోగుల వివరాలను పొందుపరుస్తారు. దీంతో ఎవరికి ఎలాంటి వ్యాధి ఉంది, ఎంత కాలంగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు, ఎలాంటి మందులు వాడుతున్నారు అనే వివరాలు అందుబాటులో ఉండనున్నాయి. దీర్ఘకాలిక, వంశపారంపర్య వ్యాధులు, ఇతర రోగాలతో బాధపేడే వారి వివరాలను సేకరించి ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు. దీంతో ఏ ఇంటిలో ఎంత మంది ఎలాంటి రోగాలతో బాధపడుతున్నారు? ఏ పరీక్షలు చేయాలనే అంశాలపై నిపుణులు పునరాలోచించుకుంటారు.
ప్రతీరోగికి సంబంధించిన వివరాలు నమోదు చేస్తున్నాం
వేములవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతీ రోగి పూర్తి వివరాలు తమ సిబ్బంది నమోదు చేస్తున్నారు. ఇంతేకాకుండా అన్ని అంశాలు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నాం. దీంతో ఈ రోగి రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా తన ఆధార్‌కార్డు నంబర్ చెప్పడంతో రోగి పూర్తి వివరాలు, అనారోగ్య లక్షణాలు, వాడుతున్న మందులు మొత్తం అంశాలు ఆన్‌లైన్‌లో లభిస్తాయి. దీంతో ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడే అంశంగా భావిస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యం పంచేందుకు ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటుంది.
- డాక్టర్ మహేశ్‌రావు, వైద్యాధికారి
Comments
Please login to add a commentAdd a comment