వణుకుతున్న ‘అనంత’
– రోగులతో కిటకిటలాడుతున్న సర్వజనాస్పత్రి
– జ్వరపీడితులే ఎక్కువ
అనంతపురం సిటీ : అనంతపురం జిల్లా రోగాలతో వణికిపోతోంది. టైఫాయిడ్, వైరల్ ఫీవర్‌లతో జనం అల్లాడిపోతున్నారు. దీంతో అనంతపురం సర్వజనాస్పత్రి కిటకిటలాడుతోంది. జిల్లా వ్యాప్తంగా 2 లక్షల మందికి పైగా జ్వరాలతో బాధపడుతున్నారని వైద్యులు అంచనా వేశారు. ఎక్కువ మంది విష జ్వరాల బారిన పడుతున్నారని చెబుతున్నారు.
అన్నింటికీ సర్వజనాస్పత్రే
సర్వజనాస్పత్రిలో 500 పడకలున్నాయి. 900 మంది రోగుల వరకైతే సరేగాని... అంతకు మించి రోగులు వచ్చినా వారికి వైద్య సేవలందించేందుకు వైద్యులకు శక్తి సామర్థ్యాలు సరిపోవడం లేదు. ఇక... ప్రాథమిక, కమ్యూనిటీ, ఏరియా ఆస్పత్రుల్లోనేమో జ్వరాలు నిర్ధారించాలంటే పట్టణాలకు వెళ్ళాల్సిందేనన్న చిన్న పాటి మెలిక ఒకటి పెట్టి పంపేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో మళ్లీ ఖర్చులు పెట్టుకొని మరీ అనంతపురం ఆస్పత్రికి రావాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. అనంతను కరువులాగే రోగాలు కూడా ఈ ఏడాది గట్టిగానే పట్టి పీడిస్తున్నా ఏఒక్క నాథుడు పట్టించుకోవడం లేదు.
పడకేసిన పారిశుద్ధ్యం
పల్లెల్లో పారిశుద్ధ్యం పనులు చక్కబెట్టేందుకు పంచాయతీకి రూ.10 వేలు వైద్యారోగ్యశాఖ నుంచి నిధులు మంజూరు చేశారు. ఈ నిధులు ఏఎన్‌ఎం ఆధీనంలో ఉన్నా అధికారాలు మాత్రం సర్పంచులకు అప్పగించారు. కాగా ఇప్పటి దాకా ఒక్క రూపాయి కూడా నిధులు విడుదలు చేయలేదని తెలిసింది. దీంతో పారిశుద్ధ్యం పడకేయడంతో ప్రజలు మంచాల బారిన పడుతున్నారు. మెత్తంగా కోటి రూపాయలకు పైగా నిధులు అలాగే ఉన్నాయని సమాచారం. మరి ఈ నిధులు ఇప్పుడే వాడుకుంటారా ? లేక వారి స్వార్థాలకు వినియోగించుకునేందుకు ఏమైనా కుట్రలు పన్నుతున్నారా? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయని సిబ్బంది గుసగుసలాడుతున్నారు.