సాక్షి, అనంతపురం: అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం చోటు చేసుకుంది. ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న 10 మంది రోగులు మృతి చెందారు. మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. దీంతో హాస్పిటల్ వద్ద బందువులు ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మరణాలు సంభవించాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా ఈ సంఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్ జగన్నాథం మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో పరిస్థితి విషమించడంతో రోగులు ఒకేసారి ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారన్నారు. సీరియస్ కేసులన్నీ ఆస్పత్రిలో ఒకేసారి అడ్మిట్ అయ్యాయని తెలిపారు. గుండెజబ్బు, ఊపిరితిత్తులు, రక్తహీనత, టీబీ వంటి వ్యాధులతో బాధపడే వారు మృతి చెందారన్నారు. గతంలో ఎపుడూ ఒకేరోజు ఇన్ని మరణాలు జరగలేదన్నారు. ఘటనపై విచారణ చేపడుతున్నట్టు తెలిపారు.
కామినేని ఆరా..
అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో మరణాలపై వైద్య, ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. మీడియాలో వస్తున్న కథనాలపై సూపరింటెండెంట్‌తో ఆయన మాట్లాడారు. ఘటనపై విచారిణ జరిపి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. నివేదిక రాగానే ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. అదే విధంగా ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్, డిఎంహెచ్ఓలను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
వైఎస్‌ఆర్సీపీ ఆందోళన
అనంతపురం ప్రభుత్వాస్పత్రిని స్థానిక వైఎస్‌ఆర్సీపీ నేతలు విశ్వేశ్వర రెడ్డి, తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. మృతుల బంధువులను కలిసి వివరాలు తెలుసుకున్నారు. మరణాలపై ఆస్పత్రి సూపరింటెండ్ వ్యవహరించిన తీరుపై వారు మండిపడ్డారు. వామపక్ష నేతలతో కలిసి ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు