సాక్షి, సిరిసిల్ల: ‘కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నర్మాల ఎగువ మానేరులోకి నీళ్లు తీసుకు వస్తం.. ఏడాదిపొడవునా ఇందులో నీళ్లుంటే.. మానేరువాగుకు జీవం వస్తుంది. మధ్యమానేరు, ఎల్‌ఎండీ నుంచి పెద్దపల్లి జిల్లా మంథని సమీపంలోని గోదావరి నదిలోకి నిరంతరం నీటిపారకం ఉంటుంది.. ఈ పరీవాహక ప్రాంతంలోని వ్యవసాయ రంగానికి నీటిసమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది..’ అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. సిరిసిల్లలో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు.
రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ తెలంగాణలోనే ఉందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి నియోజకవర్గానికో ఫుడ్‌ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు. ఐకేపీ ద్వారా పంట ఉత్పత్తులు కొనుగోలు చేసి కల్తీలేని నాణ్యమైన సరుకులను రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందిస్తామన్నారు. రేషన్ డీలర్లను ఆదుకుంటామని, ఐకేపీ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని స్పష్టం చేశారు.
నేతన్నలకు భరోసా కల్పించాం..
సిరిసిల్ల నేతన్నలకు ప్రభుత్వం భరోసా కల్పించిందని, ఇప్పుడు ఆత్మహత్యలు ఆగాయని, నేత కార్మికులకు మెరుగైన ఉపాధి కల్పించడం తనకు సంతోషాన్నిచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు. అపెరల్ పార్క్‌లో ఉత్పత్తి చేసిన గుడ్డ రెడిమెడ్ వస్త్రాలుగా తయారై అమెరికా మార్కెట్‌లో అమ్మే స్థాయికి చేరుకోవాలన్నారు. సిరిసిల్ల నుంచి ఉద్యమ సమయంలో వెళ్తున్నప్పుడు ఆత్మహత్యలు వద్దని గోడలపై రాతలు కనిపించాయని, అప్పుడు నిజంగానే నేతన్నల బాధలు చూసి ఏడ్చానన్నారు. కేటీఆర్ లేకుంటే సిరిసిల్ల 50 ఏళ్లయినా జిల్లా అయ్యేది కాదన్నారు.
రాజన్న ఆలయ అభివృద్ధి
వేములవాడ ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు వచ్చే ఏడాది నుంచి కృషి చేస్తానని కేసీఆర్ అన్నారు. మొన్నటివరకు యాదాద్రి అభివృద్ధిపై దృష్టిసారించామని, ఇక రాజన్న దయతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పటికే కొంత భూసేకరణ జరిగిందని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇస్తున్నామన్నారు. కులవృత్తులను కాపాడేందుకు గొర్రెల పంపిణీ, గీతకార్మికుల చెట్టుపన్ను రద్దు, మత్స్యకార్మికులకు, నాయీబ్రాహ్మణులకు, రజకులకు చేయూతనిస్తున్నామన్నారు
ఇసుక దొంగలను అరికట్టాం..
‘నేను చెప్పేది వాస్తవమైతే సిరిసిల్ల, వేములవాడలో చెరో లక్ష మెజార్టీతో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలి.. లేకుంటే డిపాజిట్లు పోగొట్టాలి’ అని కేసీఆర్ అన్నారు. పదేళ్లు పాలించిన కాంగ్రెస్ హయాంలో ఇసుక ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కేవలం రూ.9.56 కోట్లని, అదే టీఆర్‌ఎస్ హయాంలో నాలుగేళ్లలో వచ్చిన ఆదాయం రూ.2,057 కోట్లని కేసీఆర్ స్పష్టం చేశారు. పదేళ్లపాటు ఇసుక ఆదాయాన్ని మింగిన దొంగలెవరో చెప్పాలన్నారు. ఇప్పటికే సిరిసిల్ల, వేములవాడలో టీఆర్‌ఎస్ గెలుపు ఖాయమైందని, ఎకోన్ముఖంగా ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
ఈ సభలో ఎంపీ కేశవరావు, ఎమ్మెల్సీలు భానుప్రసాద్‌రావు, నారదాసు లక్ష్మణ్‌రావు, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పావని, సెస్ చైర్మన్ దోర్నాల లక్ష్మారెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కో ఆర్డినేటర్ గడ్డం నర్సయ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ రీజినల్ కో ఆర్డినేటర్ గుగులోతు రేణ, డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్‌రావు, మార్క్‌ఫెడ్ చైర్మన్ గోక బాపురెడ్డి, సెస్ వైస్‌చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, అర్బన్ బ్యాంకు చైర్మన్ దార్నం లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ : కేటీఆర్ మంత్రి
దేశంలోనే తెలంగాణ అన్నిరంగాల్లో నంబర్ వన్‌గా ఉందని కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల సభలో మాట్లాడుతూ కార్మిక, ధార్మిక, కర్శక క్షేత్రమైన జిల్లాలో అన్ని రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారున. ఆశీర్వాద సభకు ఇంత భారీ సంఖ్యలో వచ్చిన సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల ప్రజలకు ధన్యవాదాలని పేర్కొన్నారు.
రూ.3వేల కోట్లతో వేములవాడ అభివృద్ధి: చెన్నమనేని రమేశ్‌బాబు, వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి
వేములవాడలో రూ.3వేల కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయని వేమువాడ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమేశ్‌బాబు అన్నారు. 40 వేల ఎకరాలకు గోదావరి జలాలు ఎల్లంపల్లి ద్వారా వచ్చాయని, సూరమ్మ చెరువుతో కొన్ని సాగునీటి ఇబ్బందులు తీరాయన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.400 కో ట్లు వచ్చాయని పేర్కొన్నారు. ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరించి మధ్యమానేరు నిర్వాసితులకు ఉపాధి చూపాలని రమేశ్‌బాబు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment