ఆశీర్వదించండి.. అన్నీ సాధిద్దాం..! | People Bless On TRSParty We Success In Election | Sakshi
Sakshi News home page

ఆశీర్వదించండి.. అన్నీ సాధిద్దాం..!

Published Wed, Nov 21 2018 5:16 PM | Last Updated on Wed, Nov 21 2018 5:22 PM

 People Bless On TRSParty  We  Success In Election  - Sakshi

సాక్షి, కరీంనగర్‌/హుజూరాబాద్‌: దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని, మరోసారి ఆశీర్వదిస్తే అనుకున్నది సాధిద్దామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణకు తలమానికంగా మారిన కరీంనగర్‌ భవిష్యత్‌లో వాటర్‌ జంక్షన్‌గా మారనుందని, జిల్లా అంతా కూడా సస్యశ్యామలంగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో హుజూరాబాద్‌ ప్రాంత ప్రజలు చురుకైన పాత్ర పోషించారన్న కేసీఆర్, ఆ ఉద్యమంలో సోదర సమానుడు ఈటల రాజేందర్, పితృసమానులైన కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు, మీరంతా కూడా నా వెనుక అడుగులో అడుగేసి నడిచారని’ అన్నారు.

మంగళవారం హుజూరాబాద్‌ మండలం ఇందిరానగర్‌–శాలపల్లిలో మంత్రి ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించారు. భారీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. రైతాంగం 70 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారని, వచ్చే జూన్‌ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభమైతే ఈ ప్రాంతానికి డోకా ఉండదన్నారు. 50 టీఎంసీల ప్రాజెక్ట్‌లు మన హుజూరాబాద్‌ నెత్తిమీదనే ఉన్నాయని, ఎల్‌ఎండీ కావొచ్చు.. మిడ్‌ మానేరు కావొచ్చని, మంత్రి రాజేందర్‌ అన్నట్లుగా వాటి వల్ల కరీంనగర్‌ జిల్లా వాటర్‌ జంక్షన్‌ కాబోతోందని స్పష్టం చేశారు.

 ఉద్యమ సమయంలో వెన్నంటి ఉన్నారు.. ఈ ప్రాంతానిది కీలక పాత్ర..

తెలంగాణ ఉద్యమ సందర్భంగా హుజూరాబాద్‌ ప్రాంత ప్రజలంతా తనకు వెన్నుదన్నుగా నిలిచారని ఇందిరానగర్‌ సభలో సీఎం కేసీఆర్‌ ఉద్యమ రోజులను నెమరు వేసుకున్నారు. ‘2001లో అద్భుతమైనటువంటి చైతన్యం చూపించిన ప్రాంతం ఇదని, తెలంగాణ వచ్చేనాడు ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు పడుతూ కష్టపడి పోరాటం చేశామని అన్నారు. ఆ సమయంలో ఈటల రాజేందర్, కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ఇద్దరు ఉద్యమంలో ప్రతీ మలుపులో తోడుగా చివరి వరకు ఉన్నారని, వారితో మీరందరూ పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆ రోజు ఈ ప్రాంత ప్రజలు ఇచ్చిన ధైర్యంతో కొట్లాడి కొట్లాడి చివరకు రాష్ట్రం ఏర్పాటు కలను సాకారం చేసుకున్నామని కేసీఆర్‌ అన్నారు.

ఉద్యమ సమయం నుంచి హుజూరాబాద్‌ ప్రాంతంతో తనకు విడదీయరాని బంధం ఉందన్న కేసీఆర్, జమ్మికుంట ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడిన భిక్షపతి సంఘటనను గుర్తు చేశారు. ‘తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు భిక్షపతి అనే మిత్రుడు కరెంట్‌ బిల్లు చెల్లించలేక హెండ్రిన్‌ (పురుగులు మందు) తాగి చనిపోయాడు.. మేమంతా జమ్మికుంటకు వచ్చాం.. బాధపడ్డాం, కన్నీరు పెట్టుకున్నాం.. అలాంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకుని మీ అందరి దీవెనలతో కంటిరెప్పపాటు కూడా కరెంట్‌ పోకుండా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్నాం’ అని కేసీఆర్‌ వివరించారు

 ఈటల రాజేందర్‌ నా కుడిభుజం.. హుజూరాబాద్‌ను అద్భుతంగా మలిచాడు..

‘ఈటల రాజేందర్‌ మీ అందరికీ తెలుసు.. ఆయన నా కుడి భుజం, బలహీన వర్గాల నుంచి వచ్చి ఇంత ఎత్తుకు ఎదిగినా ఆయన హుజూరాబాద్‌లో ఉండడం మీ అదృష్టం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. ‘నేను, నా కుడి భుజం బలంగా ఉండాలంటే ఆయనను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని’ ప్రజలను కోరారు. రాజేందర్‌ కనీవినీ ఎరుగని రీతిలో హుజూరాబాద్‌ను అభివృద్ధిలో అద్భుతంగా మలిచాడని కేసీఆర్‌ కితాబిచ్చారు. వందల కోట్లు ఖర్చు పెట్టి ఈటల రాజేందర్‌ కష్టపడి చెక్‌డ్యాంలు కట్టించారన్నారు. యుద్ధ ప్రాతిపదికన నిర్మించిన చెక్‌ డ్యాంలు రాజేందర్‌ దక్షతకు నిదర్శనమని, అవన్ని ఎప్పుడూ నీళ్లతో 365 రోజులు నిండే ఉంటాయని, ఎండిపోయే పరిస్థితే ఉండదన్నారు. అందువల్ల ఈ ప్రాంతంలో భవిష్యత్‌లో నీటి కష్టాలే ఉండవన్నారు. ఆయన పనితీరుపై తనకు ఇప్పుడే సర్వే రిపోర్టు వచ్చిందని, ఆ సర్వేలు 80 శాతం ఓట్లు వచ్చి గెలుస్తాడాని చెప్తున్నాయన్నారు. హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని ఈటల రాజేందర్‌ అద్భుతంగా అభివృద్ధి చేశాడని కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.

 ఇందిరానగర్‌ సభ సక్సెస్‌.. టీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌ జోష్‌..

హుజూరాబాద్‌ మండలం ఇందిరానగర్‌–శాలపల్లిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ విజయవంతమైంది. భారీగా తరలివచ్చిన జనం ఉద్దేశించి కేసీఆర్‌ చేసిన ప్రసంగం గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. హుజూరాబాద్‌ నుంచి సభాస్థలి, జమ్మికుంట అంతా కూడా గులాబీమయమైంది. ప్రాంగణం గులాబీ జెండాలు.. నినాదాలతో మార్మోగింది. సభ అనుకున్న సమయం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకే మొదలు కాగా, వేలాదిగా జనం సభకు తరలి వచ్చారు. కేసీఆర్‌ ప్రసంగం జరుగుతున్న సమయంలో కూడా ప్రజల తాకిడి పెరుగుతూ వచ్చింది. సభా ప్రాంగణానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు బతుకమ్మలు, కోలాటాలు, బోనాలు, డప్పు చప్పుళ్ల ప్రదర్శనతో తరలివచ్చారు. యువత బైక్‌ ర్యాలీలతో సందడి చేస్తూ సభావేదికకు వచ్చారు. టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ 2.20 గంటలకు ఇందిరానగర్‌ సభావేదిక వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు.

అనంతరం ప్రత్యేక బలగాల పర్యవేక్షణ మధ్యన సభాస్థలికి చేరుకున్నారు. ఆయనతోపాటు ఎంపీ, టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ కె.కేశవరావు, దేశిపతి శ్రీనివాస్‌ వేదికపైకి వచ్చారు. మంత్రి ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే, జెడ్పీ మాజీ చైర్మన్‌ కేతిరి సాయిరెడ్డి, ఈద శంకర్‌రెడ్డి, కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతారావు తదితరులు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. అనంతరం ఆయన భారీగా తరలివచ్చిన జనాన్ని ఉద్దేశించి ఉత్సాహభరితంగా ప్రసంగించారు. ఇందిరానగర్‌–శాలపల్లిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ భారీ బందోబస్తు మధ్య సాగింది. రెండు రోజులుగా పోలీసులు, భద్రతా సిబ్బంది సభా ప్రాంగణంతోపాటు పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు.

ఇందిరానగర్‌ సభ సక్సెస్‌ కావడం గులాబీ శ్రేణుల్లో మరింత జోష్‌ను పెంచింది. ప్రజా ఆశీర్వాద సభలో టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ కె.కేశవరావు, మంత్రి ఈటల రాజేందర్, కెప్టెన్‌ వి.లక్ష్మీకాంతారావు, మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి, ఐడీసీ చైర్మన్‌ ఈద శంకర్‌రెడ్డి, దేశిపతి శ్రీనివాస్, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శులు బండ శ్రీనివాస్, చొల్లేటి కిషన్‌రెడ్డి, చందా గాంధీ, మైనార్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ అక్బర్‌ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, హుజూరాబాద్‌ ఎంపీపీ సరోజినీ దేవి, తుమ్మేటి సమ్మిరెడ్డి, పరిపాటి రవీందర్‌రెడ్డి, కొండాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement