
సాక్షి, సిరిసిల్ల: విస్తరిస్తున్న వస్త్రోత్పత్తి రంగంతో సిరిసిల్ల మేడిన్ రెడీమేడ్ వస్త్రాల కేంద్రంగా మారుతోంది. యువతకు నమ్మకమైన ఉపాధి చూపుతోంది. సిరిసిల్లలో వస్త్రపరిశ్రమ కొత్తపుంతలు తొక్కుతోంది. రెడీమేడ్ డ్రెస్సుల తయారీతో యువతీయువకులకు మెరుగైన ఉపాధి లభిస్తోంది. గతంలో బీడీలు చేసిన మహిళలు, సాంచాలు నడిపిన యువకులు రెడీమేడ్ డ్రెస్సుల తయారీలో బతుకుదెరువు చూసుకుంటున్నారు. సిరిసిల్లలో జూకీ కుట్టు మిషన్లపై షర్ట్స్, ప్యాంట్లు, పెటీకోట్స్ కుడుతున్నారు. వస్రా్తలను హైదరాబాద్, ముంబాయి, బీవండి, సూరత్, కోల్‌కత్తా వంటి పట్టణాలతో పాటు కరీంనగర్, కామారెడ్డి, సిద్దిపేట, కొత్తపల్లి, జగిత్యాల ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. సిరిసిల్లలో డ్రెస్సుల తయారీకి బ్రాండెండ్ కంపెనీలు కూడా ఆర్డర్లు ఇస్తుండడం విశేషం. సిరిసిల్లలోని వివిధ ప్రాంతాల్లో రెడీమేడ్ వస్త్రాల తయారీ కేంద్రాలు 35 వరకు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో 30 నుంచి 75 మంది పని చేస్తున్నారు. ఇలా సిరిసిల్లలో రెండు వేల మంది ఉపాధి పొందుతున్నారు.
వస్త్రోత్పత్తి కేంద్రంలో రెడీమేడ్ దుస్తులు
సిరిసిల్ల వస్త్రోత్పత్తికి కేంద్రం. కానీ ఇప్పుడు రెడీమేడ్ వస్త్రాల తయారీకి నిలయంగా మారుతోంది. 40 ఏళ్లు దాటిన వారు సాంచాలు నడుపుతూ ఉపాధి పొందుతుండగా.. 20 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోపు వారు రెడీమేడ్ బట్టల తయారీలో శిక్షణ పొందుతూ జూకీ మిషన్లపై బట్టలు కుడుతున్నారు. నిత్యం 8 నుంచి 10 గంటలు పని చేసూ్త..నెలకు రూ.10 నుంచి రూ.15 వేల వరకు సంపాదిస్తున్నారు. కష్టమైన సాంచాల పని కంటే జూకీ కుట్టు మిషన్లపై డెస్సులు కుట్టడం ఒకింత యువకులకు వెసులుబాటు కలుగుతోంది. రెడీమేడ్ వస్త్రాలకు దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉండడంతో సిరిసిల్ల యువకులు ఆసక్తిగా పని చేస్తున్నారు. డ్రెస్సుల తయారీకి అవసరమైన వస్త్రాన్ని, మెటీరియల్‌ను హైదరాబాద్, ముంబాయి నుంచి దిగుమతి చేసుకుంటూ తయారైన రెడీమేడ్ వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు. రెడీమేడ్ రంగం సిరిసిల్లలో విస్తరిస్తోంది. ఇప్పటికే సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్డర్లు రావడంతో మరమగ్గాల కార్మికులకు మెరుగైన వేతనాలు వస్తుండగా మరోవైపు గార్మెంట్ రంగంతో యువత ఉపాధి సాధిస్తుంది.
కుటుంబానికి అండగా..
నేను ఏడోతరగతి చదువుకున్న. బీడీలు చేసేదాన్ని. ఆ పనితో నెలకు రూ.1500 వచ్చేవి. బీడీల పనితో లాభం లేదని, మిషన్‌పై షర్ట్‌్సకు అవసరమైన చార్‌టెక్ కుట్టడం నేర్చుకున్న. రోజుకు 300 అంగీలకు చార్‌టెక్ కుడుతా. ఇప్పుడు నెలకు రూ.4వేలు వస్తాయి. నా భర్త ప్రభాకర్ వైపని కార్మికుడు. మాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరం పని చేస్తేనే ఇల్లు గడుస్తుంది.
– ఒగ్గు లత, సిరిసిల్ల
నెలకు రూ.15 వేలు వస్తున్నయ్
మాది శివనగర్. నేను పదోతరగతి చదువుకున్న. టేలర్ పని నేర్చుకుని బట్టలు కుట్టేవాడిని. జూకీ మిషన్ నేర్చుకున్న. కాలర్ కుడుతా. ఒక్కో దానికి రూ.6 ఇస్తారు. ఇలా రోజుకు 70 నుంచి 80 వరకు కుడుతాను. నెలకు రూ.15 వేలు జీతం వస్తుంది. నా భార్య కూడా మిషన్ కుడుతుంది. నెలకోసారి జీతం తీసుకుంటా. నాకు పాప, బాబు. ఆరేళ్లుగా ఇదే పని చేస్తున్న.
– కారంపురి సతీష్, సిరిసిల్ల
సొంతంగా మార్కెటింగ్
నేను బట్టను ముంబాయి, బీవండి నుంచి తెచ్చి షర్ట్స్ కుట్టిస్తా. డ్రెస్సులను సొంతంగానే మార్కెట్ చేస్తున్న. హైదరాబాద్, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలతోపాటు ముంబాయి వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నా. నా వద్ద 70 మంది పని చేస్తున్నారు. నాకు సిరిసిల్లలో రెండుచోట్ల జూకీ కేంద్రాలు ఉన్నాయి. చేతినిండా పని ఉంటుంది. మంచి ఆదాయం వస్తుంది. నాతోపాటు పది మందికి పని కల్పించే స్థితికి రావడం సంతోషంగా ఉంది.
– లగిశెట్టి రాకేశ్, జూకీ, కేంద్రం నిర్వాహకుడు
జూకీ కుట్టు మిషన్‌పై డ్రెస్సులు కుడుతున్న ఇతడి పేరు ఆడెపు రమేశ్. సిరిసిల్ల ప్రగతినగర్‌కు చెందిన రమేశ్ పదోతరగతి వరకు చదువుకున్నాడు. చదువు ఆపేసి టేలర్ పని నేర్చుకున్నాడు. కొద్దిరోజులు పని చేసి ఆధునిక జూకీ మిషన్‌పై కుట్టు నేర్చుకుని ముంబాయి వెళ్లాడు. అక్కడ పదేళ్లు పనిచేశాడు. అదే పని సిరిసిల్లలో లభించడంతో ఇక్కడికి వచ్చి ఆరేళ్లుగా జూకీ మిషన్‌పై షర్ట్స్ కుడుతూ నెలకు రూ.15 వేలు సంపాదిస్తున్నాడు. ఇద్దరు పిల్లలు.. భార్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. నిత్యం రెడీమేడ్ వస్త్రాల తయారీతో ఉపాధిపొందుతున్నాడు.జూకీ మిషన్‌పై షర్ట్స్‌కు బటన్స్ పెడుతున్న ఈమె పేరు నల్లగొండ లావణ్య. సిరిసిల్ల పట్టణానికి చెందిన లావణ్య ఇంటర్ చదివింది. గతంలో ఈమె బీడీలు చేసేది. నిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేస్తే నెలకు బీడీల ద్వారా రూ.1500 వచ్చేవి. రెండేళ్ల కిందట షర్ట్స్‌కు బటన్స్ పెట్టడం నేర్చుకుని జూకీ మిషన్‌పై పని చేస్తోంది. ఇప్పుడు పీస్ వర్క్ ఆధారంగా నెలకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు సంపాదిస్తుంది. లావణ్య భర్త రమేశ్ వీడియో గ్రాఫర్. వీరికి ఇద్దరు పిల్లలు. ఇద్దరూ శ్రమిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఇద్దరే కాదు.. సిరిసిల్ల జిల్లాకేంద్రంలో రెండు వేల మంది యువకులు రెడీమేడ్ వస్త్రాల తయారీలో ఉపాధి పొందుతున్నారు.