వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ హరహర మహాదేవ నామస్మరణతో మారుమోగుతోంది. శివమాలధారులు, వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో ఆధ్యాత్మిక క్షేత్రం కిక్కిరిసిపోతోంది. వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. మహాజాతరకు నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్ జిల్లాలతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడే గుడారాలు వేసుకుంటున్నారు. ధర్మగుండంలోకి అనుమతి లేకపోవడంతో షవర్ల వద్ద స్నానాలు చేస్తున్నారు. గుడి ఆవరణలో జాగరణ కోసం భక్తులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆర్జిత సేవలను రద్దు చేసిన ఆలయ అధికారులు లఘు దర్శనాలకు మాత్రమే అనుమతించారు. రూ.3.70 కోట్లతో జాతర ఏర్పాట్లు చేశారు. రాజన్న గుడి చెరువు ఖాళీ స్థలంలో రాష్ట్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో శివార్చనలో భాగంగా 1,600 మంది కళాకారులతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాస్‌ల జారీ విషయంలో ఉద్యోగులు, పురప్రముఖులు, స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మహాశివరాత్రి జాతరకు 3 లక్షల వరకు భక్తులు వస్తారని అధికారుల అంచనా. స్వామి మహామంటపంలో ఉత్సవమూర్తులను సిద్ధం చేసి ఉంచారు.
అన్నదానం ప్రారంభం
జాతర మహోత్సవాలకు వచ్చే భక్తులు, పోలీసు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి స్థానిక వాసవీ సేవా సమితి, మన చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రమేశ్‌బాబు, మున్సిపల్ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి, ఈవో కృష్ణప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ అన్నదానం శని, ఆదివారాలు సైతం కొనసాగుతుందని నిర్వాహకులు మోటూరి మధు, కొమ్మ నటరాజ్ తెలిపారు. దాదాపు 30 వేల మందికి అన్నదానం చేయనున్నట్లు తెలిపారు.
ఉచిత బస్సు సేవలు
దేవస్థానం తరఫున 14 ఉచిత బస్సు సర్వీసులను ఏర్పాటు చేశారు. ఈ సేవలను శుక్రవారం ప్రారంభించారు. తిప్పాపూర్ బస్టాండ్ నుంచి బైపాస్‌రోడ్డు గుండా జగిత్యాల బస్టాండు, గుడిప్రాంతం, బైపాస్‌రోడ్డు ద్వారా కోరుట్లబస్టాండు, ప్రాంతాలను కలుపుతూ తిరిగి తిప్పాపూర్ బస్టాండ్ వరకు చేరుకుంటాయి. భక్తుల రద్దీని బట్టి బస్సులను తింపనున్నట్లు డీఎం మురళీకృష్ణ తెలిపారు.
ప్యూరిఫైడ్ వాటర్
మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఆలయ ఈవో కార్యాలయం వద్ద, గుడి పక్కన పార్కింగ్ ఏరియా, బద్దిపోచమ్మ గుడి వద్ద రాజన్న జలప్రసాదం మినరల్ వాటర్ ప్లాంట్‌లను ఏర్పాట్లు చేశారు. రాత్రి సమయంలో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే రమేశ్ బాబు తదితరులు శివార్చన ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి.
చదవండి: శివ నామస్మరణతో మార్మోగుతున్న తెలుగు రాష్ట్రాలు
Comments
Please login to add a commentAdd a comment