తెలుగు రాష్ట్రాలు శివ నామస్మరణతో మార్మోగుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్దఎత్తున శివాలయాలకు పోటెత్తారు. జగాలను ఏలే జంగమ దేవుడు, తినేత్రుడు, లింగాకార రూపుడైన శివునికి ఉదయం నుంచే ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు..
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైల మల్లన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి రావడంతో క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తులంతా పాతాళ గంగలో పుణ్య స్థానాలు ఆచరించి స్వామివారి దర్శించుకుంటున్నారు. అధికారులు తెల్లవారుజాము నుంచే దర్శనానికి అనుమతించారు.
రాజన్న సిరిసిల్లా జిల్లా: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడ రాజన్న క్షేత్రం భక్తుల శివనామస్మరణతో మారుమోగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు రాజన్నను దర్శించుకుంచేకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు. దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. టీటీడీ, రాష్ట్రప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం 6 గంటల నుండి స్వామివారి కల్యాణ మండపంలో అనువంశిక అర్చకులచే మహాలింగార్చన జరుగుతుంది. రాత్రి 11:30 గంటలకు లింగోద్భవ సమయంలో స్వామివారికి 11 మంది రుత్వికులచే ఆలయ అర్చకులు మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు.
విశాఖపట్నం: ఉమ్మడి విశాఖ జిల్లాలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో మహాశివుడ్ని దర్శించుకుంటున్నారు. మహాశివరాత్రి నేపథ్యంలో శివాలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. విశాఖ తీరంలో శివరాత్రి శోభ అలముకుంది. అఫీషియల్ కాలనీలోని వైశాకేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు చేశారు. ఆర్కే బీచ్‌లో టీఎస్ఆర్ సేవా పీఠం ఆధ్వర్యంలో కోటి శివలింగార్చన నిర్వహించారు. అప్పికొండలోని సోమేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు జాతర జరుగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో పూజల్లో పాల్గొంటున్నారు.
తిరుపతి: జిల్లా వ్యాప్తంగా మహా శివరాత్రి సందర్బంగా భక్తులతో శివాలయాలు కిటకిట లాడుతున్నాయి. శ్రీకాళహాస్తీశ్వర స్వామి సన్నిధిలో భక్త జనం పోటెత్తారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఉదయం ఇంద్ర విమానం వాహనం, రాత్రి కి నంది - సింహ వాహనంపై స్వామి, అమ్మవార్లు దర్శనం ఇవ్వనున్నారు.
కపిల తీర్థం ఆలయం జలపాతం వద్ద భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, దీపారాధన చేస్తున్నారు. కపిలేశ్వర స్వామి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఈరోజు ఉదయం రధోత్సవం, రాత్రి నంది వాహన సేవ ఉంది. ఏర్పేడు మండలం గుడిమల్లంలో కొలువైన పరశురామేశ్వర స్వామి ఆలయానికి మహా శివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు.
అనకాపల్లి జిల్లా: సబ్బవరం మండలం లింగాల తిరుగుడులో సోమలింగేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. చోడవరంలోని గంగా సమేత పార్వతి పరమేశ్వర స్వయంభు ఆలయంలో శివరాత్రి సందర్బంగా పూజలు నిర్వహించారు. ఎస్ రాయవరం మండలం పంచదార్లలలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు చేశారు.
అల్లూరి జిల్లా: హుకుంపేట మండలం మఠం పంచాయతీలో మత్స్య లింగేశ్వర స్వామి శివరాత్రి జాతర ప్రారంభమైంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అనంతగిరి మండలం బొర్రా గుహల్లో శివరాత్రి జాతర జరుగుతోంది. గుహల్లో వెలిసిన మహాశివుడికి గిరిజనులు అభిషేకాలు చేస్తున్నారు. కాశీపట్టణంలో ఉమా రామలింగేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివెళ్తున్నారు. శివలింగపురంలో స్వయంభు శివలింగాన్ని దర్శించుకుంటున్నారు.
సూర్యాపేట జిల్లా: మేళ్లచెరువు లోని స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. శివరాత్రి వేడకుల్లో ఎమ్మెల్యే సైదిరెడ్డి పాల్గొన్నారు.
పశ్చిమగోదావరి జిల్లా: మహా శివరాత్రి సందర్భంగా భీమవరంలోని పంచారామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్దన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మార్మోగుతోంది. పాలకొల్లులోని పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీరికి ఏటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కృష్ణాజిల్లా: కృత్తివెన్ను శ్రీ దుర్గా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి జోగి రమేష్ మంత్రి జోగి రమేష్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన దేవదాయ ధర్మదాయ శాఖ ఏసీ గోపీనాథ్ బాబు. శ్రీ నాగేశ్వర స్వామి వారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి జోగి రమేష్.
కృష్ణాజిల్లా: మహాశివరాత్రి సందర్భంగా మోపిదేవి మండలం పెద్దకళ్లపల్లిలో దుర్గా నాగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు దంపతులు.
ఏలూరు జిల్లా: ముసునూరు మండలం బలివే రామలింగేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. బలివే రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మేకాప్రతాప్ అప్పారావు.
కీసరగుట్టకు పోటెత్తిన భక్తులు
మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కీసరగుట్టకు భక్తులు పోటెత్తారు. శివరాత్రి పర్వదినాన్ని పురుస్కరించుకుని ప్రసిద్ధ శైవ క్షేత్రమైన కీసరగుట్ట భక్త జనసంద్రంతో నిండిపోయింది. శ్రీ భవాని శివదుర్గ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకుని తరించేందుకు భక్తులు రాష్ట్రంలోని నలుమూలల నుండి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment