సాక్షి, రాజన్న సిరిసిల్ల: ఆమె వైకల్యాన్ని ఎదురించింది. కాలి వేళ్లు కలం పట్టాయి.. కవితలు రాశాయి. ఆ కవితలే ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. ఆమె గాథ.. మరికొందరిలో స్పూర్తి నింపింది కూడా. కానీ, దురదృష్టవశాత్తూ.. కాళ్లతో కవితలు రాసే కవయిత్రిగా దక్కించుకున్న ఆమె ఇక లేరు. కవయిత్రి బూర రాజేశ్వరి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు.
సిరిసిల్ల పట్టణం సాయినగర్‌లో ఓ పేద నేతన్న కుటుంబంలో మూడో సంతానంగా జన్మించింది బూర రాజేశ్వరి. పదిహేనవ ఏట దాకా ఆమె నడవలేదు. అయితే.. వైకల్యాన్ని చూసి ఏనాడూ ఆమె బాధపడలేదు. కసిగా కవితలు రాయడం మొదలుపెట్టింది. తల్లిదండ్రులు సాంబయ్య, అనసూయల ప్రోత్సాహంతో చదువుకుంది. తన కవితలతో సిరిసిల్ల రాజేశ్వరిగా పేరుగాంచారామె. సుమారు 700ల దాకా కవితలు రాసి అందరినీ ఆకట్టుకున్నారామె.ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు రాజేశ్వరి ఏకలవ్య శిష్యురాలు. ఆయన పాటలు, మాటలు ఆమెను ఎంతో ప్రభావితం చేశాయట. రాజేశ్వరి గురించి తెలుసుకున్న సుద్దాల అశోక్ తేజ, తన భార్య నిర్మలతో కలిసి సిరిసిల్లకు వెళ్లి ఆమెను కలిశారు.
తన తల్లితండ్రులు సుద్దాల హనుమంతు, జానకమ్మల పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారం కూడా ఆయన రాజేశ్వరికి బహుకరించారు. రాజేశ్వరి రాసిన 350 కవితలను పుస్తకంగా తీసుకువచ్చి, రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు.ఈ విషయాన్ని కేవీ రమణాచారి.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దివ్యాంగురాలైనప్పటికీ సాహిత్యంలో ఆమె రాణించడం.. కేసీఆర్‌ను ఆకట్టుకుంది. వెంటనే ప్రభుత్వం తరపున ఆమె పేరిట రూ.10 లక్షలు ఫిక్స్డ్ చేయించారు. తంగళ్ళపల్లి మండలం మండేపల్లిలోని కేసీఆర్ కాలనీలో ఆమెకు ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కూడా కేటాయించారు. నెల నెల రూ.10 వేల పెన్షన్ ఇస్తూ వస్తున్నారు.
దివ్యాంగురాలు కావడంతో.. తన భావాలను, మనుసులో ఉన్న బాధలను ఆమె కవిత రూపంలో రాశారు. అదే ఆమెకు గుర్తింపు తెచ్చింది. ఆ సమయంలో రాజేశ్వరి జీవిథ గాధను చాలా టీవీ ఛానెళ్లు, పత్రికలు కథనాలు వెలువరించాయి. అయితే 42 ఏళ్ల వయసులో ఆమె అనారోగ్యం బారిన పడింది. చికిత్స అందినా ప్రాణం నిలవలేకపోయింది. రాజేశ్వరి మృతి పట్ల స్థానికంగా సంతాపం వెల్లడిస్తున్నారు. ఆమె మృతి వార్తను మంత్రి కేటీఆర్ కు తెలియజేశారు స్థానిక బీఆర్‌ఎస్ నేతలు. పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన ఆమె సాహిత్య ప్రయాణాన్ని.. మహారాష్ట్ర విద్యాశాఖ ఇంటర్ సిలబస్‌లో సెకండ్ లాంగ్వేజ్ తెలుగు పుస్తకంలో పాఠ్యాంశంగా ప్రచురించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment