
కేటీఆర్ (ఫైల్ ఫొటో)
సాక్షి, రాజన్న సిరిసిల్ల: ఇల్లంతకుంటలో జరిగిన రైతు బంధు సభలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. సభలో కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 46 వేల చెరువులను నింపేందుకు మిషన్ కాకతీయ ద్వారా కృషి చేస్తున్నామన్నారు. ‘నాలుగేళ్ళ క్రితం ఉమ్మడి రాష్ట్రంలో రైతులను ఎవ్వరు పట్టించుకోలేదు. రైతాంగానికి 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ. 2009లో అప్పటి ప్రభుత్వం 9 గంటలని చెప్పి గంట కూడా కరెంటు ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు ఉంటే వార్త.. ఇప్పుడు కరెంటు లేకపోతే వార్త.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కరెంటు, విత్తనాలు సరైన సమయానికి వస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బిడ్డ కాబట్టి రైతుల కోసం ఆలోచన చేస్తున్నారు. రైతుల రుణమాఫీ చేసిన ఏడాది తర్వాత పెట్టుబడి సాయం కోసం ప్రకటన చేశారు. 86 ఏళ్ళ తర్వాత భూ రికార్డుల ప్రక్షాళన చేసి 60 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు ఇస్తున్న నాయకుడు మన సీఎం కేసీఆర్. రూ. 200 పింఛను ఇచ్చేందుకు గత పాలకులు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం రూ. 1000 ఇస్తుంది.
రైతు బంధు ద్వారా కేసీఆర్ రైతులకు ఆత్మబంధువుగా మారారు. రైతు బంధు కార్యక్రమాన్ని కాంగ్రెస్ నేతలు విమర్శించడం సిగ్గుచేటు. రైతులకు సాగు, తాగునీటితో పాటు పెట్టుబడి ఇస్తున్నది దేశంలో ఒక్క తెలంగాణ మాత్రమే. దేశంలో సరికొత్త హరిత విప్లవానికి తెలంగాణ ఆదర్శం కానుంది. తెలంగాణలో కోటి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే గొప్ప కార్యక్రమానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఉపాధి హామీ పథకం చాలా గొప్పది. వ్యవసాయానికి ఉపాధి హామీని అనుసంధానం చేసే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. రైతు సమస్యలపై తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి అవగహన ఉంది’ అని కేటీఆర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment