సాక్షి, రాజన్న సిరిసిల్ల: వేములవాడ మండలం తిప్పాపూర్ శివారులో వాగేశ్వరి స్కూల్ వ్యాన్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన ఐదుగురు విద్యార్థులు సిరిసిల్లా ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వాగేశ్వరి స్కూల్ కు చెందిన విద్యార్థులు 27 మంది మధ్యాహ్నం భోజనానికి స్కూల్ నుంచి వ్యాన్‌లో చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఉన్న హాస్టల్ కు వెళ్తుండగా డ్రైవర్ నిర్లక్ష్యంతో డివైడర్ ఎక్కి వ్యాన్ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో మానాల కు చెందిన 2వతరగతి విద్యార్థిని దీక్షిత, వట్టెంలకు చెందిన పదోతరగతి విద్యార్థిని మనస్విని అక్కడికక్కడే మృతి చెందగా, మానాల కు చెందిన రిషి సిరిసిల్ల ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. మరో ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానికులు వేములవాడ, సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వ్యాన్ డ్రైవర్ ను పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ రాహుల్ హెగ్డే సందర్శించి ప్రమాదంపై కేసు నమోదు చేస్తామని, డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
స్కూల్పై చర్యలు తీసుకొని మృతి చెందిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో పాటు స్థానికులు ఆందోళనకు దిగారు. వేములవాడ ఆర్టీసీ డిపో దగ్గర జరిగిన ప్రమాద స్థలాన్ని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ పరిశీలించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ విద్యార్థులు చినపోవటం దురదృష్టకరమన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వం ద్వారా వైద్య సేవలు అందిస్తామని తెలిపారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటామని ప‍్రకటించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment