సాక్షి, సిరిసిల్ల : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తోందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసినప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓట్ల కోసం బీజేపీ నేతలు వస్తే రాష్ట్రానికి ఏం చేశారో నిలదీయండని అన్నారు. రాజకీయంగా సిరిసిల్ల నాకు జన్మనిచ్చిందని, ఇక్కడి ప్రజలు పెట్టినభిక్ష వల్లే రాజకీయంగా ఎంతో ఎదిగానని కేటీఆర్ పేర్కొన్నారు. గాడిదలకు గడ్డి వేసి ఆవుల పాలు పితికితే పాలురావని, పనిచేసే టీఆర్ఎస్ పార్టీనే గెలిపించాలని ఓటర్లుకు విజ్ఞప్తి చేశారు.
రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘70ఏళ్ల నుంచి కాంగ్రెస్, టీడీపీ బీజేపీ ప్రభుత్వాలు పాలించాయి. రాజన్న ఆలయంలో భక్తులు సౌకర్యాల పట్ల కనీస ఆలోచన చేయలేదు. చరిత్రలోనే మొదటి సారిగా రూ.220కోట్లతో వేములవాడ లోఅభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. వేములవాడకు సీఎం కేసీఆర్ ఇప్పటికే నాలుగు సార్లు వచ్చి అభివృద్ధిపై చర్చించారు. రాజకీయంగా సిరిసిల్ల నాకు జన్మనిచ్చింది. సిరిసిల్ల ప్రజలు పెట్టిన బిక్ష వల్లే రాజకీయంగా ఎదిగాను. ఐదేళ్ల క్రితం ఈ ప్రాంత ముఖచిత్రం మార్చి చూపిస్తానని చెప్పాను, మారిందా లేదా?. ఎప్పుడైనా సిరిసిల్ల ఇంత అభివృద్ధి చెందుతుందని మీరు ఊహించారా? చేసి చూపించాం. సిరిసిల్ల అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఉరిశాలగా చూసేవారు. ఇప్పుడు సిరిసిల్ల సిరిశాలగా మార్చాను. ఇంత అభివృద్ధి చేసిన టీఆర్ఎస్ కాకుండా ఇంకెవరికైనా ఓటు అడిగే హక్కు ఉందా. మేం పెట్టిన అభ్యర్థులను ప్రత్యుర్థులు ఓడిస్తామంటే ఊరుకుంటామా.
సిరిసిల్లను రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అగ్రశ్రేణి పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత నాది. ఒక్క పేదవాడు లేకుండా వారికి ఇళ్ళు ఇచ్చే బాధ్యత నాది. జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాల తీసుకువస్తున్నాం. తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలను దేశం గర్వించేలా అభివృద్ధి చేస్తాం. 75 గజాలలోపు స్థలం ఉంటే ఎలాంటి అనుమతులు లేకుండా ఇల్లు నిర్మించుకునేలా మున్సిపల్ చట్టం తెచ్చాం. 75 గజాల కంటే ఎక్కువ ఉంటే ఇంటి నిర్మాణానికి 21 రోజుల్లో అనుమతి ఇస్తాం. ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థులు గెలిచాక తప్పు చేస్తే తొలగించేలా చట్టం తెచ్చాం. అధికారులు సైతం తప్పు చేస్తే ఉద్యోగం నుంచి తొలగించేలా చట్టం ఉంది. గెలిపించే బాధ్యత ప్రజలది, పని చేసే బాధ్యత మాది. గోదావరి నీళ్ళు సిరిసిల్లకు తెచ్చి ఇక్కడి ప్రజల కాళ్లు కడిగాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment